ఫిల్మ్స్ వదిలేయాలనుకున్న శ్రీలీల.. అసలు కారణం ఇదే
ప్రస్తుతం శ్రీలీల తన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చుకుంది. ఒకప్పుడు దేనికైతే భయపడిందో, ఇప్పుడు దాన్నే ధైర్యంగా ఎదుర్కోవడం నేర్చుకుంది.
By: Madhu Reddy | 22 March 2026 3:00 PM ISTటాలివుడ్ యంగ్ హీరోయిన్ శ్రీలీల తన అందం, అభినయం, అదిరిపోయే డ్యాన్స్‌తో కుర్రకారు మనసు గెలుచుకున్నరు. హీరోయిన్ గా 'పెళ్ళి సందD'తో ఎంట్రీ ఇచ్చి, అతి తక్కువ కాలంలోనే పవన్ కళ్యాణ్, మహేష్ బాబు వంటి స్టార్ హీరోల సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. అయితే వెండితెరపై ఎప్పుడూ నవ్వుతూ కనిపించే ఈ చిన్నది, కెరీర్ మొదట్లో తీవ్రమైన మానసిక వేదనను అనుభవించిందట. ఏకంగా సినిమాలే వదిలేయాలని నిర్ణయించుకున్న ఆ చేదు జ్ఞాపకాలను ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పంచుకుంది. ఆ విశేషాలు మీకోసం..
సోషల్ మీడియా ట్రోల్స్ తెచ్చిన కన్నీళ్లు:
శ్రీలీల కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న అతిపెద్ద సమస్య సోషల్ మీడియా ట్రోలింగ్. మనం చూస్తుంటాం కదా, ఎవరో ఏదో అన్నారని మనం ఎంత బాధపడతామో, సెలబ్రిటీల పరిస్థితి అంతకంటే దారుణంగా ఉంటుంది.ఇక శ్రీలీల చాలా సున్నిత మనస్కురాలు కావడం వల్ల, నెటిజన్లు చేసే నెగిటివ్ కామెంట్స్ తనను బాగా గాయపరిచాయట. "మొదట్లో ఆ ట్రోల్స్ చూసి తట్టుకోలేకపోయేదాన్ని, ఒంటరిగా కూర్చుని చాలా ఏడ్చేదాన్ని" అంటూ తన మనసులోని బాధను బయటపెట్టింది. చిన్న వయసులోనే అంత నెగిటివిటీని చూడటం ఆమెకు పెద్ద సవాల్‌గా మారింది.
సినిమాలకు గుడ్ బై చెప్పాలనుకున్న క్షణం:
ఇక ట్రోలింగ్ మరీ ఎక్కువ కావడంతో ఒకానొక దశలో శ్రీలీల పూర్తిగా నిరాశకు లోనైందట. ఇక గ్లామర్ ప్రపంచం తనకు వద్దని, ప్రశాంతంగా చదువుకుంటానని నిర్ణయించుకుంది. వెంటనే తన తల్లి దగ్గరకు వెళ్లి, "అమ్మా, నాకు ఈ సినిమాలు వద్దు.. నేను మళ్ళీ కాలేజీకి వెళ్లి నా చదువు కంటిన్యూ చేస్తాను" అని చెప్పిందట. ఎంత ఒత్తిడి ఉంటే ఒక హీరోయిన్ అంతటి నిర్ణయం తీసుకుంటుందో అర్థం చేసుకోవచ్చు. కానీ ఆమె తల్లి ఇచ్చిన ధైర్యం, సపోర్ట్ వల్లే శ్రీలీల మళ్ళీ వెనక్కి తగ్గకుండా పోరాడగలిగింది.
కుంగిపోకుండా రాటుదేలిన శ్రీలీల:
ప్రస్తుతం శ్రీలీల తన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చుకుంది. ఒకప్పుడు దేనికైతే భయపడిందో, ఇప్పుడు దాన్నే ధైర్యంగా ఎదుర్కోవడం నేర్చుకుంది. ఇప్పుడు జనాలు కూడా చాలా మారుతున్నారని, ఎవరైనా పనిగట్టుకుని టార్గెట్ చేస్తే సపోర్ట్ చేసేవారు కూడా ఉన్నారని ఆమె అంటోంది. "నెగిటివ్ కామెంట్స్‌ని ఎలా డీల్ చేయాలో ఇప్పుడు నాకు అర్థమైంది" అంటూ తనలో వచ్చిన మార్పును గర్వంగా చెప్పుకొచ్చింది.ఇక ఈ పరిణతి వల్లే ఆమె ఇప్పుడు పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' వంటి క్రేజీ ప్రాజెక్టుల్లో భాగమైంది.
కొత్త ఉత్సాహంతో మూడు భాషల్లో బిజీ:
కష్టాలన్నీ దాటుకుని వచ్చిన ఈ డ్యాన్సింగ్ క్వీన్, ఇప్పుడు కేవలం టాలీవుడ్‌కే పరిమితం కావడం లేదు. తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లో కూడా భారీ ఆఫర్లు దక్కించుకుంటూ దూసుకుపోతోంది. ఏ ట్రోల్స్ అయితే తనను ఇబ్బంది పెట్టాయో, అవే తనకు పాఠాలు నేర్పాయని ఆమె నమ్ముతోంది. ఇప్పుడు మరింత కాన్ఫిడెన్స్‌తో తన కెరీర్‌ను ప్లాన్ చేసుకుంటోంది. శ్రీలీల ప్రయాణం చూస్తుంటే, పడిలేచిన కెరటంలా మరింత వేగంతో దూసుకుపోవడమే తన తర్వాతి లక్ష్యం అనిపిస్తోంది. ఇక 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీ ఉగాదికి రిలీజ్ అయ్యి హిట్ టాక్ తో దూసుకుపోతుంది.
