500 కోట్ల వసూళ్లతో భారతదేశంలో చరిత్ర సృష్టించిన ఏకైక హాలీవుడ్ మూవీ!
భారతదేశంలో భారతీయ సినిమాలను మించి వసూళ్లను సాధిస్తూ హాలీవుడ్ బెంబేలెత్తిస్తోంది.
By: Sivaji Kontham | 10 Aug 2026 3:19 PM ISTభారతదేశంలో భారతీయ సినిమాలను మించి వసూళ్లను సాధిస్తూ హాలీవుడ్ బెంబేలెత్తిస్తోంది. 2026లో స్థానిక సినిమాలను మించి హాలీవుడ్ సినిమాలు వసూళ్లు సాధించాయి. ఇప్పుడు యంగ్ స్టార్ టామ్ హాలండ్ ప్రధాన పాత్రలో నటించిన `స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే` చిత్రం ఇండియా బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. విడుదలైన తొలి రోజు నుంచే వసూళ్ల సునామీ సృష్టిస్తున్న ఈ సూపర్ హీరో మూవీ కేవలం 11 రోజుల్లోనే భారతదేశంలో అత్యధిక కలెక్షన్లు సాధించిన పలు ఫ్రాంఛైజీ సినిమాల రికార్డులను తిరగరాసింది.
సినిమా విశ్లేషణ సంస్థ శాక్‌నిల్క్ అందించిన వివరాల ప్రకారం.. ఈ చిత్రం 11వ రోజు (రెండవ ఆదివారం) భారతదేశంలో ఏకంగా రూ. 34.70 కోట్ల నెట్ కలెక్షన్‌ను సాధించగా.. గ్రాస్ కలెక్షన్ రూ. 41.53 కోట్లుగా నమోదైంది. రెండవ శుక్రవారం రూ.15 కోట్లు, శనివారం రూ. 31 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా.. ఆదివారానికి వచ్చేసరికి 11.9 శాతం వృద్ధిని చూపించింది. దీనితో ఈ సినిమా రెండవ వీకెండ్‌లోనే మొత్తం రూ. 80.70 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టింది.
భారతదేశంలో పొడిగించిన మొదటి వీకెండ్‌లోనే రూ. 257.95 కోట్లు సాధించిన ఈ చిత్రం.. తొలి వారంలో రూ. 334.75 కోట్ల నెట్ వసూళ్లతో ముగించింది. ప్రస్తుతం 11 రోజుల ముగింపు నాటికి ఈ చిత్రం మొత్తం ఇండియా నెట్ కలెక్షన్ రూ. 415.45 కోట్లకు చేరుకోగా.. గ్రాస్ వసూళ్లు రూ. 496.86 కోట్లకు చేరాయి. మరో 3.15 కోట్లు రాబడితే భారతదేశంలో రూ. 500 కోట్ల గ్రాస్ మార్క్‌ను దాటిన మొదటి హాలీవుడ్ చిత్రంగా ఇది చరిత్ర సృష్టించనుంది.
ఇప్పటివరకు భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన హాలీవుడ్ చిత్రాల జాబితాలో `అవెంజర్స్: ఎండ్ గేమ్` (రూ. 445 కోట్లు గ్రాస్), జేమ్స్ కేమరూన్ రూపొందించిన `అవతార్: ది వే ఆఫ్ వాటర్` (రూ. 477.50 కోట్లు గ్రాస్) మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి. అయితే ప్రస్తుతం రూ. 496.86 కోట్ల గ్రాస్ వసూళ్లతో స్పైడర్ మ్యాన్ ఈ రెండింటి లైఫ్‌టైమ్ కలెక్షన్లను చాలా సులువుగా అధిగమించి సరికొత్త మైలురాయిని చేరుకుంది.
ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా దూకుడును బట్టి రూ. 500 కోట్ల మార్క్‌ను అందుకోవడం అనేది ఇక కేవలం కొద్ది రోజులు సరిపోతుందని అంచనా. మూడో వారంలోకి అడుగుపెడుతున్న వేళ.. టామ్ హాలండ్ నటించిన ఈ సూపర్ హీరో చిత్రం మునుముందు ఇంకెన్ని రికార్డులను నెలకొల్పుతుందోనని సినీ వర్గాలు, అభిమానులు ఆసక్తిగా గమనిస్తున్నారు. అయితే త్వరలోనే మోస్ట్ అవైటెడ్ `అవెంజర్స్ - డూమ్స్ డే` విడుదలకు సిద్ధం కానుండగా.. `స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే` రికార్డులను కొడుతుందా? అన్న చర్చ అప్పుడే మొదలైపోయింది.
