Begin typing your search above and press return to search.

అక్కినేనికి బాలు తొలి పాట...కెరీర్ లోనే ఎన్నో మలుపులు

తెలుగు సినీ సీమకు రెండు కళ్ళుగా ఎన్టీఆర్ అక్కినేని నాగేశ్వరరావు ఉంటూ దశాబ్దాల పాటు శాసించారు.

By:  Satya P   |   22 Dec 2025 10:00 AM IST
అక్కినేనికి బాలు తొలి పాట...కెరీర్ లోనే ఎన్నో మలుపులు
X

తెలుగు సినీ సీమకు రెండు కళ్ళుగా ఎన్టీఆర్ అక్కినేని నాగేశ్వరరావు ఉంటూ దశాబ్దాల పాటు శాసించారు. ఆ ఇద్దరి సినిమాలు తెలుగు వారిని ఎంతో ప్రభావితం చేయడమే కాదు ప్రతీ ఇంట్లో సభ్యులుగా వారు మారిపోయారు. తెలుగు సినీ తెరను ప్రతీ లోగిలికీ చేర్చిన ఘనత తెలుగు సినిమా కీర్తిని ప్రతిష్టను పెంచిన గొప్పదనం వారి సొంతం. ఏకంగా తరాలను వారు విశేషంగా ప్రభావితం చేశారు.

ఘంటశాల గొంతుగా :

ఇక అక్కినేని ఎన్టీఆర్ కి తెర మీద సొంత గొంతుకగా ఘటసాల మారిపోయారు. ఆయన పాట ఈ ఇద్దరి నోటా పలిక్తే వారే పాడినట్లుగా ఉండేది. అంతలా పాటానుబంధం ఈ ముగ్గురి మధ్యన పెనవేసుకుని పోయింది. ఎన్టీఆర్ కి పౌరాణిక పద్యాలు పాడినా నాగేశ్వరరావుకు ఎన్నో రోమాంటిక్ గీతాలను తన నోట పలికించినా ఘంటసాల చెల్లు అన్నట్లుగా ఉండేది. చిత్రమేంటి అంటే ఈ ముగ్గురిదీ ఒకే జిల్లా గుడివాడకు అంటూ ఇటూగా సొంత ఊర్లు ఉండేవి. ముగ్గురూ దాదాపు ఒకే ఏజ్. ఒకేసారి సినీ సీమకు వచ్చారు. అంతే కాదు కీర్తిని కూడా ఒకే స్థాయిలో అందుకున్నారు. అయితే ఘంటసాల అనారోగ్యంతో కేవలం 52 ఏళ్ళకే మరణించారు. దాంతో తెలుగు సినీ పాట మూగబోయింది.

బాలూ ఎంట్రీతో :

అయితే ఆ సమయంలో వర్ధమాన గాయకుడిగా ఎస్పీబీ ఎంట్రీ ఇచ్చారు. ఆయన ఎన్ టీఆర్ కి తొలినాళ్ళలో పాటలు పాడుతూ ఆ తరువాత నెమ్మదిగా ఆయనకు ప్లే బ్యాక్ సింగర్ గా కుదురుకున్నారు. అయితే అక్కినేనికి మాత్రం గాత్రం అందించే విషయంలో అంత సులువుగా బాలూకి ఆమోదం దక్కలేదు. దాని వెనక ఒక కధ ఉంది. 1970లో వచ్చిన ఇద్దరు అమ్మాయిలు చిత్రంలో నా హృదయపు కోవెలలో అన్న పాటను ఎస్పీబీ మొదటిసారిగా అక్కినేనికి పాడారు. అయితే అది ట్రాక్ కోసం బాలూ పాడారు. నిజానికి ఘంటసాల ఆ పాట పాడాల్సి ఉంది. కానీ ట్రాక్ విన్న ఘంటసాల బాలూ పాటనే ఉంచేయాలని చెప్పడంతో ఆ పాటే సినిమాలో ఉంచి రిలీజ్ చేశారు. అయితే బాలూ లేత గొంతుక అక్కినేనికి వెండి తెర మీద సూట్ కాకపోవడంతో ఫ్యాన్స్ తో పాటు ఎవరూ అంగీకరించలేక పోయారు. దాంతో ఘంటసాల తరువాత తనకు సూట్ అయ్యే గొంతుక కోసం అక్కినేని అన్వేషించి మరీ ప్రముఖ నేపధ్య గాయని సుశీల అక్క కొడుకు అయిన రామక్రిష్ణను వెండి తెరకు పరిచయం చేశారు. అలా అక్కినేనికి పాటలు పాడడం మొదలెట్టిన రామకృష్ణ ఆ తరువాత కాలంలో ఎన్టీఅర్ శోభన్ బాబు సహా నాటి అగ్ర హీరోలు అందరికీ పాడడంతో ఒక్కసారిగా బాలు ఖాళీ అయిపోవాల్సి వచ్చింది.

ఆయన సూచనతో :

దీంతో పాటలు బాగా తగ్గిపోయిన బాలూ ఒక దశలో ఆర్కేస్ట్రాలు చేసుకుంటూ ముందుకు సాగారు. సరిగ్గా ఆ సమయంలో అప్పటి ప్రముఖ సంగీత దర్శకుడు టి చలపతిరావు బాలూకి మరోసారి అక్కినేనితో పాడే చాన్స్ ఇచ్చారు. ఆ సినిమా పల్లెటూరి బావ. ఆ సినిమాలో శరభ శరభ అంటూ స్టార్టింగ్ లో వచ్చే గీతం పాడారు. అయితే ఈ పాట పాడినా అవకాశాలు అయితే రాలేదు, దాంతో టీ చలపతిరావు బాలూకి ఒక సూచన చేశారుట. అక్కినేనికి పాడాలంటే ఘంటసాల మాదిరిగా పాడమని, దానికి అంగీకరించని బాలూ తన సొంత గొంతుకతోనే పాడతాను అని చెప్పారుట. అయితే అక్కినేని మాదిరిగా అనుకరించి పాడతాను అని చెప్పారుట. అలా ఆలుమగలు సినిమాలో టీ చలపతిరావు మ్యూజిక్ డైరెక్షన్ లో బాలూ పాడిన ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయాను అన్న పాట అచ్చం అక్కినేని వాయిస్ తో బాలూ పాడి మెప్పించారు. అంతే అక్కినేని ఫ్యాన్స్ తో పాటు అంతా ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యారుట. అది లగాయతు అక్కినేనికి బాలూ పాడడం అన్నది చివరి వరకూ కొనసాగింది. మొత్తానికి అక్కినేనికి బాలూ తొలి పాట ఆయన కెరీర్ ని కొంత ఇబ్బని పెడితే పట్టుదలగా శ్రమించి అక్కినేని చేతనే శభాష్ అనిపించేలా బాలూ పాడి సూపర్ అనిపించుకున్నారు. అంతే కాదు ఘంటసాల తరువాత అక్కినేని ఎన్టీఆర్ ఇద్దరికీ ఎక్కువ పాటలు పాడిన క్రెడిట్ ని సొంతం చేసుకున్నారు. దటీజ్ బాలూ అనిపించుకున్నారు.