ట్రెండీ స్టోరి: 'ఆల్ఫా' కాపీక్యాట్ మూవీనా! నెటిజనులేమంటున్నారు?
వైఆర్‌ఎఫ్ (YRF) స్పై యూనివర్స్‌లో భాగంగా ఆలియా భట్, శర్వరి, బాబి డియోల్ ప్రధాన పాత్రలలో రూపొందుతున్న భారీ యాక్షన్ చిత్రం ఆల్ఫా.
By: Sivaji Kontham | 21 Jun 2026 6:00 PM ISTవైఆర్‌ఎఫ్ (YRF) స్పై యూనివర్స్‌లో భాగంగా ఆలియా భట్, శర్వరి, బాబి డియోల్ ప్రధాన పాత్రలలో రూపొందుతున్న భారీ యాక్షన్ చిత్రం ఆల్ఫా. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ విడుదలైనప్పటి నుండి సోషల్ మీడియాలో దీనిపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. సామాజిక మాధ్యమాలలో కామెంట్స్ ప్రకారం ఈ సినిమాపై నెటిజన్లు `కాపీ క్యాట్` ముద్ర వేస్తున్నారు. హాలీవుడ్ సినిమాలు.. పాపులర్ వెబ్ సిరీస్‌ల నుండి యధాతథంగా సీన్లను కాపీ కొట్టి ఈ సినిమాను తెరకెక్కించారంటూ సామాజిక మాధ్యమ వేదిక `రెడ్డిట్`లోని బాలీవుడ్ ఫోరమ్‌లో తీవ్రస్థాయిలో ట్రోల్స్ మొదలయ్యాయి.
నెటిజన్లు కేవలం ఆరోపణలు చేయడమే కాకుండా... హాలీవుడ్ చిత్రాలలోని సీన్లతో కూడిన ఫోటోలను పక్కపక్కన పెట్టి మరీ పోలుస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా హాలీవుడ్ సూపర్ హీరో సిరీస్ ది బాయ్స్ లోని హోమ్‌లాండర్ చిన్ననాటి జైలు లేదా బోను సీన్‌ను, అలాగే ప్రఖ్యాత మార్వెల్ బ్లాక్ బస్టర్ మూవీ `బ్లాక్ విడో`, స్ట్రేంజర్ థింగ్స్ ల్యాబ్ సీన్లను పోలి ఈ చిత్రంలోని కొన్ని విజువల్స్ ఉన్నాయని స్క్రీన్ షాట్లతో సహా నెటిజన్లు షేర్ చేస్తున్నారు. గ్లోబల్ రేంజ్‌లో పాపులర్ అయిన షోల నుండే వైఆర్‌ఎఫ్ కథలు దొంగిలిస్తోందంటూ ఆలియా భట్‌ను `చురాలియా` (దొంగిలించింది) అని కామెంట్లు పెడుతున్నారు.
ఈ నెగెటివ్ ట్రోల్స్, డిబేట్ల ఇంటెన్సిటీని చూసి ఆలియా భట్ స్పందన ఎలా ఉంటుందో ఊహిస్తూ... కన్నీళ్లు పెట్టుకుంటున్న పాత ఎమోషనల్ ఫోటోలను, మీమ్స్‌ను నెటిజన్లు సరదాగా షేర్ చేస్తున్నారు. వైఆర్‌ఎఫ్ సంస్థకు హాలీవుడ్ నుండి సీన్లను అరువు తెచ్చుకోవడం కొత్తేమీ కాదని.. గతంలో వచ్చిన వార్, పఠాన్ చిత్రాలలోనూ ఇలాంటి కాపీ సీన్లు ఉన్నాయని కొందరు గుర్తుచేస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తీస్తున్నా స్థానికత లోపించి పూర్తి హాలీవుడ్ స్టైల్‌ను ఇమిటేట్ చేయడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని విమర్శిస్తున్నారు.
మరోవైపు ఈ డిబేట్‌లో కొందరు నెటిజన్లు ఆలియాకు మద్దతుగా కూడా నిలుస్తున్నారు. చిన్నపిల్లలపై సైన్స్ ప్రయోగాలు చేయడం లేదా ఒక ఏజెంట్‌ను చిన్నప్పటి నుండి ఒక గదిలో ఉంచి కఠినమైన శిక్షణ ఇవ్వడం అనేది యాక్షన్ జానర్ సినిమాల్లో చాలా సాధారణమైన కథాంశం అని వారు వాదిస్తున్నారు. అంతమాత్రానికే దాన్ని ది బాయ్స్ లేదా బ్లాక్ విడో కాపీ అనడం సరికాదని... కేవలం ఆలియా భట్‌పై ఉన్న ద్వేషంతోనే కొందరు పనిగట్టుకుని ఇలాంటి నెగెటివ్ పీఆర్ ప్రచారం చేస్తున్నారని అభిప్రాయపడ్డారు.
ఓవైపు మహిళా ప్రాధాన్యత కలిగిన భారీ యాక్షన్ చిత్రంగా `ఆల్ఫా`పై అంచనాలు ఉన్నా.. చిన్నపాటి కాపీ వివాదాలు సినిమాపై కొంత ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. ఓవైపు ఆలియా భట్ బాడీ లాంగ్వేజ్ ఈ యాక్షన్ రోల్‌కు సెట్ కాలేదని కొందరు ఫ్యాన్స్ పెదవి విరుస్తుంటే... మరోవైపు ఈ డిజిటల్ డిబేట్లు, ట్రోల్స్ సినిమా ప్రమోషన్ల కంటే ఎక్కువగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఈ వివాదాలన్నింటికీ తెరపడాలంటే జూలై 3న సినిమా థియేటర్లలోకి వచ్చేంతవరకు వేచి చూడాల్సిందే.
