దీపావళి స్పెషల్: మాస్ జాతర ముచ్చట్లు.. బాల్యం గుర్తుచేసుకున్న శ్రీ లీల!
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి 'పెళ్లి సందD' అనే సినిమా ద్వారా ప్రేక్షకులకు పరిచయమై మొదటి సినిమాతోనే మంచి పేరు దక్కించుకుంది.
By: Madhu Reddy | 20 Oct 2025 11:00 AM ISTటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి 'పెళ్లి సందD' అనే సినిమా ద్వారా ప్రేక్షకులకు పరిచయమై మొదటి సినిమాతోనే మంచి పేరు దక్కించుకుంది. ఆ తర్వాత రవితేజ హీరోగా నటించిన 'ధమాకా' సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ సెలబ్రిటీ అయిపోయింది శ్రీ లీల. ఆ తర్వాత వరుసగా అవకాశాలు తలుపు తట్టాయి. కానీ కథల ఎంపిక విషయంలో కాస్త తడబడడంతో అమ్మడికి సరైన గుర్తింపు రాలేదు. దాంతో పుష్ప 2 సినిమాలో స్పెషల్ సాంగ్ కూడా చేసి అందరిని అబ్బురపరిచింది. ప్రస్తుతం మళ్లీ ధమాకా కాంబో రిపీట్ అవుతున్న విషయం తెలిసిందే. మాస్ మహారాజా రవితేజ తో మళ్లీ జతకట్టింది శ్రీ లీల. అక్టోబర్ 31వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతోంది.
ఈ నేపథ్యంలోనే పలు ప్రమోషనల్ కార్యక్రమాలలో పాల్గొంటున్న శ్రీ లీల.. తాజాగా దీపావళి స్పెషల్ సందర్భంగా ఒక ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలను చెప్పుకొచ్చింది. అటు మాస్ జాతర ముచ్చట్లతో పాటు బాల్యంలో తన ఇంట్లో దీపావళి ఎలా జరుపుకునేవారు అనే విషయంపై కూడా స్పందించింది. ఇంటర్వ్యూలో భాగంగా మీ ఇంట్లో దీపావళి ఎలా జరుపుకునే వారు? చిన్నప్పుడు మీరు ఏం చేసే వాళ్ళు? అని ప్రశ్నించగా.. శ్రీ లీలా మాట్లాడుతూ.. "దీపావళి రోజు నాకు ఇంటిని చాలా అందంగా అలంకరించకపోవడం అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడైతే హడావుడిగా చిన్న చిన్న ముగ్గులు వేసి...వాటిని పూలతో అలంకరించి ఇల్లంతా దీపాలు పెట్టేదాన్ని.
చీకటి పడ్డాక ఇంట్లోనే కరెంటు లైట్లు అన్ని ఆపేసి.. ఆ దీపాల కాంతుల్లో గడిపే వాళ్ళము. పండుగ తెల్లవారాక.. దీపాల కింద పడిన నూనెను శుభ్రం చేసుకోవడం మరో పెద్ద టాస్క్. అయితే ఈ ఏడాది ఓ సినిమా షూటింగ్ కారణంగా ముంబైలో ఉండిపోవడం వల్ల.. ఈసారి దీపావళిని అమ్మతో కలిసి ఇక్కడే చేసుకోబోతున్నాను అంటూ తెలిపింది. అలాగే టపాసులు అంటే చాలా భయం అని.. ఎవరైనా పెద్దగా శబ్దాలు చేసే బాంబులు పేలుస్తున్నారు అంటే ఆమడ దూరం ఉండేదాన్ని అని తెలిపింది.
అలాగే వ్యక్తిగతంగా మిమ్మల్ని మీరు ఏ టపాసుతో పోల్చుకోవడానికి ఇష్టపడతారు అని ప్రశ్నించగా.. మా అమ్మ నన్ను మా ఇంటికి అఖండ దీపంలా భావిస్తుంది.. మా అన్నయ్యలు మాత్రం నన్ను చిచ్చుబుడ్డితో పోలుస్తారు అంటూ సరదాగా తెలిపింది శ్రీ లీల.
మాస్ జాతర ముచ్చట్ల గురించి కూడా ఆమె మాట్లాడుతూ.. ఈ సినిమా థియేటర్లలో చాలా గట్టిగా సౌండ్ చేయబోతోంది. ఒక మంచి కామెడీ ఎంటర్టైనర్ మూవీ. ఇందులో నేను తులసి అనే పల్లెటూరి అమ్మాయిగా ఒక టీచర్ పాత్రలో కనిపిస్తాను. ఈ సినిమా కోసం నేను తొలిసారి శ్రీకాకుళం యాసలో సంభాషణలు కూడా పలికాను.. అంటూ మాస్ జాతర సినిమాలో తన పాత్ర గురించి రివీల్ చేసి అభిమానులకు ఒక క్లారిటీ ఇచ్చింది శ్రీలీల. మరి థియేటర్లలో 1000 వాలా లాగా పేలపోతుందని చెప్పిన శ్రీలీల ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
