Begin typing your search above and press return to search.

డాక్టర్ టైటిల్ కార్డ్‌కు నో చెప్పిన శ్రీలీల… ఎందుకంటే?

ఉగాది కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ప్రమోషన్స్ ప్రస్తుతం జోరుగా సాగుతున్నాయి.

By:  Sravani Lakshmi Srungarapu   |   18 March 2026 8:26 PM IST
డాక్టర్ టైటిల్ కార్డ్‌కు నో చెప్పిన శ్రీలీల… ఎందుకంటే?
X

ఉగాది కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ప్రమోషన్స్ ప్రస్తుతం జోరుగా సాగుతున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ నిర్వహిస్తున్న ప్రమోషనల్ ఈవెంట్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని మరింత పెంచుతున్నాయి. ముఖ్యంగా హీరోయిన్ శ్రీలీల తన ఎనర్జీ, స్పాంటేనిటీతో ఈ ప్రమోషన్స్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

ఇండ‌స్ట్రీలోని టాప్ డ్యాన్స‌ర్ల‌లో ఒక‌రిగా గుర్తింపు

తాజాగా నిర్వహించిన ప్రీ-రిలీజ్ ప్రెస్ మీట్‌లో శ్రీలీల పాల్గొని పలువురు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. టాలీవుడ్ బిగ్ స్టార్స్ అయిన మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ తన డ్యాన్స్‌పై ప్రశంసలు కురిపించిన విషయంపై ఆమెను మీడియా స్పంద‌న అడ‌గ్గా, దానికి ఆమె ఎంతో వినయంగా స్పందించింది. అది వాళ్ల పెద్ద మనస‌ని, వారేదో సరదాగా అలా అన్నారని భావిస్తున్నానంటూ సింపుల్‌గా సమాధానం ఇచ్చి అందరినీ ఆకట్టుకుంది. అయితే, శ్రీలీల డ్యాన్స్ టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనే విషయం తెలిసిందే. ఇప్పటికే అనేక సినిమాల్లో తన ఎనర్జిటిక్ స్టెప్పులతో ప్రేక్షకులను అలరించిన ఆమె, ఇండస్ట్రీలో టాప్ డ్యాన్సర్లలో ఒకరిగా గుర్తింపు పొందింది.

శ్రీలీలను త‌ట్టుకోవ‌డం క‌ష్ట‌మ‌న్న మ‌హేష్

ఇదే విషయాన్ని గతంలో మహేష్ బాబు కూడా ప్రస్తావించిన సంగతి తెలిసిందే. గుంటూరు కారం సినిమా సమయంలో శ్రీలీలతో డ్యాన్స్ చేయడం చాలాచాలా ఛాలెంజింగ్‌గా అనిపించిందని ఆయన పేర్కొన్నారు. ఆమె స్పీడ్, ఎనర్జీకి సరితూగడం అంత ఈజీ కాదని చెప్పిన వ్యాఖ్యలు అప్పట్లో వైరల్ అయ్యాయి. ఇక మరో ఆసక్తికర అంశం శ్రీలీల వ్యక్తిగత జీవితానికి సంబంధించినది. ఇటీవల ఆమె తన మెడికల్ చదువును పూర్తి చేసి డాక్టర్ డిగ్రీని అందుకున్న సంగ‌తి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఈ సినిమాలో మీ పేరు ముందు ‘డాక్టర్’ అని టైటిల్ కార్డ్‌లో వేస్తారా? అనే ప్రశ్నకు ఆమె ఇచ్చిన సమాధానం కూడా ఆకట్టుకుంది. అది త‌న‌ వ్యక్తిగత జీవిత‌మ‌ని, ఇది సినీ కెరీర్ అని, రెండూ వేర్వేరు అని.. స్క్రీన్‌పై ఎప్పటిలాగానే త‌న‌ పేరు మాత్రమే కనిపిస్తుంద‌ని క్లారిటీ ఇచ్చింది. అదే సమయంలో, తాను డాక్టర్ అవ్వడంలో సినీ పరిశ్రమ సహకారం కూడా ఉందని ఆమె ప్రత్యేకంగా చెప్పింది. షూటింగ్‌ల మధ్యలో చదువుకు సమయం కేటాయించేందుకు అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపింది. తన జీవితంలో డాక్టర్ డిగ్రీ సాధించడం ఒక గొప్ప మైలురాయి అని పేర్కొంది.

ఇంకా మాట్లాడుతూ, చదువుకున్న అమ్మాయిలు కూడా సినిమాల్లోకి రావచ్చని, ఇండస్ట్రీ చాలా సేఫ్ ప్లేస్ అని ఆమె నమ్మకంగా చెప్పింది. హాస్పిటల్‌లో డాక్టర్ శ్రీలీల… సెట్లో యాక్టర్ శ్రీలీల అంటూ చమత్కారంగా సమాధానం ఇచ్చి అందరి మనసు గెలుచుకుంది శ్రీలీల‌. మొత్తంగా, తన వినయంతో, ప్రతిభతో, కష్టపడే తత్వంతో శ్రీలీల మరోసారి ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంటోందని చెప్పడంలో సందేహం లేదు. ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్‌కు ముందు నుంచే ఆమెపై అంచనాలు మరింత పెరుగుతున్నాయి.