Begin typing your search above and press return to search.

బాలు హీరోగా బాపూ మూవీ...ఎలా మిస్ అయింది ?

ఎస్పీ బాలు అంటే అద్భుతమైన గాయకుడు అని అందరికీ తెలుసు. ఆయన దశకంఠుడు. అందరి హీరోలకూ ఒకే కంఠంతో వారే పాడుతున్నట్లుగా తనదైన టాలెంట్ తో గొంతు అరువిచ్చి అందరి మెచ్చుకోలు పొందారు.

By:  Satya P   |   7 July 2026 9:14 AM IST
బాలు హీరోగా బాపూ మూవీ...ఎలా మిస్ అయింది ?
X

ఎస్పీ బాలు అంటే అద్భుతమైన గాయకుడు అని అందరికీ తెలుసు. ఆయన దశకంఠుడు. అందరి హీరోలకూ ఒకే కంఠంతో వారే పాడుతున్నట్లుగా తనదైన టాలెంట్ తో గొంతు అరువిచ్చి అందరి మెచ్చుకోలు పొందారు. నలభై వేల పైగా పాటలను పాడారు. కేవలం తెలుగులోనే కాదు తమిళం, కన్నడం, మళయాళం, హిందీ, ఇలా కాదేదీ భాష పాటలకు అనర్హం అన్నట్లుగా బాలు స్వరం అయిదు దశాబ్దాల పాటు దేశంలోని ప్రజలకు రసానుభూతిని కలిగించింది. ఇక బాలులో కేవలం గాయకుడు మాత్రమే కాదు మంచి నటుడు ఉన్నారు. ఆయన 1970 ప్రాంతంలో తొలిసారిగా మహమ్మద్ బీన్ తుగ్లక్ సినిమాలో తానే స్వయంగా పాడుతూ ఒక పాటలో తెర మీద కనిపిస్తారు. అది బాలూ తొలి వెండితెర మీద కనిపించి మురిపించిన సందర్భం. ఆ తరువాత ఆయన అనేక సినిమాలలో నటించారు. ఇక 2012లో వచ్చిన మిధునం సినిమాలో అయితే ఆయనే కధానాయకుడిగా ప్రశంసనీయమైన నటనతో అలరించారు.

బాపు కోణంలో హీరోగా :

అయితే బాలు తొలి దశలో గాయకుడిగా మంచి పాటలు పాడుతూ ఒక్కో మెట్టూ ఎక్కుతున్న సందర్భంలో ఆ లేలేత అందగాడు అయిన బాలూలో తన సినిమా హీరోని చూశారు దిగ్దర్శకుడు బాపు. ఆయన అప్పటికే సాక్షి సినిమా క్రిష్ణ విజయనిర్మలతో తీసి హిట్ కొట్టారు. రెండో ప్రయత్నంగా మంచి కుటుంబ కధా చిత్రాన్ని తీయదలచుకున్నారు. ఆ చిత్రమే బంగారు చిలుక. ఆ సినిమాలో హీరోయిన్ గా విజయనిర్మలని ఎంపిక చేసుకున్నారు. ఇక హీరోగా ఒక పాతికేళ్ళ పడుచు ప్రాయం యువకుడు కావాలి. బాలు ఆ రోజులలో ముద్దుగా బొద్దుగా అందంగా ఉండేవారు. ఆయనని చూసిన బాపు తన సినిమాలో హీరోగా తీసుకోవాలని అనుకున్నారు. ఆ విషయం బాలూనే నేరుగా అడిగేశారు. అయితే బాపు లాంటి వారికి నో అని చెప్పలేక బాలు చాలా సార్లు తప్పించుకునే తిరిగారని చెబుతారు. ఎట్టకేలకు బాలు తాను ఆ పాత్రని చేయలేనని తాను గాయకుడిగానే ఉంటాను అని చెప్పడంతో బాపు గారు ఆ హీరో పాత్రకు చంద్రమోహన్ ని ఎంచుకున్నారు. ఆ సినిమాలో పాటలు మొత్తం బాలూయే పాడారు, అప్పట్లో ఆ మూవీ మంచి హిట్ అయింది.

ఒప్పుకుని ఉంటే కనుక :

బాలు మొదట్లో హీరో లాగానే ఉండేవారు. లావు అన్నది మధ్యలో వచ్చింది. ఆయన కనుక అప్పట్లో హీరోగా ఒప్పుకుని ఉంటే ఆయన కెరీర్ మరో మలుపు తిరిగి ఉండేది. అన్న మాట కూడా ఉంది. అయితే బాలుకి మాత్రం మొదటి నుంచి పాడడమే ఇస్థ్టం. పాడుతూనే చనిపోవాలన్నది ఆయన కోరిక. చివరికి అలాగే జరిగింది కూడా. అయితే బాలూలో మంచి నటుడు ఉన్నాడు, అది ఆయన అనేక సినిమాలలో వివిధ పాత్రల ద్వారా చేసి తన టాలెంట్ చూపించారు. అంతే కాదు నటుడిగానూ ఆయన అవార్డులు అందుకున్నారు.

బాపూ బాలూల బంధం :

ఇక హీరోగా తన సినిమాలో బాలూ చేయకపోయినా బాపూ బాలూల బంధం మాత్రం ఎంతో ప్రేమ పూర్వకంగా చివరి వరకూ సాగింది. బాపు దర్శకత్వం వహించిన అనేక సినిమాలకు బాలు పాడడమే కాదు సంగీత దర్శకుడిగా ఎన్నో ఎవర్ గ్రీన్ సాంగ్స్ ని అందించారు. తూర్పు వెళ్ళే రైలు, జాకీ, సీతమ్మ పెళ్ళి వంటి సినిమాలకు బాలూ అందించిన సంగీతం బాపూ సినిమాలకు అసెట్ గా మారింది అని చెప్పాలి. మొత్తం మీద బాలూలో హీరోని చూసిన బాపూ దర్శక కోణం వెండి తెర మీద మాత్రం దానిని ఆవిష్కరించలేకపోయింది అన్నది అభిమానులకు కొంత వెలితిని మిగిల్చిన విషయమే అని చెప్పాలి.