టాలీవుడ్ ఇవ్వని కిక్కు కోలీవుడ్ ఇస్తుందా?
టాలీవుడ్‌లో `పెళ్లిసందడి`తో ఎంట్రీ ఇచ్చిన ఈ క్రేజీ లేడీ ఫస్ట్ మూవీతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. వరుస క్రేజీ ఆఫర్లని సొంతం చేసుకుంది.
By: Ravindar Gorantla | 21 Feb 2026 4:00 AM ISTఇండియాలో ఉన్న ఫిల్మ్ ఇండస్ట్రీలకు మించి దక్షిణాది చిత్ర పరిశ్రమల్లో ఉండే హడావిడి ఎక్కడా కనిపించదు. మరీ ముఖ్యంగా టాలీవుడ్ ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలతో టాక్ ఆఫ్ ది ఇండియాగా మారడంతో అందరి దృష్టి మన ఇండస్ట్రీ పైనే ఉంది. కోలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు అంతా మన దగ్గర మేకింగ్ జరుపుకునే సినిమాల గురించే ఆసక్తిగా చూస్తున్నారు. అయితే క్రేజీ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న శ్రీలీల తీరు మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంది. 2017లో అంజలి కీలక పాత్రలో వచ్చిన `చిత్రాంగద` మూవీతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా అరంగేట్రం చేసినా కన్నడ సినిమాతోనే హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించింది.
టాలీవుడ్‌లో `పెళ్లిసందడి`తో ఎంట్రీ ఇచ్చిన ఈ క్రేజీ లేడీ ఫస్ట్ మూవీతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. వరుస క్రేజీ ఆఫర్లని సొంతం చేసుకుంది. రోషన్ టు సూపర్‌స్టార్ మహేష్‌బాబు వరకు క్రేజీ ప్రాజెక్ట్‌లలో నటించింది కానీ ఆశించిన స్థాయిలో మాత్రం సక్సెస్‌లని దక్కించుకోలేకపోతోంది. మాస్ మహారాజా రవితేజతో చేసిన కామెడీ యాక్షన్ డ్రామా `ధమాకా` తరువాత ఆ స్థాయి సూపర్ హిట్‌ని దక్కించుకోలేపోయింది. బ్యాక్ టు బ్యాక్ స్టార్ హీరోల సరసన నటించే ఛాన్స్‌లు దక్కించుకుంటున్నా ఫలితం లేకుండా పోతోంది.
త్రివిక్రమ్, మహేష్‌ల కాంబినేషన్‌లో చేసిన `గుంటూరు కారం`తో శ్రీలీల దశ తిరుగుతుందని, ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగు తుందని అంతా భావించారు. కానీ విధి మరోలా ప్లాన్ చేసి భారీ డిజాస్టర్‌ని అందించి షాక్ ఇచ్చింది. అయినా సరే శ్రీలీల డిమాండ్ ఏమాత్రం తగ్గలేదు కానీ హిట్టు లేదే అనే కామెంట్‌లు మాత్రం కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ప్రస్తుతం పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న యాక్షన్ కామెడీ డ్రామా `ఉస్తాద్ భగత్‌సింగ్`లో నటిస్తోంది.
దీనిపై అమ్మడు భారీ ఆశలే పెట్టుకుందట. పవన్, హరీష్ శంకర్‌ల కాంబినేషన్‌లో `గబ్బర్‌సింగ్` వంటి బ్లాక్ బస్టర్ తరువాత వస్తున్న సినిమా కావడంతో అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే విడుదలై పవర్ స్టార్ ఆరా వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. సినిమా కూడా ఓ రేంజ్‌లో బాక్సాఫీస్‌ని షేక్ చేస్తుందని అభిమానులు, సినీ లవర్స్ గట్టి నమ్మకంతో ఉన్నారు. కానీ శ్రీలీల మాత్రం తన దృష్టిని టాలీవుడ్ నుంచి కోలీవుడ్‌కు షిఫ్ట్ చేస్తోంది. ఇక్కడి కంటే అక్కడ ఎదగాలని అడుగులు వేస్తోంది.
ఈ ఏడాది శివకార్తికేయన్‌తో కలిసి `పరాశక్తి`లో నటించింది. ఇక్కడ పెద్దగా ఆడకపోయినా తమిళంలో మాత్రం హిట్ టాక్‌ని సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద వంద కోట్లు రాబట్టింది. ఈ మూవీతో పాటు మరో రెండు తమిళ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ధనుష్ 55వ ప్రాజెక్ట్‌తో పాటు అజిత్ హీరోగా అధిక్ రవిచంద్రన్ మూవీలో నటించనుంది. ఇవి కాకుండా మరో రెండు తమిళ క్రేజీ ప్రాజెక్ట్‌లని కూడా శ్రీలీల చేయడానికి రెడీ అవుతోంది. అంటే 2026 మొత్తం శ్రీలీల తమిళ సినిమాలకే కేటాయిస్తుందన్నమాట. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ ఇవ్వని కిక్కు కోలీవుడ్ ఇస్తుందా? అని ఫ్యాన్స్ కామెంట్‌లు చేస్తున్నారు.
