కథ నచ్చిన తర్వాత శ్రీవిష్ణు అవి చెక్ చేస్తాడట..!
శ్రీవిష్ణు తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఒక సినిమాకు కమిట్ కావడానికి ముందు, కథ విన్న తర్వాత ఏ విషయాలను పరిగణలోకి తీసుకుంటాడు అనే విషయాన్ని చెప్పుకొచ్చాడు.
By: Ramesh Palla | 6 Oct 2026 1:01 PM ISTవిభిన్న కథలు ఎంపిక చేసుకుంటూ ఎప్పటికప్పుడు ప్రేక్షకులకు విభిన్న చిత్రాలను అందిస్తున్న యంగ్ హీరో శ్రీవిష్ణు. ఈయన కెరీర్ ఆరంభం నుంచి విభిన్న చిత్రాలను చేయడం మనం చూస్తూనే ఉన్నాం. ఈ ఏడాదిలో శ్రీవిష్ణు నాలుగు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అందులో రెండు సినిమాల్లో గెస్ట్ రోల్‌లో కనిపించగా, విష్ణు విన్యాసం, మృత్యుంజయ్ సినిమాల్లో హీరోగా కనిపించాడు. సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా శ్రీవిష్ణు ఒక మంచి కథతో వచ్చాడు, కొత్త నేపథ్యం ను తీసుకుని ప్రేక్షకుల ముందుకు వచ్చాడు అనే టాక్ ఎప్పుడూ వస్తుంది. అందుకే ఇప్పుడు శ్రీవిష్ణు నుంచి రాబోతున్న కామ్రేడ్ కళ్యాణ్ విషయంలోనూ అదే జరుగుతోంది. టైటిల్ విభిన్నంగా ఉండటంతో పాటు, నక్సలైట్ బ్యాక్‌గ్రౌండ్‌లో కామెడీ మూవీ అని టీజర్, పోస్టర్స్ చూస్తే అర్థం అవుతుంది. శ్రీవిష్ణు మరోసారి విభిన్నమైన సినిమాతో వస్తున్నాడని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
శ్రీవిష్ణు కామ్రేడ్ కళ్యాణ్ సినిమా రిలీజ్...
కామ్రేడ్ కళ్యాణ్ సినిమాలో శ్రీవిష్ణు నక్సలైట్‌గా కనిపించబోతున్నట్లు ప్రమోషన్ వీడియోలు, ఫోటోలు చూస్తే అర్థం అవుతుంది. 1990 కాలంలో ఆంధ్రప్రదేశ్ నేపథ్యంలో పీరియాడిక్ యాక్షన్ కామెడీ డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో శ్రీవిష్ణకు జోడీగా మహిమా నంబియార్ నటించింది. అక్టోబర్ 9, 2026న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా శ్రీవిష్ణు యాక్టివ్‌గా వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నాడు. సినిమాను ప్రతిసారి విభిన్నంగా పబ్లిసిటీ చేసుకుంటూ జనాల్లోకి శ్రీవిష్ణు తీసుకు వెళ్లడం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా మరోసారి శ్రీవిష్ణు తన కామ్రేడ్ కళ్యాణ్ సినిమాను జనాల ముందుకు తీసుకు వస్తున్న తీరుకు ఇండస్ట్రీ వర్గాల వారు అభినందిస్తున్నారు. ఇప్పటికే సినిమాకు పాజిటివ్ బజ్ క్రియేట్ కావడంతో ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎప్పుడు సినిమాను చూస్తామా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
శ్రీవిష్ణు కొత్త సినిమా ఎంపిక...
శ్రీవిష్ణు తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఒక సినిమాకు కమిట్ కావడానికి ముందు, కథ విన్న తర్వాత ఏ విషయాలను పరిగణలోకి తీసుకుంటాడు అనే విషయాన్ని చెప్పుకొచ్చాడు. శ్రీవిష్ణు మాట్లాడుతూ.. కథ విన్న తర్వాత ప్రధానంగా నేను ఇంతకు ముందు చేసిన సినిమాల కథలతో ఈ కథ ఏమైనా టచ్ అవుతుందా, ఏదైనా పాయింట్‌లో తన గత చిత్రాలను పోలి ఉందా అని చూస్తాను, ఈ సినిమాను యూత్ ఆడియన్స్‌కి సర్వ్ చేస్తున్నామా లేదంటే ఫ్యామిలీ ఆడియన్స్ కోసం చేస్తున్నామా అనే విషయాన్ని చూస్తాను. అందుకు తగ్గట్టుగా కథ ఉందా అని కూడా చూస్తాను. ఈ కథ ఎలాంటి ఆడియన్స్ ను ఆకట్టుకుంటుంది, ఇలాంటి జోనర్ ఇప్పుడు వెళ్తుందా అనే విషయాలను చూసుకుంటాను. ఈ మధ్య ఇలాంటి పాయింట్‌తో ఎవరైనా సినిమాలు తీశారా అనే విషయాన్ని కూడా చూసిన తర్వాత సినిమాకు కమిట్ అవుతాను అన్నాడు.
కామ్రేడ్ కళ్యాణ్ కమర్షియల్ హిట్..!
తన ప్రతి సినిమాలోని కథ దేనికి అదే అన్నట్టుగా కొత్తగా ఉండాలనే ఉద్దేశంతో తాను ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటాను అంటూ శ్రీవిష్ణు చేసిన వ్యాఖ్యలు చాలా మంది కొత్త హీరోలకు ఆదర్శం అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వరుసగా సినిమాలు చేయడం కాకుండా, కొత్త కథను, కొత్తదనం ను ప్రేక్షకులకు అందించడం వల్ల తప్పకుండా ఆదరిస్తారు అని శ్రీవిష్ణు అభిప్రాయం. కెరీర్ ఆరంభం నుంచి శ్రీవిష్ణు అదే పద్దతి ఫాలో అవుతున్నాడు, అదే ఆయనకు పలు విజయాలను తెచ్చి పెట్టింది. కమర్షియల్‌గా సినిమా హిట్ కాకున్నా ఒక మంచి సినిమాను శ్రీవిష్ణు చేశాడు అనే పేరు మాత్రం దక్కుతుంది. అయితే ఈసారి కామ్రేడ్ కళ్యాణ్‌తో శ్రీవిష్ణు కమర్షియల్‌గా కూడా ఒక మంచి విజయాన్ని సొంతం చేసుకుంటాడనే విశ్వాసం ను ఆయన సన్నిహితులు, అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. విభిన్నమైన ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని దక్కించుకుంటుంది అనేది చూడాలి.
