Begin typing your search above and press return to search.

అటు అక్కినేని చాన్స్- ఇటు అమెరికా టూర్

తెలుగు సినీ పరిశ్రమలో దిగ్గజ గాయకుడు ఘంటసాల ఒక్కసారిగా కనుమరుగు అయిన తరువాత ఆయన వారసత్వం కోసం అతి పెద్ద పోటీయే జరిగింది.

By:  Satya P   |   21 April 2026 9:08 AM IST
అటు అక్కినేని చాన్స్- ఇటు అమెరికా టూర్
X

తెలుగు సినీ పరిశ్రమలో దిగ్గజ గాయకుడు ఘంటసాల ఒక్కసారిగా కనుమరుగు అయిన తరువాత ఆయన వారసత్వం కోసం అతి పెద్ద పోటీయే జరిగింది. ఘంటసాల మాదిరిగా గొంతు అనుకరించి పాడాలా లేక ఆయన పాడే పద్ధతులు ఆకళింపు చేసుకుని తమదైన శైలిలో కలగలిపి పాడాలా అన్నది ఒక చర్చ. మొదట్లో అయితే ఘంటసాల గొంతు మాదిరిగా ఉంటే చాలు నెగ్గేయవచ్చు అనుకున్న వారి హవా సాగింది. కానీ తరువాత ఘంటసాల వారసత్వం అంటే ఏమిటో ఎస్పీ బాలు నిరూపించారు.దీని కోసం ఆయన చాలా కష్టపడ్డారు. ఒక దశలో సినీ పరిశ్రమ నుంచి నిరాదరణకు గురి అయినా తట్టుకుని లేచి నిలబడ్డారు. అదే పరిశ్రమలో బాలు లేనిదే తెలుగు సినిమా పాట లేదు అనిపించారు. తన గొంతు వద్దు అనుకున్న దిగ్గజ నటుల చేత తన పాట సూపర్ హిట్ అనిపించారు. అలా దశాబ్దాల పాటు ఆయన సినీ సీమను ఏలారు

అక్కినేనికి ప్లేబ్యాక్ చాన్స్ :

ఎస్పీబీకి తెలుగు సినిమా రంగంలో అందరు గాయకులకు పాడి మెప్పించే చాన్స్ సులువుగానే వచ్చింది కానీ అక్కినేనికి మాత్రం బాలు గొంతు కలపలేకపోయారు. ఎందుకంటే అక్కినేని పాట అంటే ఘంటసాల ఉండాల్సిందే. లేదా అచ్చం ఆయన గొంతు పోలిన తీరులో పాడి మెప్పించాల్సిందే. ఆ విధంగా పాడేందుకు రామకృష్ణ ఉండడంతో ఏఎన్నార్ కి పాడే చాన్స్ అయితే బాలూకి దక్కకుండా పోతూ వచ్చింది. అయితే బాలూతోనే అక్కినేనికి పాడించాలని పంతం పట్టిన ఒక ప్రముఖ దర్శకుడు గోల్డెన్ చాన్స్ ఇచ్చారు.

అందాల రాముడు కోసం :

దర్శకుడు బాపూ అక్కినేనితో బుద్ధిమంతుడు మూవీ తీసి హిట్ కొట్టారు. ఆ తరువాత అదే చిత్ర కల్పన బ్యానర్ మీద అక్కినేని హీరోగా లత హీరోయిన్ గా 1973లో అందాల రాముడు సినిమాను తీయడానికి సన్నాహాలు చేసుకున్నారు. ఆ మూవీలో అన్ని పాటలను బాలు చేత పాడించాలని అనుకున్నారు. ఆ మేరకు హీరో అక్కినేనిని కూడా ఒప్పించారు. ఇక బాలుకి ఇది బంగారం లాంటి అవకాశం అక్కినేనికి పాడితే సినీ పరిశ్రమలో తాను సంపూర్ణ గాయకుడిగా తిరుగులేని ముద్ర వేసుకోవచ్చు అన్నది ఆయన ఆలోచన. ఇక అంతా ఓకే అనుకున్నా అడ్డు ఏముంది పాడడమే మిగిలింది. కానీ అక్కడే అతి పెద్ద ఆటంకం ఎదురైంది. అది ఊహించనిది కూడా అయింది.

అమెరికా టూర్ :

బాలూకు అనుకోకుండా అమెరికా టూర్ వచ్చి పడింది. అది ఆయన తొలిసారి గాయకుడిగా చేస్తున్న అమెరికా ట్రిప్. పైగా ఆ టూర్ డేట్స్ అన్నీ కన్ ఫర్మ్ అయిపోయాయి. మరో వైపు చూస్తే అందాల రాముడు సినిమాకు రికార్డింగ్ కి అవే డేట్స్ అడ్జస్ట్ చేయాలి. మరి ఎలా అన్నదే బాలూకి కలిగిన ధర్మ సందేహం. అక్కినేనికి పాడాలన్నది బాలు అతి పెద్ద కోరిక. అలాగే అమెరికా కచేరీ అన్నది కూడా అంతే స్థాయి కోరిక. కానీ ఈ రెండూ ఒకేసారి కట్టకట్టుకుని వచ్చి ఏదో ఒకటే చాన్స్ అంటే ఎలా. ఇదే బాలూ మధనం. దాంతో ఇటు రికార్డింగ్ క్యాన్సిల్ చేయించలేరు. అటు టూర్ ఆపించలేరు. దాంతో అమెరికా టూర్ కే ఓటేసి బాలూ వెళ్ళాల్సి వచ్చింది. దాంతో అక్కినేని వారికి పాడాల్సిన చాన్స్ బాలుకి పోతే అది మళ్లీ రామకృష్ణకి దక్కింది. ఆ తరువాత అక్కినేనికి బాలూ పాడడానికి మరో మూడేళ్ళకు పైగా సమయం వేచి చూడాల్సి వచ్చింది. మొత్తం మీద అక్కినేనికి బాలూ పాడి అచ్చం తన గొంతులాగానే ఉందనిపించారు. ఆ మీదట ప్రేమాభిషేకం లాంటి సూపర్ డూపర్ హిట్ మూవీలో అన్ని పాటలు పాడి అక్కినేనికి బాలూయే పాడాలి అనిపించుకునే రేంజికి ఎదిగారు. దటీజ్ బాలూ అనిపించుకున్నారు.