'స్పైడర్ మేన్' మొదలు వరుసగా MCU సినిమాలు ట్రీట్
ఈ జాబితా ప్రకారం... 2026 జూలై 31న `స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే` ప్రేక్షకుల ముందుకు రానుంది.
By: Sivaji Kontham | 26 July 2026 1:35 PM ISTమార్వల్ సినిమాటిక్ యూనివర్శ్ నుంచి ఏదైనా సినిమా వస్తోంది అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీప్రియులకు ఒక పెద్ద పండగ లాంటిది. అదిరిపోయే విజువల్ ట్రీట్ తమకోసం సిద్ధమవుతుందని అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తుంటారు. అలాంటి వారందరికీ ముందుంది ముసళ్ల పండగ. వరుస సినిమాల ఫెస్ట్ ని ఆస్వాధించేవాళ్లకు ట్రీట్ కి కొదవే లేదు!
మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ (MCU) నుంచి వరుస సినిమాల విడుదల తేదీలకు సంబంధించిన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. మార్వల్ వరల్డ్ డాట్ ఇన్ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ప్రత్యక్షమైన ఈ జాబితా, మార్వెల్ అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపడంతో పాటు పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. `స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే` మొదలుకొని `ఘోస్ట్ రైడర్` వరకు పలు ప్రతిష్టాత్మక చిత్రాల వివరాలు ఈ పోస్ట్‌లో వెల్లడయ్యాయి.
ఈ జాబితా ప్రకారం... 2026 జూలై 31న `స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే` ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ట్రైలర్ ఆసక్తిని పెంచడంతో థియేటర్లలో బారీ వసూళ్లను సాధించడం ఖాయమని అంచనా వేస్తున్నారు. ఇటీవలే విడుదలైన ది ఒడిస్సీ చిత్రం భారతదేశం సహా ప్రపంచ దేశాలలో భారీ వసూళ్లను సాధించింది. అంతకుమించి స్పైడర్ మేన్ ఫ్రాంఛైజీకి భారతదేశంలో ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. రాబోవు బ్రాండ్ న్యూ డే 200 కోట్లు భారతదేశం నుంచి సునాయాసంగా వసూలు చేస్తుందని అంచనా. ఇక ఈ సినిమా మొదలు వరుసగా మార్వల్ నుంచి ట్రీట్ అభిమానులకు అందనుంది. ఇదే ఏడాది డిసెంబర్ 16న మోస్ట్ అవైటెడ్ మూవీ `అవెంజర్స్: డూమ్స్‌డే` విడుదల కానుండగా ఈ సినిమాపైనా భారీ అంచనాలేర్పడ్డాయి. సరిగ్గా ఏడాది తర్వాత 2027 డిసెంబర్ 17న `అవెంజర్స్: సీక్రెట్ వార్స్` చిత్రం రాబోతోంది. ఆ తర్వాత 2028 డిసెంబర్ 15న `బ్లాక్ పాంథర్ 3` తో పాటు అదే ఏడాదిలో `ఘోస్ట్ రైడర్` ప్రాజెక్ట్ కూడా పట్టాలెక్కనున్నట్లు సమాచారం.
ఈ అప్‌డేట్‌పై మార్వెల్ అభిమానులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. భారీ అంచనాలున్న `అవెంజర్స్` చిత్రాలు బ్యాక్-టు-బ్యాక్ విడుదలవుతుండటంపై నెటిజన్లు తీవ్ర ఆనందం వ్యక్తం చేస్తున్నారు. `మార్వెల్ ఈజ్ బ్యాక్`, `ఇది అబ్సొల్యూట్ సినిమా` అంటూ సినీ ప్రియులు తమ ఉత్సాహాన్ని కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు. ముఖ్యంగా `ఘోస్ట్ రైడర్` పునరాగమనంపై ఫ్యాన్స్ నుంచి విశేష స్పందన లభిస్తోంది.
మరోవైపు కొన్ని పాపులర్ సిరీస్‌ల అప్‌డేట్స్ లేకపోవడం అభిమానులను కాస్త నిరాశకు గురిచేసింది. `డాక్టర్ స్ట్రేంజ్ 3`, `షాంజ్-చీ 2`, `ఎక్స్-మెన్`, `బ్లేడ్` , `హల్క్ సోలో` సినిమాల ప్రస్తావన లేకపోవడంపై కామెంట్ సెక్షన్‌లో ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే 2027లో కేవలం ఒకే ఒక్క మార్వెల్ సినిమా ఉండటంపై కూడా కొందరు అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఏది ఏమైనా మునుముందు రానున్న ఐదేళ్లలో రాబోతున్న ఈ భారీ మల్టీ-స్టారర్ చిత్రాలు మార్వెల్ ఫ్రాంచైజీకి పూర్వవైభవాన్ని తెచ్చిపెడతాయని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. థియేటర్లలో ఈ విజువల్ వండర్స్‌ను వీక్షించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కామిక్ ప్రియులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
