Begin typing your search above and press return to search.

ఫ్యాన్స్‌కు పండగ… కానీ బాక్సాఫీస్‌కు పరీక్ష

సినిమా ఎలా ఉంది అనే డిస్క‌ష‌న్ కంటే ముందుగా డే1 ఎంత క‌లెక్ట్ చేసింది, ఎన్ని షోలు హౌస్‌ఫుల్ అయ్యాయి, ఏ రాష్ట్రంలో రికార్డులు నమోదయ్యాయి అనే అంశాలే ప్రధాన చర్చగా మారుతున్నాయి.

By:  Sravani Lakshmi Srungarapu   |   14 Aug 2026 6:00 AM IST
ఫ్యాన్స్‌కు పండగ… కానీ బాక్సాఫీస్‌కు పరీక్ష
X

సౌత్ సినీ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోల మధ్య పోటీ కొత్త విషయం కాదు. కానీ ఇద్దరు లెజెండరీ స్టార్లు ఒకే పండగ సీజన్‌ను టార్గెట్ చేసే అవకాశం కనిపించినప్పుడల్లా డిస్క‌ష‌న్ కేవలం సినిమాల గురించే ఉండదు. ఫ్యాన్ బేస్, సోషల్ మీడియా ట్రెండ్స్, ఫస్ట్ డే కలెక్షన్లు, థియేటర్ వాతావరణం వరకు ఆ పోటీ విస్తరిస్తుంది. అందుకే ఇలాంటి క్లాష్‌లు ఫ్యాన్స్ కు ఉత్సాహాన్ని ఇచ్చినా, బాక్సాఫీస్‌కు మాత్రం పెద్ద పరీక్షగా మారతాయి.

గత కొన్నేళ్లుగా స్టార్ హీరోల సినిమాల విషయంలో ఫస్ట్ డే కలెక్షన్ కల్చర్ మరింత బలపడింది. సినిమా ఎలా ఉంది అనే డిస్క‌ష‌న్ కంటే ముందుగా డే1 ఎంత క‌లెక్ట్ చేసింది, ఎన్ని షోలు హౌస్‌ఫుల్ అయ్యాయి, ఏ రాష్ట్రంలో రికార్డులు నమోదయ్యాయి అనే అంశాలే ప్రధాన చర్చగా మారుతున్నాయి. దీంతో ప్రతి పెద్ద సినిమా రిలీజ్ నెంబ‌ర్స్ కాంపిటీష‌న్ గా మారిపోతోంది.

ఈ నేపథ్యంలో ఫ్యాన్ షోలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. వేకువ‌జామునే స్పెష‌ల్ షోలు, భారీ కటౌట్లు, బ్యాండ్‌లు, సెలబ్రేషన్లు, సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియోలు.. ఇవ‌న్నీ సినిమా రిలీజ్ ను ఒక ఈవెంట్‌గా మార్చేస్తున్నాయి. ముఖ్యంగా ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు దగ్గర్లో రిలీజైతే, అభిమాన సంఘాల మధ్య పోటీ మరింత తీవ్రమవుతుంది.

అయితే అసలు యుద్ధం ఇప్పుడు సోషల్ మీడియాలోనే జరుగుతోంది. టీజర్ నుంచి ట్రైలర్ వరకు, అడ్వాన్స్ బుకింగ్స్ నుంచి ఓపెనింగ్ డే క‌లెక్ష‌న్ వరకు ప్రతి అంశంపై అభిమాన వర్గాలు తమ హీరో ఆధిపత్యాన్ని నిరూపించేందుకు ప్రయత్నిస్తాయి. ట్రెండింగ్ హ్యాష్‌ట్యాగ్‌లు, ఫ్యాన్ ఎడిట్స్, బాక్సాఫీస్ పోస్టర్లు, రికార్డుల పోలికలు.. ఇవన్నీ ప్రచారంలో భాగమైపోయాయి.

ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ అంశం మార్కెట్ విస్తరణ. ఒకప్పుడు తెలుగు, తమిళ మార్కెట్లు వేర్వేరుగా కనిపించేవి. ఇప్పుడు పెద్ద సినిమాలకు భాషా సరిహద్దులు తగ్గిపోయాయి. ఒక హీరోకి మరో రాష్ట్రంలో ఉన్న ఫ్యాన్ బేస్ కూడా ఓపెనింగ్స్‌పై ప్రభావం చూపుతోంది. అందువల్ల పోటీ కేవలం రెండు రాష్ట్రాల మధ్య కాకుండా, సౌత్ మొత్తం మార్కెట్‌ను ప్రభావితం చేసే స్థాయికి చేరుకుంది. చివరికి ఇలాంటి క్లాష్‌లలో గెలుపోటములు అభిమానుల డిస్క‌ష‌న్స్ లో ఎంత పెద్దవైనా, ఇండ‌స్ట్రీ దృష్టిలో అసలు ప్రశ్న వేరు. రెండు భారీ సినిమాలు ఒకే సమయంలో వస్తే థియేటర్ల పంపిణీ, స్క్రీన్ కేటాయింపు, కలెక్షన్ల విభజన ఎలా ఉంటుంది? అందుకే ఫ్యాన్స్‌కు ఇది పండగ అయితే, బాక్సాఫీస్‌కు మాత్రం నిజమైన పరీక్ష.