Begin typing your search above and press return to search.

టాప్ స్టోరి: నార్త్ స్టార్ల‌తో పోలిస్తే సౌత్ స్టార్లు అందుకే గ్రేట్

గ్లామర్ ప్రపంచంలో ఉంటూ.. కోట్లాది రూపాయల పారితోషికాన్ని కాదనుకోవడం సామాన్యమైన విషయం కాదు.

By:  Sivaji Kontham   |   29 Jan 2026 8:00 AM IST
టాప్ స్టోరి: నార్త్ స్టార్ల‌తో పోలిస్తే సౌత్ స్టార్లు అందుకే గ్రేట్
X

గ్లామర్ ప్రపంచంలో ఉంటూ.. కోట్లాది రూపాయల పారితోషికాన్ని కాదనుకోవడం సామాన్యమైన విషయం కాదు. ఉత్తరాది (బాలీవుడ్) స్టార్లకు, దక్షిణాది (సౌత్) స్టార్లకు మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసం నిజంగా ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది. సౌత్ స్టార్లు ఉత్త‌రాది స్టార్ల‌తో పోలిస్తే ఒక ర‌కంగా ఆద‌ర్శ‌వంత‌మైన ఆలోచ‌న‌ల‌ను క‌లిగి ఉన్నార‌ని అంగీక‌రించాలి.

నిజానికి దక్షిణాది స్టార్లకు విలువలే ప్రాణం అంటే అతిశ‌యోక్తి కాదు. సౌత్ లో అగ్ర హీరోల‌కు చాలాసార్లు పొగాకు ఉత్ప‌త్తులు, ఖైనీలు, జ‌ర్ధాలు స‌హా మ‌ద్యం బ్రాండ్ల‌కు ప్ర‌చారం చేసే అవ‌కాశాలొచ్చాయి. పెద్ద మొత్తాన్ని కంపెనీలు ఆఫ‌ర్ చేసినా మ‌న‌వాళ్లు సింపుల్ గా తిర‌స్క‌రించారు. యువ‌త‌రం స‌హా ప్ర‌జ‌ల్ని త‌ప్పు దోవ ప‌ట్టించే ఉత్ప‌త్తుల‌కు ప్ర‌చారం చేయ‌కూడ‌ద‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు క‌థ‌నాలొచ్చాయి.

పవన్ కళ్యాణ్ తన వ్యక్తిత్వానికి, విలువలకే మొదటి ప్రాధాన్యం ఇస్తారని ఈ 40 కోట్ల ఆఫర్ తిరస్కరణ మరోసారి నిరూపించింది. ప్రస్తుత రాజకీయ బాధ్యతల నడుమ కూడా ఆయన తన నైతికతను వదులుకోకపోవడం గమనార్హం. ఓసారి పొగాకు ఉత్ప‌త్తుల‌కు ప్ర‌చారం చేయాల్సిందిగా ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌కి ఆఫ‌ర్ వ‌చ్చింది. అయితే ఆయ‌న ఇలాంటి త‌ప్పుడు ప‌నులు చేయ‌న‌ని, ఆ ప్రొడ‌క్ట్ గురించి, కంపెనీ గురించి కూడా వినకుండా తిరస్క‌రించాడు. రూ. 40 కోట్ల ఆఫర్‌ను తిరస్కరించడం ప‌వ‌న్ నిఖార్సైన వ్యక్తిత్వానికి నిదర్శనం. యువత తనను అనుసరిస్తారని, తన వల్ల వారు తప్పుడు మార్గంలో వెళ్లకూడదనే నైతిక బాధ్యత ఆయనలో కనిపిస్తుంది. రాజకీయాల్లో ఉన్నా, సినిమాల్లో ఉన్నా ఆయన పంథా ఒక్కటేన‌ని ప్రూవైంది.

రజనీకాంత్ ఒక‌ సూపర్‌స్టార్ హోదాలో ఉండి కూడా ఆయన సాఫ్ట్ డ్రింక్ (కోలా) కంపెనీల ప్రకటనలను తిరస్కరించారు. ఆరోగ్యానికి హాని చేసే వాటికి దూరంగా ఉండటమే కాకుండా, తన అభిమానులకు కూడా అవే విలువలను బోధించారు. అల్లు అర్జున్ , మహేష్ బాబు వీరిద్దరూ కూడా గతంలో పొగాకు, మద్యం కంపెనీల నుండి వచ్చిన భారీ ఆఫర్లను తిరస్కరించి, సామాజిక బాధ్యతను చాటుకున్నారు. అయితే కోలాల‌కు మాత్ర‌మే ఈ ఇద్ద‌రూ ప్ర‌చారం చేస్తున్నారు. ఆ ఇద్ద‌రూ విష ప‌దార్థాలు నిండి ఉండే కోలాల ప్ర‌చారం కూడా మానుకోవాల‌ని విశ్లేష‌కులు సూచిస్తున్నారు.

ఇక సౌత్ స్టార్ల‌తో పోలిస్తే, బాలీవుడ్ స్టార్ల వ్యాపార దృక్పథం గురించి తెలిసిందే. బాలీవుడ్‌లో అగ్ర హీరోలైన షారుఖ్ ఖాన్, అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్ వంటి వారు `ఇలైచీ` పాన్ మసాలా బ్రాండ్ అయిన‌ పొగాకు ప్రచార‌ యాడ్స్‌లో నటించడంపై తీవ్ర‌ విమర్శలు చెల‌రేగాయి. `ఫిట్‌నెస్ ఐకాన్` అని చెప్పుకునే అక్షయ్ కుమార్ పొగాకు బ్రాండ్ యాడ్‌లో కనిపించడంపై నెటిజన్లు తీవ్రంగా స్పందించడంతో, ఆయన క్షమాపణలు చెప్పి ఆ కాంట్రాక్ట్ నుండి తప్పుకున్నారు. కానీ ఇప్పటికీ చాలా మంది హిందీ స్టార్లు కేవలం డబ్బు కోసం ఇటువంటి బ్రాండ్లకు అంబాసిడర్లుగా కొనసాగుతూనే ఉన్నారు.

ఎందుకు సౌత్ స్టార్లు గ్రేట్?

ర‌జ‌నీకాంత్, చిరంజీవి, ప‌వ‌న్, మ‌హేష్, అల్లు అర్జున్, రామ్ చ‌ర‌ణ్, ఎన్టీఆర్, ప్ర‌భాస్ వంటి స్టార్లు ఎప్పుడూ సామాజిక బాధ్య‌త‌తో న‌డుచుకుంటున్నారు. వారు చాలా సంద‌ర్భాల‌లో పేద‌లు, అవ‌స‌రార్థుల‌కు స‌హాయం అందించారు. సామాజిక బాధ్యత, విలువలకు చాలా ప్రాధాన్య‌త‌నిచ్చారు. ముఖ్యంగా తమను ఆరాధించే అభిమానుల ఆరోగ్యంపైనా మ‌న స్టార్లు దృష్టి పెడ‌తారు.

ఒక విధంగా వెండితెరపై హీరోగా కనిపించడం వేరు.. నిజ జీవితంలో హీరోగా నిలబడటం వేరు. పవన్ కళ్యాణ్, రజనీకాంత్ వంటి వారు తమ నిర్ణయాల ద్వారా కోట్లాది మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అందుకే వారిని అభిమానులు కేవలం నటులుగా మాత్ర‌మే కాకుండా, ఒక శక్తిగా ఆరాధిస్తారు. సమాజంపై సెలబ్రిటీల ప్రభావం చాలా ఉంటుంది. త‌మ అభిమాన తార‌ల‌ను అనుస‌రించాల‌ని అభిమానులు కోరుకుంటారు. అందుకే బాధ్య‌త‌గా ఉండేందుకు, డ‌బ్బు కంటే విలువ‌ల‌కు ప్రాధాన్య‌త‌నిచ్చేందుకు చాలా మంది సౌత్ స్టార్లు ప్ర‌య‌త్నిస్తున్నారు. అయితే ఇలాంటి ధోర‌ణి హిందీ స్టార్ల విష‌యంలో అంత‌గా క‌నిపించ‌దు.