రూపాయి డాలర్‌కు సమానం అయితే టాలీవుడ్ రేంజ్ ఇదీ
ఇలాంటి సమయంలో భారతీయ సినిమాల బాక్సాఫీస్ పాన్ వరల్డ్ లో ఎందుకు వెనకబడుతోందో విశ్లేషణ సాగుతోంది.
By: Sivaji Kontham | 3 Aug 2026 7:00 PM ISTస్పైడర్ మేన్ - బ్రాండ్ న్యూ డే కనకవర్షం కురిపిస్తుంటే భారతీయ ట్రేడ్ నిపుణులు నోరెళ్లబెడుతున్నారు. భారతదేశం నుంచి ఏకంగా 500 కోట్లు కొల్లగొట్టే దిశగా దూసుకెళుతున్న హాలీవుడ్ సినిమా దూకుడుకు ఆశ్చర్యపోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 1000 మిలియన్ డాలర్లు కేవలం మూడు రోజులలోనే సాధించేస్తోందనే విశ్లేషణ సంచలనంగా మారుతోంది. అవెంజర్స్ ఫ్రాంఛైజీ రికార్డులనే కొత్త స్పైడర్ మేన్ తిరగరాస్తున్నాడు.
ఇలాంటి సమయంలో భారతీయ సినిమాల బాక్సాఫీస్ పాన్ వరల్డ్ లో ఎందుకు వెనకబడుతోందో విశ్లేషణ సాగుతోంది. దీనికి కారణం డాలర్ తో రూపాయి మారకం విలువ కూడా ఒక ప్రధాన కారణమనేది గ్రౌండ్ లెవల్లో గ్రహించాల్సి ఉంటుంది. అమెరికన్ డాలర్ తో పోలిస్తే రూపాయి చాలా వెనకబడి ఉంది. రూపాయి బలోపేతం కావడం అనేది కలగా మిగిలింది. దేశం వెలిగిపోతోందనే ఊదరగొట్టుడు ప్రచారంతో ఎలాంటి సంబంధం లేని పేదరికం కూడా భారతదేశంలో కనిపిస్తోంది. వినోదానికి బడ్జెట్ లో చివరి ఆప్షన్ ని ఇచ్చే ప్రజలు మారేందుకు పరిస్థితులు అనుకూలంగా లేనే లేవు. ధరల భారంతో కొనుగోలు శక్తి పడిపోయి, ద్రవ్యోల్బణ పరిస్థితులు కూడా దాపురించే పరిస్థితి కనిపిస్తోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఇంకా డీప్ గా విశ్లేషిస్తే... హాలీవుడ్, ఇండియన్ సినిమాల మధ్య వసూళ్ల వ్యత్యాసానికి నటన లేదా కథా బలం కారణం కాదు.. కేవలం కరెన్సీ విలువ.. టికెట్ ధరల్లో ఉన్న తేడానే ప్రధాన కారణమని విశ్లేషిస్తున్నారు. నిజానికి ప్రేక్షకుల సంఖ్య (ఫుట్‌ఫాల్స్) ప్రాతిపదికన చూస్తే భారతదేశ బ్లాక్‌బస్టర్లు సాధించే రికార్డులను ఏ హాలీవుడ్ సినిమా కూడా అందుకోలేదు. భారతదేశంలో జనం సినిమాల కోసం క్యూ కట్టడం పరిమితంగానే ఉన్నా ఆ సంఖ్య కూడా తక్కువేమీ కాదు. అయితే మన దేశంలో సగటు టికెట్ ధర రూ. 150 కాగా అమెరికా వంటి దేశాల్లో అది 15 డాలర్లు (రూ. 1250 కంటే ఎక్కువ). ఒకవేళ థియేటర్లలో సినిమా చూసిన ప్రేక్షకుల సంఖ్య (ఫుట్‌ఫాల్స్) ప్రాతిపదికన లెక్కిస్తే... భారతీయ బ్లాక్‌బస్టర్లు సాధించే రికార్డులను ఏ హాలీవుడ్ సినిమా కూడా అందుకోలేదు. నిజానికి రూపాయి విలువ డాలర్ తో సమానంగా ఉంటే భారతీయ సినిమాలు సాధించే ఏ రికార్డును ఇతర ఇండస్ట్రీలు అందుకోలేవనడంలో ఎలాంటి సందేహం లేదు.
స్థానికంగా IMAX, మల్టీప్లెక్స్ స్క్రీన్‌లను పెంచడంతో పాటు విదేశీ బాక్సాఫీస్ వద్ద నేరుగా విదేశీ కరెన్సీ రూపంలోనే భారీ వసూళ్లను సాధించడం ద్వారా హాలీవుడ్ సినిమాతో ఉన్న ఈ ఆర్థిక వ్యత్యాసాన్ని అధిగమించవచ్చు. విదేశీ ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి యూనివర్శల్ అనిపించే భావోద్వేగాలు ఉన్న కథలతో పాటు అంతర్జాతీయ స్థాయి సాంకేతికత, నాణ్యమైన డబ్బింగ్ ప్రమాణాలు పాటించాలి.
ఆర్ఆర్ఆర్, దంగల్, సీక్రెట్ సూపర్ స్టార్ చిత్రాల తరహాలో బలమైన గ్లోబల్ ప్రమోషన్లు, విదేశీ పంపిణీ వ్యవస్థ .. మన స్వదేశీ చరిత్ర, పురాణాల కథలతో భారతీయ సినిమా ప్రపంచ బాక్సాఫీస్‌ను శాసించగలదు. దురంధర్, రామాయణం, వారణాసి వంటి సినిమాల భారీతనం, వైవిధ్యమైన కంటెంట్ కూడా గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోగలదు.
