లిప్ లాక్ సీన్ తీసేసి 13 ప్లస్ సర్టిఫికెట్ ఇవ్వడం దేనికి?
ఇటీవలి కాలంలో సెన్సార్ ఆంక్షలను ఎదుర్కొని థియేటర్లలోకి వచ్చిన చిత్రాలే దీనికి ప్రత్యక్ష నిదర్శనం.
By: Sivaji Kontham | 28 July 2026 3:35 PM ISTహాలీవుడ్ సినిమాలకు భారతదేశంలో విపరీతమైన ఆదరణ ఉంటుంది. కానీ ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యే హాలీవుడ్ చిత్రాల ఒరిజినల్ వెర్షన్లు భారతీయ థియేటర్లలో యథాతథంగా ప్రదర్శితం కావు. భారతీయ సెన్సార్ బోర్డు మన దేశ సామాజిక, సాంస్కృతిక నిబంధనలను దృష్టిలో ఉంచుకుని విదేశీ చిత్రాల్లోని హింస, ఆసభ్యకరమైన సంభాషణలు, రొమాంటిక్ దృశ్యాలపై కఠినంగా కత్తెర వేస్తుంటుంది. ఇటీవలి కాలంలో సెన్సార్ ఆంక్షలను ఎదుర్కొని థియేటర్లలోకి వచ్చిన చిత్రాలే దీనికి ప్రత్యక్ష నిదర్శనం.
తాజాగా మోస్ట్ అవైటెడ్ హాలీవుడ్ మూవీ `స్పైడర్-మన్: బ్రాండ్ న్యూ డే` విషయంలోనూ ఇదే పునరావృతమైంది. ఈ సినిమా కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న భారతీయ అభిమానులకు చిన్నపాటి నిరాశ ఎదురైంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు యుఏ 13+ సర్టిఫికేట్ జారీ చేసినా అందులోని 8 సెకన్ల లిప్ లాక్ సన్నివేశాన్ని పూర్తిగా తొలగించాలని ఆదేశించింది. దీనికితోడు ఆడియో, సబ్‌టైటిల్స్‌లో ఉన్న కొన్ని అభ్యంతరకర పదాలను మ్యూట్ చేయించడంతో పాటు మద్యం సీన్లలో హెచ్చరిక కార్డులను జోడించిన తర్వాతే 2 గంటల 24 నిమిషాల నిడివితో విడుదలకు అనుమతినిచ్చారు.
కేవలం స్పైడర్‌మేన్ చిత్రమే కాకుండా.. ఇతర ప్రముఖ హాలీవుడ్ చిత్రాలపై కూడా సెన్సార్ బోర్డు గతంలో ఈ తరహా వేటు వేసింది. అబ్సెషన్ అనే హారర్ థ్రిల్లర్ చిత్రానికి `ఎ` సర్టిఫికేట్ ఇచ్చినా అందులోని 38 సెకన్ల తీవ్రమైన హింస, గ్రాఫిక్ రొమాన్స్, నగ్నత్వ దృశ్యాలను తొలగించారు. అలాగే స్టీవెన్ స్పీల్‌బర్గ్ తెరకెక్కించిన `డిస్‌క్లోజర్ డే` చిత్రంలో పలు బూతు పదాలతో పాటు సె*క్స్ అనే పదాన్ని మ్యూట్ చేసి చివరి నిమిషంలో క్లియరెన్స్ ఇచ్చారు.
మరోవైపు మార్వెల్ బ్లాక్‌బస్టర్ `డెడ్‌పూల్ & వోల్వరీన్` చిత్రంలో మితిమీరిన రక్తపాతం ఉన్న సీన్లను తగ్గించడంతో పాటు... భారతీయ సంస్కృతి లేదా మతపరమైన అంశాలకు ఇబ్బంది కలిగించేలా ఉన్న సంభాషణలను బోర్డు మార్పించింది. అలాగే ప్రజాదరణ పొందిన `ఫాస్ట్ & ఫ్యూరియస్` వంటి యాక్షన్ ఫ్రాంచైజీ చిత్రాలలో కూడా మితిమీరిన స్టంట్ హింసను ట్రిమ్ చేయడం, బూతు పదాలు.. మహిళలను తక్కువ చేసి మాట్లాడే డైలాగ్‌లకు కట్స్ చెప్పడం పరిపాటిగా మారింది.
ఈ తరహా సెన్సార్ కట్స్ వార్తలు బయటకు వచ్చినప్పుడల్లా సోషల్ మీడియాలో సినీ ప్రేమికుల మధ్య పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే వయోపరిమితి ఆధారంగా (యుఏ 13+, ఏ) రేటింగ్స్ ఇస్తున్నప్పుడు, రొమాంటిక్ అండ్ యాక్షన్ సీన్లను ఎందుకు ట్రిమ్ చేస్తున్నారంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ సెన్సార్ నిబంధనలు- వివాదాలు ఉన్నా.. భారత్‌లో హాలీవుడ్ చిత్రాలకు ఉన్న క్రేజ్.. బాక్సాఫీస్ వద్ద వస్తున్న భారీ ఓపెనింగ్స్ ఏమాత్రం తగ్గకపోవడం గమనార్హం.
