Begin typing your search above and press return to search.

సోష‌ల్ మీడియాలో టాప్ ఎర్న‌ర్‌గా దూసుకెళుతున్న శ్రీ‌లీల‌

టాలీవుడ్ యువ సంచలనం, స్టార్ హీరోయిన్ శ్రీలీల కేవలం వెండితెరపైనే కాకుండా సోషల్ మీడియా వేదికగానూ బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లతో దూసుకుపోతోంది.

By:  Sivaji Kontham   |   20 Jun 2026 10:32 AM IST
సోష‌ల్ మీడియాలో టాప్ ఎర్న‌ర్‌గా దూసుకెళుతున్న శ్రీ‌లీల‌
X

టాలీవుడ్ యువ సంచలనం, స్టార్ హీరోయిన్ శ్రీలీల కేవలం వెండితెరపైనే కాకుండా సోషల్ మీడియా వేదికగానూ బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లతో దూసుకుపోతోంది. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ (ట్విట్టర్) వేదిక‌లలో నిరంతరం రకరకాల వాణిజ్య ప్రకటనలను పోస్ట్ చేస్తూ బిజీగా ఉంటోంది. సినిమాలతో పాటు ఈ డిజిటల్ ప్రమోషన్ల రూపంలో ఈ యువ‌న‌టి ఏడాదికి కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జిస్తోంది. సోషల్ మీడియాలో శ్రీలీల క్రేజ్, త‌ను పోస్ట్ చేసే యాడ్స్ ఆధారంగా సంపాదనపై ప్రత్యేక విశ్లేషణ.

శ్రీలీలకు ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో మిలియన్ల కొద్దీ ఫాలోవర్లు ఉన్నారు. ఒక సోర్స్ ప్రకారం.. శ్రీ‌లీల‌ ఇన్‌స్టాగ్రామ్‌లో చేసే ఒక్కో బ్రాండ్ ప్రమోషన్ లేదా యాడ్ పోస్టింగ్‌కు సుమారు రూ. 8 లక్షల నుండి రూ. 10 లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు అంచనా. సాధారణంగా ఈ తెలుగు బ్యూటీ నెలకు 4 నుండి 5 బ్రాండ్ యాడ్స్‌ను తన ఖాతాలో పోస్ట్ చేస్తుంటుంది. దీని ద్వారా నెలకు ఇన్‌స్టాగ్రామ్ నుంచే దాదాపు రూ. 35 లక్షల నుండి రూ. 40 లక్షల వరకు ఆదాయం లభిస్తోంది. ఈ లెక్కన ఏడాదికి ఇన్‌స్టాగ్రామ్ ద్వారానే సుమారు రూ. 4 కోట్ల నుండి రూ. 5 కోట్ల వరకు ఆర్జిస్తోందని చెప్పవచ్చు.

ఇన్‌స్టాగ్రామ్‌తో పోలిస్తే ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో యాడ్ పోస్టింగుల ధరలు కొంత భిన్నంగా ఉంటాయి. శ్రీలీల తన ఎక్స్ ఖాతాలో చేసే ఒక్కో ప్రమోషనల్ పోస్ట్‌కు దాదాపు రూ. 3 లక్షల నుండి రూ. 5 లక్షల వరకు ఛార్జ్ చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల అంచనా. ఇన్‌స్టాగ్రామ్‌లో చేసే ప్రధాన ప్రకటనలను ఎక్స్‌లో కూడా షేర్ చేస్తూ అదనపు ఆదాయాన్ని పొందుతోంది. కేవలం సోషల్ మీడియా పోస్టింగుల ద్వారానే కాకుండా... బ్రాండ్ అంబాసిడర్‌గా సంతకం చేయడం, టీవీ కమర్షియల్స్ (టీవీసీ) లో నటించడం ద్వారా ఈ యంగ్ బ్యూటీకి ఏటా భారీ మొత్తంలో రెమ్యునరేషన్ అందుతోంది.

ఇటీవలి కాలంలో శ్రీలీల సోష‌ల్ మీడియా ఖాతాలను పరిశీలిస్తే.. ప్రముఖ బ్రాండ్ల ప్రమోషన్లు దర్శనమిస్తున్నాయి. తాజాగా ప్రముఖ సబ్బుల బ్రాండ్ `సంతూర్` కొత్త ప్రొడక్ట్ అయిన `సంతూర్ శాండల్‌వుడ్ షవర్ జెల్` ప్రకటనలో మెరిసింది. క్లాసిక్ చందనం గుణాలను సరికొత్తగా రీమిక్స్ చేస్తూ జెనరేషన్ జీ ని ఆకట్టుకునేలా ఈ ప్రమోషన్ చేసింది. అలాగే `అలన్ చిప్స్`కు సంబంధించిన ఫుట్‌బాల్ కాంటెస్ట్ `అలన్స్ అరేనా`ను ప్రమోట్ చేస్తూ యువతను ఆకట్టుకుంది. ప్ర‌స్తుతం ఫిఫా వ‌రల్డ్ క‌ప్ 2026 ఫీవ‌ర్ యూత్ ని ఊపేస్తున్న త‌రుణంలో ఈ ప్ర‌క‌ట‌న కార్పొరెట్ ఉత్ప‌త్తికి పెద్ద మైలేజ్ ని ఇస్తోంది.

వీటితో పాటు కార్పొరేట్ దిగ్గజం బిర్లా గ్రూప్‌కు చెందిన `బిర్లా ఓపస్ పెయింట్స్` కుటుంబంలో చేరినట్లు ప్రకటిస్తూ, గోడలపై మరకలను నివారించే ఈ సరికొత్త పెయింట్ యాడ్‌లో శ్రీలీల నటించింది. అలాగే వేసవి ఎండల నుంచి రక్షణ కల్పించే `సన్‌స్టాపబుల్ స్ప్రే మిస్ట్` సన్‌స్క్రీన్ ప్రొడక్ట్‌ను కూడా తన స్టైల్‌లో ప్రమోట్ చేసింది. ఇలా టాప్ బ్రాండ్లన్నింటికీ కేరాఫ్ అడ్రస్‌గా మారుతూ అటు సినిమాలు ఇటు డిజిటల్ ప్రకటనల ద్వారా శ్రీలీల టాలీవుడ్‌లో అత్యధిక ఆదాయం గడిస్తున్న యంగ్ హీరోయిన్లలో ఒకరిగా నిలుస్తోంది.

టాలీవుడ్, కోలీవుడ్ చిత్రసీమల్లో టాప్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న శ్రీలీల ద‌క్షిణాదిన‌ ఒక్కో సినిమాకు సుమారు రూ. 2 కోట్ల నుండి రూ. 3 కోట్ల వరకు పారితోషికం అందుకుంటోంది. తన నటన, అద్భుతమైన డాన్స్ స్కిల్స్‌తో సౌత్ ఇండియాలో భారీ క్రేజ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ... ఇక్కడి స్టార్ హీరోల సరసన నటించేందుకు డిమాండ్‌ను బట్టి తన రెమ్యునరేషన్‌ను అటు ఇటుగా సర్దుబాటు చేస్తోంది. ప్రాంతీయ భాషల్లో సాధించిన ఈ ఘన విజయాల గుర్తింపుతోనే ఇటీవ‌ల‌ బాలీవుడ్ నుండి కూడా భారీ ఆఫర్లు క్యూ కడుతున్నాయి.

సౌత్ మార్కెట్ పరిధిని దాటి బాలీవుడ్‌లో అడుగుపెడుతున్న శ్రీలీలకు అక్కడ ఒక్కో సినిమాకు దాదాపు రూ. 4 కోట్ల వరకు రెమ్యునరేషన్ ఆఫర్ చేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా బాలీవుడ్ యంగ్ స్టార్ కార్తీక్ ఆర్యన్ సరసన నటిస్తున్న‌ కొత్త సినిమా కోసం ఆమెకు భారీ మొత్తంలో పారితోషికం ఖరారైనట్లు ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ద్వారా హిందీ పరిశ్రమలో గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్న శ్రీలీల అక్కడ తన మార్కెట్ రేంజ్‌ను మరింత పెంచుకుంటూ అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే యంగ్ హీరోయిన్ల జాబితాలో నిలుస్తోంది.