Begin typing your search above and press return to search.

ప్రియురాలితో 'స్పైడ‌ర్‌మేన్' చూస్తూ తాపులు తిన్నాడు.. పాపం అంత త‌ప్పేం చేసాడ‌ని!

ముందుగానే రాబోయే సీన్లు, సస్పెన్స్ మలుపులను బిగ్గరగా చెప్పడం వల్ల తమ వీక్షణ అనుభవం పాడవుతోందని పక్కనే ఉన్న నలుగురు మిత్రుల గుంపు అతడిని వారించింది.

By:  Sivaji Kontham   |   3 Aug 2026 9:37 AM IST
ప్రియురాలితో స్పైడ‌ర్‌మేన్ చూస్తూ తాపులు తిన్నాడు.. పాపం అంత త‌ప్పేం చేసాడ‌ని!
X

సినిమా థియేటర్‌కు వెళ్లి హాయిగా సినిమా చూడాలనుకునే ప్రేక్షకులకు కొన్నిసార్లు ఊహించని చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి. ఇటీవల `స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే` చిత్రం చూసేందుకు తన ప్రియురాలితో కలిసి వచ్చిన ఒక యువకుడికి ఇలాంటి విచిత్రమైన ఘటనే ఎదురైంది. సదరు వ్యక్తికి ముందే ఆ సినిమా కథ, ట్విస్టులు తెలిసి ఉండటంతో పక్కనే ఉన్న ప్రియురాలికి సీన్ బై సీన్ బిగ్గరగా స్పాయిలర్స్ ఇస్తూ వివరించడం ప్రారంభించాడు. అయితే మొదటిసారి ఆ సినిమాను ఎంతో ఆసక్తిగా చూస్తున్న తోటి ప్రేక్షకులకు ఈ ప్రవర్తన తీవ్ర చికాకు తెప్పించింది.

ముందుగానే రాబోయే సీన్లు, సస్పెన్స్ మలుపులను బిగ్గరగా చెప్పడం వల్ల తమ వీక్షణ అనుభవం పాడవుతోందని పక్కనే ఉన్న నలుగురు మిత్రుల గుంపు అతడిని వారించింది. కానీ అతడు వారి మాటలను ఖాతరు చేయకుండా కథను చెప్పడం కొనసాగించడంతో మాటామాటా పెరిగింది. తీవ్ర ఆగ్రహానికి గురైన ఆ నలుగురు యువకులు ఒక్కసారిగా సదరు వ్యక్తిపై పడి తాపులు, పిడిగుద్దుల వర్షం కురిపించారు. దీంతో థియేటర్ లోపల తీవ్ర కలకలం, గందరగోళం త‌లెత్తింది. ప్రియురాలి ముందు ప్రతాపం చూపించబోయిన ఆ యువకుడు చివరికి గుద్దులు తిని మూలకూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఈ ఘటనకు సంబంధించిన వివరాలు- వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్ల నుండి భిన్నమైన స్పందనలు వ్యక్తమవుతున్నాయి. కిట‌కిట‌లాడే థియేటర్లలో ఇతరులకు ఇబ్బంది కలగకుండా ప్రవర్తించాలనే `సివిక్ సెన్స్` చాలామందిలో లోపించిందని కొందరు కామెంట్ చేయగా.. మరికొందరు మాత్రం ``స్పాయిలర్ కాస్తా బ్రాయిలర్ అయిపోయింది`` అంటూ సరదా వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. సినిమా సస్పెన్స్‌ను పాడుచేసే స్పాయిలర్లకు ఇది తగిన శాస్తి అని... అతడిని కొట్టడం సరైన నిర్ణయమేనంటూ కొందరు రౌడీ తరహా కామెంట్లతో నెట్టింట రచ్చ చేస్తున్నారు.

సాధారణంగా భారతీయ థియేటర్లలో అభిమానుల మధ్య గొడవలు జరగడం కొత్తేమీ కాదు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ) తమ అభిమాన హీరోల సినిమాలు లేదా పెద్ద హీరోల మొదటి రోజు షోల సమయంలో అభిమానులు పూనకాలతో ఊగిపోతూ థియేటర్ స్క్రీన్లను చించివేయడం, సీట్లను పగలగొట్టడం, కుర్చీలు కోసేయడం వంటి విధ్వంసకర ఘటనలు గ‌తంలో చాలానే చూసాం. అలాగే హీరోల అభిమానుల మధ్య ఫ్లెక్సీల విషయంలోనో.. పేపర్లు చల్లే విషయంలోనో గొడవలు జరిగి కొట్టుకోవడం సర్వసాధారణం.

అయితే హీరోల గొడవలు లేదా స్క్రీన్ల ధ్వంసం పక్కన పెడితే.. పక్కన ఉన్న ప్రియురాలికి ముందే సినిమా కథను, ట్విస్టులను చెప్తున్నాడనే ఏకైక కారణంతో ఒక వ్యక్తిని పట్టుకుని ఇన్ని తాపులు తన్నడం మాత్రం చాలా అరుదైన .. విచిత్రమైన ఘటనగా నిలిచింది. ఈ ఘటన ఎక్కడ జరిగిందనే దానిపై స్పష్టమైన సమాచారం లేదు కానీ.. సినిమా థియేటర్లలో తోటి ప్రేక్షకులకు ఇబ్బంది కలిగిస్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో చెప్పడానికి ఈ `స్పైడర్ మ్యాన్` రచ్చ ఒక ఉదాహరణగా నిలిచింది.