Begin typing your search above and press return to search.

సాలీడు విన్యాసాలు: ఈ వేస‌విలో మ‌రో స్పెష‌ల్ బొనాంజా ట్రీట్

ఈ నేపథ్యంలోనే ఈ వేసవి ముగింపులో (సమ్మర్‌లో) భారతీయ బాక్సాఫీస్ వద్ద మరో 100 కోట్ల క్లబ్‌ను కొల్లగొట్టేందుకు `స్పైడర్‌మ్యాన్` ఫ్రాంచైజీ నుండి సరికొత్త చిత్రం సిద్ధమవుతోంది.

By:  Sivaji Kontham   |   12 Jun 2026 4:00 AM IST
సాలీడు విన్యాసాలు: ఈ వేస‌విలో మ‌రో స్పెష‌ల్ బొనాంజా ట్రీట్
X

భారతదేశంలో ఇప్పుడు హాలీవుడ్ సినిమాలకు విపరీతమైన ఆదరణ లభిస్తోంది. ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలు కేవలం మెట్రో నగరాలకే పరిమితం అనుకునేవారు.. కానీ ఇప్పుడు ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. భారతీయ బాక్సాఫీస్ వద్ద ఏదైనా క్రేజీ హాలీవుడ్ సినిమా వంద కోట్ల రూపాయల వసూళ్లను సాధించడం ఇప్పుడు పెద్ద కష్టమేమీ కాదు. అవతార్, అవెంజర్స్ ఫ్రాంచైజీ చిత్రాలు సృష్టించిన రికార్డులే కాకుండా.. సూపర్‌మ్యాన్, స్పైడర్‌మ్యాన్ వంటి సూపర్ హీరో ఫ్రాంచైజీ సినిమాలకు కూడా ఇండియాలో భారీ స్థాయిలో మార్కెట్ -క్రేజ్ ఏర్పడ్డాయి.

ఈ నేపథ్యంలోనే ఈ వేసవి ముగింపులో (సమ్మర్‌లో) భారతీయ బాక్సాఫీస్ వద్ద మరో 100 కోట్ల క్లబ్‌ను కొల్లగొట్టేందుకు `స్పైడర్‌మ్యాన్` ఫ్రాంచైజీ నుండి సరికొత్త చిత్రం సిద్ధమవుతోంది. గతంలో విడుదలైన ఈ సిరీస్ చిత్రాల బాక్సాఫీస్ రికార్డులను గమనిస్తే.. 2017లో వచ్చిన `స్పైడర్-మ్యాన్: హోమ్‌కమింగ్` ఇండియాలో దాదాపు రూ. 80 కోట్ల గ్రాస్ (రూ. 60.2 కోట్ల నెట్) వసూలు చేసి అదరగొట్టింది. ఆ తర్వాత 2019లో వచ్చిన `స్పైడర్-మ్యాన్: ఫార్ ఫ్రమ్ హోమ్` మరింత పెద్ద విజయాన్ని సాధించి.. దాదాపు రూ. 86.11 కోట్ల నెట్ (రూ. 101 కోట్ల గ్రాస్) వసూళ్లతో అప్పట్లో దేశంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన స్పైడర్‌మ్యాన్ చిత్రంగా రికార్డు సృష్టించింది. ఇప్పుడు రానున్న‌ కొత్త చిత్రం ఈ వసూళ్ల రికార్డులను బద్దలు కొడుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానించే ఈ ఐకానిక్ క్యారెక్టర్ ఆధారంగా తెరకెక్కిన సరికొత్త చిత్రం `స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే` అనే టైటిల్‌తో ఈ జూలైలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మార్వెల్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమాలో టామ్ హాలండ్ -జెండయా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం జూలై 31న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. అయితే భారతీయ అభిమానుల కోసం చిత్ర బృందం ఒక అద్భుతమైన సర్‌ప్రైజ్‌ను ప్లాన్ చేసింది.

ప్రపంచవ్యాప్త విడుదల కంటే ఒక రోజు ముందే... అంటే జూలై 30న ఈ సినిమా భారతదేశంలో గ్రాండ్‌గా విడుదల కానుంది. దీనివల్ల మిగతా ప్రపంచం కంటే ముందే భారతీయ ప్రేక్షకులు ఈ అద్భుతమైన సినిమాను వెండితెరపై చూసే అరుదైన అవకాశం లభించనుంది. దీనికి అదనంగా ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ వచ్చే వారమే ప్రారంభం కానుండటం విశేషం. అలాగే ఈ సినిమాకు సంబంధించిన సరికొత్త ట్రైలర్ ఈ సోమవారం విడుదల కాబోతోందని సమాచారం తెలియడంతో అభిమానుల్లో ఉత్కంఠ మరింత పెరిగింది.

ఇప్పటివరకు వచ్చిన అన్ని స్పైడర్-మ్యాన్ సినిమాల కంటే కూడా ఈ చిత్రానికి అత్యధిక రన్‌టైమ్ ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, క‌న్నడ భాషల్లో బహుభాషా చిత్రంగా విడుదల కానుంది. డెస్టిన్ డానియల్ క్రెట్టన్ దర్శకత్వం వహించిన‌ ఈ సినిమాలో సాడీ సింక్, జాకబ్ బటలాన్, జాన్ బెర్న్తల్, మార్క్ రుఫెలో వంటి హాలీవుడ్ ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో నటించారు. రికార్డు స్థాయి రన్‌టైమ్, భారీ తారాగణం..ఇండియాలో ఒక రోజు ముందే రిలీజ్ అవుతుండటంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మరో వంద కోట్ల వసూళ్లు కురిపించడం ఖాయంగా కనిపిస్తోంది.