Begin typing your search above and press return to search.

'వాళ్లవి లేనప్పుడు బాలు విగ్రహం ఎందుకు?'.. తెలంగాణ ఉద్యమకారుల ఆగ్రహం

ఓవైపు భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతుండగా.. మరోవైపు మాత్రం కొందరు తెలంగాణవాదులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

By:  M Prashanth   |   5 Dec 2025 2:07 PM IST
వాళ్లవి లేనప్పుడు బాలు విగ్రహం ఎందుకు?.. తెలంగాణ ఉద్యమకారుల ఆగ్రహం
X

దివంగత గాన గంధర్వుడు, ప్రముఖ గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటు ఇప్పుడు తీవ్ర వివాదానికి దారితీసింది. హైదరాబాద్‌ లోని ప్రముఖ సాంస్కృతిక కేంద్రమైన రవీంద్రభారతి ప్రాంగణంలో బాలు విగ్రహాన్ని ఆయన పుట్టిన రోజైన డిసెంబర్ 15వ తేదీన ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి.

ఓవైపు భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతుండగా.. మరోవైపు మాత్రం కొందరు తెలంగాణవాదులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రవీంద్రభారతిలో కేవలం తెలంగాణకు చెందిన ప్రముఖుల విగ్రహాలే ఉండాలని, ఆంధ్రప్రదేశ్ వాళ్లవి కాదని తెలంగాణ ఉద్యమకారుడు పృథ్వీరాజ్ వాదిస్తున్నారు.

తెలంగాణ గడ్డపై తమ రాష్ట్రానికి చెందిన ప్రజాకవి గద్దర్, ప్రముఖ కవి అందెశ్రీ వంటి మహానుభావులకు దక్కాల్సిన గౌరవం అర్జెంట్ గా దక్కాలని డిమాండ్ చేస్తున్నారు. అంతే కానీ ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారి విగ్రహాలు మాత్రం తెలంగాణలో ఏర్పాటు చేయడానికి తాము ఎట్టి పరిస్థితుల్లో కూడా అంగీకరించబోమని చెబుతున్నారు.

ఇప్పుడు మరోసారి ఆయన మీడియాతో మాట్లాడారు. దాదాపు 50- 60 ఏళ్ల క్రితం సినిమా ఇండస్ట్రీలో తెలంగాణలోని సిరిసిల్ల ప్రాంతానికి చెందిన పైడి జయరాజ్ 8-9 భాషల్లో నటించారని, ఆయన విగ్రహం పెట్టాలని చెప్పారు. వాళ్లను అగౌరవపరుస్తున్నారని ఆరోపించారు. ఆ తర్వాత మందాడి ప్రభాకర్ రెడ్డి గురించి మాట్లాడారు.

ఆయన ఎన్నో సినిమాల్లో నటించారని.. చెన్నై నుంచి హైదరాబాద్ కు ఇండస్ట్రీ వచ్చినప్పుడు చిత్రపురి కాలనీలో కొన్ని కోట్ల రూపాయల విలువైన తన 12 ఎకరాలను భూమిని రాసిచ్చారని తెలిపారు. కానీ ఆయన విగ్రహం మాత్రం ఎక్కడా లేదని అన్నారు. అందుకే ఆ విషయంపై ఇప్పుడు గట్టిగా అడుగుతున్నట్లు పృథ్వీరాజ్ చెబుతున్నారు.

ఆ తర్వాత కోదాడకు చెందిన కత్తి కాంతారావు ఎంత ప్రముఖ నటుడో అందరికీ తెలుసు అని, కానీ ఆయన విగ్రహం మాత్రం పెట్టరని అన్నారు. అలా చాలా మంది తెలంగాణకు చెందిన ప్రముఖుల విగ్రహాలు లేవని చెప్పారు. అయితే ఆయన.. తన సహచరులతో బాలు విగ్రహం ఏర్పాటును అడ్డుకునే ప్రయత్నం కూడా ఇటీవల చేశారు.

ఆ విషయం తెలుసుకున్న ఎస్పీ బాలు అల్లుడు, ప్రముఖ నటుడు శుభలేఖ సుధాకర్ పృథ్వీరాజ్‌ తో మాట్లాడారు. నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. బాలసుబ్రహ్మణ్యం కేవలం ఒక ప్రాంతానికి చెందిన వ్యక్తి కాదని, ఆయనను గౌరవించాల్సింది పోయి, ప్రాంతీయతను ఆపాదించడం ఇప్పుడు కళను అవమానించడమేనంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే బాలు విగ్రహం ఏర్పాటు విషయంలో చివరికి ఏమవుతుందో వేచి చూడాలి.