పాన్ ఇండియా స్టేటస్ కావాలంటే ముంబై వెళ్లాల్సిందేనా?
ప్రస్తుతం సౌత్ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా డాలర్ల వర్షం కురిపిస్తూ బాక్సాఫీస్‌ను ఏలుతున్నాయి.
By: Madhu Reddy | 11 Sept 2026 12:36 PM ISTప్రస్తుతం సౌత్ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా డాలర్ల వర్షం కురిపిస్తూ బాక్సాఫీస్‌ను ఏలుతున్నాయి. 'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్', 'పుష్ప' లాంటి ప్రాజెక్టులతో టాలీవుడ్ పాన్ ఇండియా హబ్‌గా మారింది. కానీ విచిత్రంగా మన హీరోయిన్లలో మాత్రం "పాన్ ఇండియా క్రేజ్ రావాలంటే బొంబాయికి పోవాల్సిందే" అనే ఒక పాతకాలపు ఆలోచన ఇంకా అలాగే ఉండిపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. నిజంగానే ముంబై ఫ్లైట్ ఎక్కితే స్టార్ హోదా వస్తుందా? లేదా కంటెంట్ ఉన్న కథలనే నమ్ముకోవాలా? అనే విషయం చూద్దాం.
టాలీవుడ్ గ్రాండ్ సక్సెస్ – అయినా బాలీవుడ్ వ్యామోహమేంటి?:
ఈ రోజుల్లో దేశంలోనే అత్యంత భారీ బడ్జెట్, గ్లోబల్ మార్కెట్ ఉన్న సినిమాలు రూపొందుతోంది తెలుగులోనే. ఇక్కడ వరుసగా అవకాశాలు అందుకుంటున్న శ్రీలీల లాంటి క్రేజీ కథానాయికలు సైతం బి టౌన్ వైపు చూపులు చూస్తున్నారని వార్తలు రావడం అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది. ఒకప్పుడు దక్షిణాది నటీనటులకు బాలీవుడ్ ఒక కల కావచ్చు, కానీ ఇప్పుడు గ్లోబల్ ఆడియన్స్ మన బాహుబలి, పుష్ప ప్రపంచానికే జై కొడుతున్నారు. అలాంటిది ఇక్కడి మార్కెట్‌ను వదిలి ముంబై వెళ్తేనే ఆడియన్స్ గుర్తిస్తారనుకోవడం విడ్డూరమే.
బాలీవుడ్ ట్రాక్ రికార్డ్ – పూజా హెగ్డే చేదు అనుభవాలు :
టాలీవుడ్‌లో 'ధమాకా', 'భగవంత్ కేసరి' లాంటి హిట్స్‌తో దూసుకెళ్లిన శ్రీలీల ఇక్కడ సరైన టైం లో బాలీవుడ్ వెళ్తేనే క్రేజ్ వస్తుందనుకొని అక్కడికి వెళ్లి అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్నారు. ఇక పూజా హెగ్డే విషయాన్నే తీసుకుంటే.. ఇక్కడ టాప్ చైర్‌ని ఏలిన ఆమె హిందీలో 'మొహెంజొదారో', 'సర్కస్', 'కిసీ కా భాయ్ కిసీ కీ జాన్' అంటూ బాలీవుడ్ వ్యామోహంలో పడి వరుస డిజాస్టర్లు మూటగట్టుకుంది. అక్కడ సక్సెస్ సాధించడం అంత సులువు కాదని ఈ ఉదాహరణలు స్పష్టంగా చెప్తున్నాయి.
భాష కాదు.. కంటెంటే అసలైన "పాన్ ఇండియా"!:
ఒకప్పుడు "ముంబై హీరోయిన్" అనే ట్యాగ్ ఉండేది. కానీ ఇప్పుడు కాలానుగుణంగా ప్రేక్షకుల మైండ్‌సెట్ మారిపోయింది. ముంబై వెళ్లినంత మాత్రాన ఎవరూ గ్లోబల్ స్టార్ అయిపోరు. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన రష్మిక మందన్న 'పుష్ప'తో, మలయాళ బ్యూటీలు తమ సహజ నటనతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. సినిమా కథలో, చేసే పాత్రలో దమ్ము ఉంటే.. ప్రాంతంతో సంబంధం లేకుండా పాన్ ఇండియా స్టేటస్ ఆటోమేటిక్‌గా వెతుక్కుంటూ వస్తుంది.
భాషతో సంబంధం లేకుండా మంచి కంటెంట్‌ని, బలమైన పాత్రలను ఎంచుకున్నప్పుడే నటీనటులకు అసలైన పాన్ ఇండియా ఇమేజ్ వస్తుంది. కేవలం ప్రచారం కోసం లేదా బాలీవుడ్ ముద్ర కోసం ముంబై వైపు పరుగులు తీయడం కంటే, ఏ భాషలో ఉన్నా బలమైన కథలను ఎంచుకోవడమే నాయికలకు సుదీర్ఘ కెరీర్‌ను, నిజమైన పాన్ ఇండియా క్రేజ్‌ను అందిస్తుంది అంటున్నారు విశ్లేషకులు.
