బాలీవుడ్‌లో సౌత్ బ్యూటీల హవా.. భారీ రెమ్యునరేషన్స్!
ఒకప్పుడు బాలీవుడ్ మాత్రమే అత్యున్నత పారితోషికాలు - గ్లోబల్ గుర్తింపునకు చిరునామాగా ఉండేది.
By: Srikanth Kontham | 4 Jun 2026 9:00 PM ISTఒకప్పుడు బాలీవుడ్ మాత్రమే అత్యున్నత పారితోషికాలు - గ్లోబల్ గుర్తింపునకు చిరునామాగా ఉండేది. ఆ రోజుల్లో దక్షిణాదికి చెందిన కథానాయికలు హిందీ చిత్రాలలో అవకాశాల కోసం రెమ్యునరేషన్ విషయంలో చాలా వరకు సర్దుకుపోయేవారు. బాలీవుడ్ మార్కెట్లో అడుగుపెట్టడమే గౌరవంగా భావించి తక్కువ పారితోషికానికి కూడా అంగీక రించేవారు. కానీ నేడు సీన్ మారింది. పాన్ ఇండియా యుగంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ప్రస్తుతం నార్త్ ఇండస్ట్రీలోనే సౌత్ బ్యూటీల హవా నడుస్తోంది. వారికున్న క్రేజ్ చూసి బాలీవుడ్ నిర్మాతలు అడిగినంత పారితోషాకం ఇవ్వడానికి వెనుకాడటం లేదు.
ఈ సరికొత్త ట్రెండ్‌లో అగ్రస్థానంలో దూసుకుపోతోంది నేషనల్ క్రష్ రష్మిక మందన. దక్షిణాది చిత్రాలతో క్రజీ బ్యూటీగా మారిన రష్మిక బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన తక్కువ సమయంలోనే టాప్ లీగ్‌లోకి చేరిపోయింది. ప్రస్తుతం అమ్మడు ఒక్కో హిందీ సినిమాకు ఏకంగా 12 కోట్ల వరకు పారితోషికం అందుకుంటుందని సమాచారం. త్వరలో పట్టాలెక్కబోయే మరో ప్రతిష్టాత్మక హిందీ ప్రాజెక్ట్ కోసం ఆమె 15 కోట్ల వరకు డిమాండ్ చేసిందని ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తోంది. దీంతో బాలీవుడ్ లో రష్మిక డిమాండ్ ఎలా ఉంద న్నది అద్దం పడుతుంది.
లేడీ సూపర్ స్టార్ నయనతార సైతం బాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే బిజీ అయ్యే ప్రయత్నాల్లో ఉంది. షారుఖ్ ఖాన్ సరసన నటించిన `జవాన్` చిత్రంతో హిందీలోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చిన నయనతార ఆ సినిమా విజయంతో 13 కోట్ల భారీ రెమ్యునరేషన్ అందుకుంది. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ కథానాయకుడిగా వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తోన్న భారీ ప్రాజెక్ట్ కోసం నయన్ అంతకంటే ఎక్కువ మొత్తాన్ని డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ స్థాయి పారితోషికం బాలీవుడ్‌లోని అగ్ర కథానాయికలకు సైతం సవాలు విసిరేలా ఉంది.
సౌత్ హీరోయిన్లకు ఈ స్థాయిలో డిమాండ్ పెరగడానికి ప్రధాన కారణం వారికున్న పాన్-ఇండియా అప్పీల్ .. విస్తృతమైన మార్కెట్ పరిధి అనొచ్చు. దక్షిణాది చిత్రాలు నార్త్ బెల్ట్‌లో అద్భుతమైన వసూళ్లు సాధిస్తుండటంతో ఇక్కడి నటీనటులకు దేశవ్యాప్తంగా విపరీతమైన ఫ్యాన్ బేస్ ఏర్పడింది. బాలీవుడ్ నిర్మాతలు సైతం తమ చిత్రాలను దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయడానికి సౌత్ స్టార్ల ఇమేజ్‌ను వాడుకోవాలని చూస్తున్నారు. దీంతో భాషా సరిహద్దులను దాటి మరీ సౌత్ హీరోయిన్ల కోసం భారీ బడ్జెట్లను కేటాయించడానికి సిద్ధపడుతున్నారు.
ఈ పరిణామం భారతీయ సినిమా రంగంలో నటీనటుల స్థానాన్ని - వారి స్టార్ పవర్‌ను సరికొత్త కోణంలో ఆవిష్కరిస్తోంది. ఒకప్పుడు ప్రాంతీయ నటీనటులుగా ముద్రపడిన వారు నేడు బాలీవుడ్ అగ్ర హీరోల సరసన సమానమైన గుర్తింపును.. పారితోషికాన్ని అందుకుంటున్నారు. భాషతో సంబంధం లేకుండా ప్రతిభ, స్క్రీన్ ప్రెజెన్స్ బాక్సాఫీస్ స్టామినా ఆధారంగానే రెమ్యునరేషన్లు ఖరారవుతున్నాయని ఈ మార్పు నిరూపిస్తోంది. ఇది టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరికీ ఇండస్ట్రీలో సమాన అవకాశాలు లభిస్తాయనే నమ్మకాన్ని కలిగిస్తోంది.
