అన్ని సమస్యలకు చెక్: దక్షిణాది సినీనిర్మాతల ఐక్య వేదిక SIFPA ఏర్పాటు
దక్షిణాది చిత్ర పరిశ్రమలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. తెలుగు-తమిళ- మలయాళ- కన్నడ సినీ పరిశ్రమలకు చెందిన ప్రముఖ నిర్మాతలు.. అన్ని పరిశ్రమల నుంచి ప్రొడ్యూసర్స్ గిల్డ్ ప్రతినిధులు హైదరాబాద్‌లోని హోటల్ దసపల్లాలో అత్యవసరంగా సమావేశమయ్యారు.
By: Sivaji Kontham | 19 April 2026 7:11 PM ISTదక్షిణాది చిత్ర పరిశ్రమలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. తెలుగు-తమిళ- మలయాళ- కన్నడ సినీ పరిశ్రమలకు చెందిన ప్రముఖ నిర్మాతలు.. అన్ని పరిశ్రమల నుంచి ప్రొడ్యూసర్స్ గిల్డ్ ప్రతినిధులు హైదరాబాద్‌లోని హోటల్ దసపల్లాలో అత్యవసరంగా సమావేశమయ్యారు. ఈ కీలక భేటీలో పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లను ఎదుర్కోవడానికి అందరూ ఏకతాటిపైకి వచ్చి `సౌత్ ఇండియన్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్` (SIFPA) అనే కొత్త సంస్థను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
ఈ సమావేశంలో ప్రధానంగా థియేట్రికల్ నిబంధనలు, 8 వారాల ఓటీటీ విండో గడువుపై ఇతర భాగస్వాములు ఏకపక్షంగా తీసుకుంటున్న నిర్ణయాలను నిర్మాతలు తీవ్రంగా ఖండించారు. పరస్పర సంప్రదింపులు లేకుండా తీసుకునే ఇటువంటి నిర్ణయాలు వేలాది మంది జీవనోపాధిని దెబ్బతీస్తాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న చిత్ర నిర్మాణ వ్యవస్థను అకస్మాత్తుగా మార్చడం వల్ల వివిధ దశల్లో ఉన్న ప్రాజెక్టులు చిక్కుల్లో పడతాయని.. అందుకే ఈ నిర్ణయాలను సమిష్టిగా ఎదురించాలని నిర్ణయించుకున్నారు.
కొత్తగా ఏర్పడిన ఈ SIFPA కార్యకలాపాలను పర్యవేక్షించడానికి నాలుగు భాషా పరిశ్రమల ప్రతినిధులతో కూడిన ఒక ఉన్నత స్థాయి స్టీరింగ్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఈ కమిటీ నిర్మాతల ప్రయోజనాలను కాపాడటమే కాకుండా.. నాలుగు పరిశ్రమల మధ్య ఎప్పటికప్పుడు సమన్వయం కుదుర్చుకుంటూ తక్షణ సవాళ్లను పరిష్కరిస్తుంది. పరిశ్రమలో ప్రధాన పెట్టుబడిదారుడైన నిర్మాతకు నిర్ణయాధికారాల్లో సర్వాధికారాలు ఉండాలనేది ఈ కమిటీ ప్రధాన ఉద్దేశం.
నిర్మాతలందరికీ ఈ సందర్భంగా SIFPA కొన్ని కీలక సూచనలు జారీ చేసింది. ప్రస్తుతం అనుసరిస్తున్న చిత్ర నిర్మాణ ప్రక్రియలను.. హక్కుల విక్రయాలను..విడుదల తేదీలను ఎవరి ఒత్తిడి లేకుండా యథావిధిగా కొనసాగించాలని స్పష్టం చేసింది. ముఖ్యంగా ఓటీటీ విడుదల గడువు విండోకు సంబంధించి ఎటువంటి అసోసియేషన్లకు లేదా ఇతర రంగాలకు అప్పుడే `లెటర్ ఆఫ్ కమిట్‌మెంట్` ఇవ్వవద్దని నిర్మాతలకు గట్టిగా సూచించింది. ఆర్థిక లాభనష్టాలను బేరీజు వేసుకున్న తర్వాతే సమిష్టిగా దీనిపై నిర్ణయం తీసుకోవాలని తీర్మానించారు.
దక్షిణాది సినీ రంగంలో నిర్మాతలందరూ ఒకే గొడుగు కిందకు రావడం ఒక చారిత్రాత్మక ఘట్టంగా అభివర్ణించవచ్చు. టాలీవుడ్, కోలీవుడ్ , మాలీవుడ్, శాండల్వుడ్ కి చెందిన ప్రధాన అసోసియేషన్ల (TFPC, ATFPG, TFAPA, KFPA) మద్దతుతో ఈ కొత్త వ్యవస్థ పని చేయనుంది. ఇది కేవలం ఒక భాషకో ప్రాంతానికో పరిమితం కాకుండా.. మొత్తం దక్షిణాది సినీ పర్యావరణ వ్యవస్థను కాపాడటంలో కీలక పాత్ర పోషించబోతోంది.
