గ్లోబల్ ప్లాట్‌ఫామ్‌పై శ్రీలీల..
శ్రీలీల ఎదుగుదల అందరికీ ఒక రాకెట్ దూకుడులా అనిపించవచ్చు, కానీ ఆమె దృష్టిలో ఇది చిన్న చిన్న అడుగులతో మొదలైన ప్రయాణం.
By: Madhu Reddy | 1 April 2026 10:07 PM ISTటాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీల ఇప్పుడు కేవలం సౌత్ ఇండియాకే పరిమితం కాకుండా నేషనల్ లెవల్లో మెరిసిపోతోంది. 'హార్పర్స్ బజార్ ఇండియా' డిజిటల్ కవర్ స్టార్‌గా నిలిచిన ఈ బ్యూటీ, స్టార్ హీరోయిన్‌గా ఇండ్రస్ట్రీ లో తనదైన ముద్ర వేస్తోంది. గ్లామర్ కంటే నిజాయితీతో కూడిన నటనకే తాను ప్రాధాన్యత ఇస్తానని చెబుతున్న శ్రీలీల.. మన ఊరి కథలే ప్రపంచాన్ని మెప్పిస్తాయని నమ్ముతోంది. తాజాగా ఆమె పంచుకున్న తన సినీ ప్రయాణం మరియు భవిష్యత్తు ఆలోచనలు ఇవే..
స్టార్‌డమ్ వెనుక నిశ్శబ్ద ప్రయాణం:
శ్రీలీల ఎదుగుదల అందరికీ ఒక రాకెట్ దూకుడులా అనిపించవచ్చు, కానీ ఆమె దృష్టిలో ఇది చిన్న చిన్న అడుగులతో మొదలైన ప్రయాణం. "ఇది ఒక్కసారిగా వచ్చిన గుర్తింపు కాదు, నిశ్శబ్దంగా వేసిన అడుగులు ఇప్పుడు అందరికీ కనిపిస్తున్నాయి" అని ఆమె అంటోంది. ప్రతిరోజూ కొత్త విషయాలు నేర్చుకుంటూ, పాతవి వదిలేస్తూ తనను తాను మల్చుకుంటున్నానని తెలిపింది. ఎంత ఎత్తుకు ఎదిగినా తన మూలాలను మర్చిపోకుండా, సామాన్యంగా ఉండటమే తన విజయరహస్యమని ఆమె తెలిపింది.
పుష్ప 2' నుంచి బాలీవుడ్ ఎంట్రీ వరకు:
శ్రీలీల కెరీర్ ఇప్పుడు పీక్ లో ఉంది. 'పుష్ప 2' లో తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్‌తో అందరినీ ఆకట్టుకోవడమే కాకుండా, తరువాత వచ్చిన 'గుంటూరు కారం'లో కీలక పాత్ర పోషించి మెప్పించింది. ఇక తాజాగా ఈ ఉగాది కి ఉస్తాద్ భగత్ సింగ్ తో అలరించింది. ఇప్పుడు అనురాగ్ బసు దర్శకత్వంలో కార్తీక్ ఆర్యన్ సరసన బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైంది. ప్రాంతీయ సరిహద్దులు చెరిగిపోతున్న ఈ సమయంలో, విభిన్న పాత్రల్లో జీవించడం తనకెంతో ఇష్టమని ఆమె అంటోంది. రకరకాల లెన్స్‌ల ద్వారా ప్రపంచాన్ని చూడటం తన ప్రయాణానికి దిక్సూచిగా మారిందని వివరించింది.
మన మూలాలే మన బలం:
భారతీయ సినిమా తర్వాతి దశ గురించి శ్రీలీల ఆసక్తికరమైన విషయాలు చెప్పింది. "మన కథలు ఎంత లోకల్‌గా, మన మూలాలకు దగ్గరగా ఉంటే.. అవి అంత గ్లోబల్‌గా ప్రజలకు చేరువవుతాయి" అని ఆమె బలంగా నమ్ముతోంది. మన చిన్న పట్టణాల్లోని కథలు, మన సంస్కృతి, మన గుర్తింపును ప్రపంచ ప్లాట్‌ఫామ్‌పై ఎక్కడా తగ్గకుండా చూపించాలని ఆమె ఆశిస్తోంది. కథలను సింప్లిఫై చేయకుండా, వాటి ఒరిజినల్ కాపాడుతూనే ప్రపంచాన్ని గెలవవచ్చని శ్రీలీల అభిప్రాయపడింది.
వైద్య విద్యార్థి నుంచి గ్లోబల్ స్టార్ వరకు:
ఒకవైపు డాక్టర్ విద్యను పూర్తీ చేసి, మరోవైపు థియేటర్లను ఊపేసే హీరోయిన్ గా , ఈ రెండు భిన్నమైన పాత్రలను శ్రీలీల బ్యాలెన్స్ చేస్తున్న తీరు అద్భుతం. స్టార్‌డమ్ తలకెక్కించుకోకుండా, నిలకడగా తన లక్ష్యం వైపు దూసుకుపోతోంది. ఇక కేవలం గ్లామర్ హీరోయిన్ కాకుండా, బాధ్యతగల నటిగా గుర్తింపు తెచ్చుకోవాలన్న ఆమె తపన మెచ్చుకోదగ్గది. భవిష్యత్తులో శ్రీలీల మరిన్ని వైవిధ్యమైన కథలతో గ్లోబల్ స్టేజ్ మీద తన జెండా ఎగురవేయాలని ఆశిద్దాం..
