రాజకీయాలు కష్టం అని తెలుసుకున్న టాప్-5 స్టార్లు
రాజకీయం అంటే కేవలం జనం రావడం కాదని, అది వ్యూహప్రతివ్యూహాలతో కూడిన ఒక చదరంగమని తెలుసుకునే లోపే వీరు గట్టి దెబ్బలు తిన్నారు.
By: Sivaji Kontham | 14 March 2026 4:00 AM ISTసినిమా రంగంలో ఓ వెలుగు వెలిగిన స్టార్లు రాజకీయాల్లోకి రావడం, అక్కడ రొంపిలో చిక్కుకుని విలవిలలాడటం భారతీయ రాజకీయాల్లో కొత్తేమీ కాదు. వెండితెరపై కోట్లాది మంది అభిమానులను ఉర్రూతలూగించినా, ప్రజాక్షేత్రంలోకి వచ్చేసరికి పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉంటాయని ఈ ఐదుగురు అగ్ర నటుల అనుభవాలు నిరూపిస్తున్నాయి. రాజకీయం అంటే కేవలం జనం రావడం కాదని, అది వ్యూహప్రతివ్యూహాలతో కూడిన ఒక చదరంగమని తెలుసుకునే లోపే వీరు గట్టి దెబ్బలు తిన్నారు.
మెగాస్టార్ చిరంజీవి విషయానికి వస్తే.. 2008లో `ప్రజారాజ్యం` పార్టీని స్థాపించి ఆయన ఒక పెను సంచలనం సృష్టించారు. సామాజిక న్యాయం నినాదంతో వచ్చిన ఆయన సభలకు లక్షలాది మంది తరలివచ్చారు. కానీ 2009 ఎన్నికల ఫలితాలు ఆయనను తీవ్రంగా నిరాశపరిచాయి. క్షేత్రస్థాయిలో యంత్రాంగం లేకపోవడం, రాజకీయ వ్యూహకర్తల లోటు వల్ల చివరకు తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక అగ్ర నటుడిగా వెలిగిన చిరంజీవి రాజకీయాల్లో విషతుల్య వాతావరణాన్ని తట్టుకోలేకపోయారు. మళ్లీ తన ఎదుగుదలలో కీలకమైన ఇండస్ట్రీ సినీపరిశ్రమకు పరిమితమయ్యారు. చిరుకు ప్రతిదీ ఒక లెర్నింగ్ ఎక్స్ పీరియెన్స్.
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రయాణం మరో రకంగా సాగింది. దశాబ్దాల పాటు `రాజకీయాల్లోకి వస్తాను` అంటూ అభిమానులను ఊరించిన రజనీ, చివరకు పార్టీ ప్రకటన చేసే సమయానికి అనారోగ్య కారణాలతో వెనక్కి తగ్గారు. రాజకీయాల్లోని ఒత్తిడిని, కుతంత్రాలను తట్టుకోవడం తన ఆరోగ్యానికి శ్రేయస్కరం కాదని గ్రహించిన ఆయన.. పార్టీని ప్రారంభించినట్లే ప్రారంభించి ఆ తర్వాత విరమించుకున్నారు. రజనీ వంటి ఆధ్యాత్మిక చింతన కలిగిన వ్యక్తికి ఈ రాజకీయ రొంపి సరిపడదని ఆయన నిర్ణయమే స్పష్టం చేసింది.
మరో దిగ్గజ నటుడు కమల్ హాసన్ `మక్కల్ నీది మయ్యం` (ఎంఎన్ఎం) పార్టీని పెట్టి వ్యవస్థను మారుస్తానని ప్రకటించారు. ఉలగనాయగన్ మేధస్సుకు ప్రజలు నీరాజనాలు పట్టినా.. ఓట్ల రూపంలో మాత్రం ఆదరణ లభించలేదు. వరుస ఎన్నికల్లో ఆయన పార్టీ ప్రభావం చూపలేకపోయింది. ఒకానొక దశలో అగ్ర నాయకులంతా పార్టీని వీడటంతో ప్రస్తుతం కమల్ పార్టీ సుప్తావస్థకు చేరుకుంది. డీఎంకే వంటి బలమైన పార్టీల ముందు తన ఉనికిని కాపాడుకోవడానికి ఆయన ఇప్పుడు ఇతర పార్టీల మద్దతుపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇక ప్రస్తుత తరం స్టార్ హీరో దళపతి విజయ్ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. `తమిళగ వెట్రి కజగం` (TVK) పార్టీని ప్రారంభించిన ఏడాది లోపే ఆయన పది పెద్ద దెబ్బలు తినాల్సి వచ్చింది. అటు సినిమాలు చేయక పారితోషికాలు లేక, ఇటు వ్యక్తిగత జీవితంలో విడాకుల వివాదాలు, మరోవైపు రాజకీయ సభల్లో తొక్కిసలాట మృతుల ఘటన ఆయనను ఉక్కిరిబిక్కిరి చేసాయి. రిలీజ్ వివాదం కారణంగా `జననాయగన్` ఓటీటీ డీల్ రద్దు కావడం .. ఈ సినిమాని రిలీజ్ కానివ్వకుండా చేయడం వంటి పరిణామాలు చూస్తుంటే రాజకీయం అంటే పూలబాట కాదని, ముళ్ల బాట అని ఆయనకు రుచి చూపిస్తున్నాయి.
పవన్ కల్యాణ్ విషయానికి వస్తే, ఆయన పదేళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత రెండో దఫా పొత్తులతో నెగ్గి అధికారంలోకి వచ్చారు. అయితే, జనసేనాని కూడా రాజకీయం ఏమాత్రం సులువు కాదని ఇప్పటికే అర్థం చేసుకున్నారు. అధికారం దక్కినా ప్రజా సమస్యలను తీర్చడంలో ఎదురయ్యే సవాళ్లు, మిత్రపక్షాల మధ్య సమన్వయం వంటివి ఆయనకు కొత్త పాఠాలను నేర్పుతున్నాయి. వీరితో పాటు మరికొందరు సినీ తారలు పార్టీలు పెట్టినా కనీసం గుర్తింపుకు కూడా నోచుకోకుండా కాలగర్భంలో కలిసిపోయారు. వెండితెరపై హీరోగా వెలగడం ఈజీయే ఏమో కానీ, రాజకీయ రొంపిలో తామర పువ్వులా వికసించడం మాత్రం సామాన్యం కాదని ఈ స్టార్ల అనుభవాలు నిరూపిస్తున్నాయి.
