శ్రీవిష్ణుకు నాలుగో రోజే గుడ్ న్యూస్!
ఒక సినిమా విడుదలైనప్పుడు మొదటి రోజు కలెక్షన్లతోనే హిట్, ఫ్లాప్ అంచనాలు మొదలవుతుంటాయి.
By: M Prashanth | 13 Oct 2026 6:00 PM ISTఒక సినిమా విడుదలైనప్పుడు మొదటి రోజు కలెక్షన్లతోనే హిట్, ఫ్లాప్ అంచనాలు మొదలవుతుంటాయి. కానీ అసలు బాక్సాఫీస్ లెక్క వీకెండ్ ముగిశాక ఉంటుంది. శ్రీవిష్ణు 'కామ్రేడ్ కళ్యాణ్' విషయంలో ఇప్పుడు అలాంటి పరిస్థితి కనిపిస్తోంది. మొదటి రోజు మోస్తరు ఓపెనింగ్స్‌తో మొదలైన సినిమా శని, ఆదివారాల్లో పుంజుకుంది. సోమవారం వసూళ్లు తగ్గినా చిత్రబృందం నుంచి మాత్రం బిజినెస్‌కు సంబంధించి ఒక గుడ్ న్యూస్ వచ్చింది.
అక్టోబర్ 9న విడుదలైన 'కామ్రేడ్ కళ్యాణ్' తొలి రోజు ఇండియాలో రూ.2.10 కోట్ల నెట్ సాధించినట్లు ట్రేడ్ లెక్కలు చెబుతున్నాయి. శనివారం రూ.3 కోట్లు, ఆదివారం రూ.3.05 కోట్లు వచ్చాయి. సోమవారం ఆ మొత్తం రూ.1.55 కోట్లకు తగ్గింది. నాలుగు రోజులకు ప్రపంచవ్యాప్తంగా రూ.13 కోట్లకు పైగా గ్రాస్ నమోదైంది. వీకెండ్‌లో సినిమాకు వచ్చిన రెస్పాన్స్ తో పాటు సోమవారం కూడా కోటిన్నర వరకు వసూళ్లు రావడం మేకర్స్‌కు కలిసొచ్చింది.
ఇప్పుడు నాలుగు రోజుల్లోనే అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ పూర్తయిందని చిత్రబృందం ప్రకటించింది. సినిమా హక్కులు కొన్న పంపిణీదారులకు పెట్టుబడి తిరిగొచ్చిందనేది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇక సినిమా కంటెంట్ విషయానికి వస్తే నక్సలిజం నేపథ్యాన్ని కామెడీతో కలిపి దర్శకుడు జానకిరామ్ మారెళ్ల కథ నడిపించారు. శ్రీవిష్ణు, సత్య మధ్య కామెడీ సన్నివేశాలకు మంచి స్పందన వచ్చినా సెకండాఫ్, కథలోని కొన్ని లాజిక్స్ విషయంలో మిశ్రమ అభిప్రాయాలు వినిపించాయి.
అయినప్పటికీ బాక్సాఫీస్ దగ్గర సినిమా నిలబడింది. రివ్యూల్లో వచ్చిన విమర్శలతో సంబంధం లేకుండా వినోదం కోసం థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకుల్లో ఒక వర్గానికి ఈ సినిమా కనెక్ట్ అయినట్లు కలెక్షన్లు చెబుతున్నాయి. శ్రీవిష్ణుకు 'సామజవరగమన', 'సింగిల్' లాంటి సినిమాలతో కామెడీ హీరోగా ఒక ప్రత్యేకమైన మార్కెట్ ఏర్పడింది. అయితే మధ్యలో 'స్వాగ్', 'మృత్యుంజయ్' వంటి భిన్నమైన కథలతో కొత్తగా కనిపించాడు.
ఇప్పుడు 'కామ్రేడ్ కళ్యాణ్'తో మళ్లీ తనకు గుర్తింపు తెచ్చిన ఎంటర్టైన్మెంట్ వైపే వచ్చారు. ఈసారి తొంభైల నాటి రాజకీయ పరిస్థితులను కథలోకి తీసుకురావడం స్పెషల్. నిర్మాతలు వెంకట కృష్ణ కర్నాటి, సీతా కర్నాటి నిర్మించిన ఈ చిత్రాన్ని కోన వెంకట్ సమర్పించారు. ఇక రెండో వారంలో ఈ సినిమాకు థియేటర్ల పోటీ ఎక్కువగా ఉండనుంది.
అక్టోబర్ 15న రజనీకాంత్ 'జైలర్ 2', మరుసటి రోజు విజయ్ దేవరకొండ 'రణబాలి' విడుదలవుతున్నాయి. ఈ రెండు సినిమాలకు ఎక్కువ షోలు కేటాయిస్తే 'కామ్రేడ్ కళ్యాణ్' స్క్రీన్ల సంఖ్య తగ్గే అవకాశం ఉంది. ఆలోపే బ్రేక్ ఈవెన్ సాధించడం మంచి విషయం. మరోవైపు మంగళవారం ఐదో రోజు బుకింగ్స్ కూడా కొనసాగుతున్నాయి. ఇక వీకెండ్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.
