విష్ణు విన్యాసం ఎలా ఉండనుంది? శ్రీవిష్ణు ఏం చెప్పారంటే?
టాలీవుడ్ లో కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో శ్రీవిష్ణు మరోసారి కంప్లీట్ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
By: M Prashanth | 25 Feb 2026 10:27 PM ISTటాలీవుడ్ లో కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో శ్రీవిష్ణు మరోసారి కంప్లీట్ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆయన నటించిన లేటెస్ట్ మూవీ విష్ణు విన్యాసం.. ఇప్పటికే పాటలు, టీజర్, ప్రమోషన్లతో మంచి బజ్ సొంతం చేసుకుని ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. విడుదలకు ముందు నిర్వహించిన ప్రీరిలీజ్ ప్రెస్ మీట్ లో మూవీ టీమ్ తమ నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ సినిమాపై అంచనాలు పెంచింది.
దర్శకుడు యదునాథ్ మారుతీ రావు మాట్లాడుతూ, సినిమా జర్నీ గుర్తు చేసుకున్నారు. మొదటి సినిమా అయినప్పటికీ, టీమ్ మొత్తం ఎంతో డెడికేషన్ తో పని చేశామని చెప్పారు. ప్రేక్షకులను రెండు గంటల పాటు నవ్విస్తూ, ఎమోషన్స్ తో కట్టిపడేసేలా కథను తీర్చిదిద్దామని తెలిపారు. ముఖ్యంగా శ్రీ విష్ణు తనకు అన్నలా అండగా నిలిచి, ప్రతి విషయంలో సహాయం చేశారని కృతజ్ఞతలు తెలిపారు. చిత్రాన్ని థియేటర్లలో చూసి ఆదరించాలని ప్రేక్షకులను కోరారు.
హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ, సినిమా మీద ఉన్న నమ్మకాన్ని క్లియర్ గా వెల్లడించారు. స్టోరీ వినగానే ఇది కంప్లీట్ ఎంటర్టైనర్ మూవీ అవుతుందని అర్థమైందన్నారు. షూటింగ్ పూర్తయ్యాక స్వయంగా సినిమా మొత్తం రెండు సార్లు చూశానని, ప్రతి సీన్ ప్రేక్షకులను అలరించేలా ఉందని చెప్పారు. ఫస్ట్ హాఫ్ హిట్.. సెకండ్ హాఫ్ బ్లాక్ బస్టర్ అంటూ ఆయన చెప్పడం అభిమానుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది.
విష్ణు విన్యాసం సినిమా తన కెరీర్ లోనే పెద్ద విజయాల్లో ఒకటిగా నిలుస్తుందని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు. ఆ తర్వాత నిర్మాత సుమంత్ జి నాయుడు మాట్లాడుతూ.. ఇండస్ట్రీలోని పలువురు పెద్దలు ఇచ్చిన సహకారాన్ని గుర్తు చేసుకున్నారు. సినిమా నిర్మాణ సమయంలో ఎదురైన కొన్ని సవాళ్లను అందరి సహకారంతో అధిగమించామని తెలిపారు. మంచి కుటుంబ కథా చిత్రంగా విష్ణు విన్యాసం రూపొందిందని తెలిపారు.
ప్రతి వర్గం ప్రేక్షకులు ఆస్వాదించేలా కంటెంట్ ఉంటుందని చెప్పారు. ఇప్పటికే బుకింగ్స్ ఓపెన్ అవ్వగా మంచి స్పందన వస్తోందని వెల్లడించారు. ఇక ఈ చిత్రానికి రిలీజ్ పరంగా కూడా ప్రత్యేకత ఉంది. శ్రీ విష్ణు కెరీర్ లోనే అత్యధిక స్క్రీన్ లలో విడుదల అవుతున్న సినిమా ఇదేనని నిర్మాత తెలిపారు. ఇది చిత్రంపై ఉన్న క్రేజ్ కు నిదర్శనమని చెప్పారు. ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతుండటంతో ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరుగుతోంది.
ఏదేమైనా కామెడీ, ఎమోషన్స్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఎలిమెంట్స్ తో రూపొందిన చిత్రంగా విష్ణు విన్యాసం సిద్ధమైంది. కథ, పాటలు, టీజర్ తో ఇప్పటికే మంచి అంచనాలు నెలకొనగా.. మూవీ టీమ్ నమ్మకం కూడా సినిమాకు మరింత బలం చేకూరుస్తుంది. భారీ అంచనాల మధ్య విష్ణు విన్యాసం ఈ నెల 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. మరి శ్రీ విష్ణు చెప్పినట్టే ఫస్ట్ హాఫ్ హిట్, సెకండ్ హాఫ్ బ్లాక్ బస్టర్ అవుతుందా లేదా అన్నది వేచి చూడాలి.
