శ్రీలీల పనైపోయినట్లేనా...?
శ్రీలీల ప్రస్తుతం చేస్తున్న పెద్ద సినిమాలు ఏమీ లేవు. గత ఏడాది ఈమె నటించి రాబిన్‌హుడ్, జూనియర్, మాస్ జాతర సినిమాలు వచ్చాయి. ఆ మూడు సినిమాలు తీవ్రంగా నిరాశ పరిచాయి.
By: Ramesh Palla | 15 July 2026 1:10 PM ISTటాలీవుడ్‌లో వరుసగా స్టార్ హీరోలకు జోడీగా నటించి ఒక్కసారిగా స్టార్ హీరోయిన్‌గా మారిన ముద్దుగుమ్మ శ్రీలీల. తక్కువ సమయంలోనే టాలీవుడ్‌లో ఎక్కువ సినిమాలు చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. ధమాకా హిట్‌తో ఏకంగా అరడజను సినిమాలను ఈ అమ్మడు దక్కించుకున్న విషయం తెల్సిందే. మహేష్ బాబు గుంటూరు కారం సినిమాలో హీరోయిన్‌గా నటించడం ద్వారా స్టార్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారుతుందని అంతా భావించారు. కానీ శ్రీలీల కెరీర్‌లో ఎంత స్పీడ్‌గా ఎదిగిందో, అంతే స్పీడ్‌గా డౌన్ అయిందనే అభిప్రాయంను కొందరు వ్యక్తం చేస్తున్నారు. గత కొంత కాలంగా సోషల్ మీడియాలో శ్రీలీల గురించి విమర్శలు వినిపిస్తున్నాయి. స్టార్ హీరోల సినిమాల్లో శ్రీలీలకు అవకాశాలు రావడం లేదు. చిన్న హీరోలతో సరి పెట్టుకోవాల్సిందే అని, మళ్లీ మొదటి నుంచి శ్రీలీల కెరీర్‌ను ప్లాన్ చేసుకోవాల్సిందే అంటూ నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మాస్ జాతర సినిమా తర్వాత...
శ్రీలీల ప్రస్తుతం చేస్తున్న పెద్ద సినిమాలు ఏమీ లేవు. గత ఏడాది ఈమె నటించి రాబిన్‌హుడ్, జూనియర్, మాస్ జాతర సినిమాలు వచ్చాయి. ఆ మూడు సినిమాలు తీవ్రంగా నిరాశ పరిచాయి. అయితే ఈ ఏడాదిలో పవన్ కళ్యాణ్‌తో కలిసి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో వచ్చిన విషయం తెల్సిందే. ఆ సినిమా పర్వాలేదు అనిపించినా, శ్రీలీల పెద్దగా హైలైట్ కాలేదు అనేది చాలా మంది అభిప్రాయం. ఆ కారణంగానే శ్రీలీలను మెల్ల మెల్లగా ఫిల్మ్ మేకర్స్ సైడ్ చేస్తున్నారా అనే అనుమానాలను సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు. ఆ మధ్య అఖిల్ అక్కినేని లెనిన్ సినిమా నుంచి పూజా హెగ్డేను తప్పించిన విషయం తెల్సిందే. ఇప్పుడు మరో బిగ్ హీరో సినిమా నుంచి శ్రీలీలను తప్పించారు అనే వార్తలు గుప్పుమంటున్నాయి. తమిళ్‌లో పరాశక్తి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన శ్రీలీలకు నిరాశే మిగిలింది. దాంతో మళ్లీ తమిళ్ ఆఫర్ వస్తుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి .
అజిత్ కుమార్‌కు జోడీగా శ్రీలీల...
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ హీరోగా అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందబోతుంది. ఇప్పటి వరకు సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రాలేదు. కానీ సినిమా గురించిన బ్యాక్ గ్రౌండ్ వర్క్ జరుగుతుందని తమిళ మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. అజిత్ కుమార్ స్వయంగా ఈ సినిమాను నిర్మించేందుకు రెడీగా ఉన్నాడని కూడా సమాచారం అందుతోంది. తన సొంత బ్యానర్‌లో సినిమా కనుక అజిత్ ఒకటికి రెండు సార్లు జాగ్రత్తలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని, అందుకే హీరోయిన్, ఇతర నటీనటుల విషయంలో అజిత్ కుమార్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడని కోలీవుడ్ మీడియా వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఇంతకు ముందు అజిత్‌కు జోడీగా శ్రీలీలను దర్శకుడు అధిక్ ప్లాన్ చేశాడు. ఆమెతో చర్చలు జరపడంతో పాటు, అడ్వాన్స్ కూడా ఇచ్చారనే వార్తలు వచ్చాయి.
కయాదు లోహర్ హీరోయిన్‌గా..
పరాశక్తి సినిమా నిరాశను మిగల్చడంతో శ్రీలీల విషయంలో కోలీవుడ్‌లో ఆసక్తి తగ్గింది. ఆ సినిమా హిట్ అయ్యి ఉంటే తప్పకుండా అజిత్ కుమార్‌కు మరో ఆలోచన లేకుండా శ్రీలీల హీరోయిన్‌గా నటించి ఉండేది. కానీ ఇప్పుడు ఆలోచన మారిందనే ప్రచారం జరుగుతోంది. లెనిన్‌లో ఎలా అయితే శ్రీలీలను తొలగించి మరో హీరోయిన్‌ను ఎంపిక చేశారో అలాగే అజిత్, అధిక్ మూవీలోనూ శ్రీలీలను తప్పించి మరో హీరోయిన్‌ను నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో కోలీవుడ్‌లో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు కయాదు లోహర్. ఆమెను ఈ సినిమాలో అజిత్ కు జోడీగా నటింపజేయడానికి చర్చలు జరుగుతున్నాయని కోలీవుడ్‌లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు ఆ విషయమై దర్శకుడు అధిక్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. నిజంగానే శ్రీలీలను అజిత్ మూవీ నుంచి తొలగిస్తే కెరీర్ పరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, అంతే కాకుండా శ్రీలీల పనైపోయిందని కూడా పలువురు కామెంట్స్ చేస్తున్నారు. అయితే శ్రీలీల బౌన్స్ బ్యాక్ కావడం ఖాయం అని ఆమె అభిమానులు కొందరు ఉదాహరణలతో సహా చెబుతున్నారు. మరి శ్రీలీల బౌన్స్ బ్యాక్ అయ్యేనా? స్టార్ హీరోలకు జోడీగా ఈ అమ్మడు నటించే అవకాశాలు దక్కించుకునేనా చూడాలి.
