ఓ స్టార్ డైరెక్టర్ వాడకం..ఇమేజ్ ని తొక్కేసేలా!
ఓ పాన్ ఇండియా సినిమా తీస్తున్నారంటే? ఆ రేంజ్ ఇమేజ్ ఉన్న నటుల్నే ఎంపిక చేస్తుంటారు.
By: Srikanth Kontham | 9 Aug 2025 7:00 PM ISTఓ పాన్ ఇండియా సినిమా తీస్తున్నారంటే? ఆ రేంజ్ ఇమేజ్ ఉన్న నటుల్నే ఎంపిక చేస్తుంటారు. ఏ పాత్రకు ఎవరు సూట్ అవుతారన్నది డైరెక్టర్ ఫైనల్ చేస్తుంటాడు. ప్రధాన పాత్రల ఎంపికలో డైరెక్టర్ మాత్రమే కీలక పాత్ర ధారి. ఇందులో మిగతా ఎవరూ కల్పించుకోరు. అంతిమంగా అతడు తీసుకున్న నిర్ణయమే ఫైనల్ అవుతుంది. మిగతా పాత్రలకు సంబంధించి ఎంపిక ప్రక్రియ అన్నది కోడైరెక్టర్లు...ఇతర శాఖలు చూసుకుంటాయి. అయితే ఇటీవలే ఓ పాన్ ఇండియా సినిమా భారీ కాన్వాస్ పై ప్రారంభమైంది. అందులో ఓ పెద్ద హీరో నటిస్తున్నాడు. జాతీయ, అంతర్జాతీయంగా పేరున్న నటుల్ని సైతం రంగంలోకి దించారు.
రాజీ పడని డైరెక్టర్:
గ్లోబల్ స్థాయిలో సినిమాను కనెక్ట్ చేయాలనే దృక్కోణంలో సదరు డైరెక్టర్ క్యాస్టింగ్ ఎంపికలో ఎక్కడా రాజీ పడలేదు. కోట్ల రూపాయాలు పారితోషికం చెల్లించి తనకు కావాల్సిన నటీనటుల్ని తీసుకున్నాడు. తాను రాసిన పాత్రకు ఎవరైతే సరితూగుతారో? ఆ పాత్రల విషయంలో ఎంత మాత్రం రాజీ పడలేదు. డిమాండ్ చేసినంత పారితోషికం అప్పటికప్పుడు సెటిల్ చేసి ఒప్పంద పత్రాలపై సంతకాలు చేయించుకున్నాడు. ఇదే కాన్పిడెన్స్ తో ఓ స్టార్ హీరోని కూడా అప్రోచ్ అయ్యాడు. ఆ హీరోకి గ్రేట్ పెర్పార్మర్ గా పేరుంది.
కమల్ హాసన్ తర్వాత అతడే:
విశ్వ నటుడు కమల్ హాసన్ తర్వాత అంతటి గొప్ప నటుడు ఎవరు? అంటే అతడి పేరే చెబుతారంతా. ఇండియాలోనే అతడో గ్రేట్ యాక్టర్. సౌత్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. హిందీలో సినిమాలు చేయలేదు గానీ చేస్తే అక్కడ హీరోలకే గట్టిపోటినిచ్చే సత్తా ఉన్న నటుడు. అలాంటి నటుడ్ని తన పాన్ ఇండియా సినిమాలో ఓ కీలక పాత్ర పోషించమన్నాడుట సదరు డైరెక్టర్. ఆ ఛాన్స్ ని అతడు మరో మాట లేకుండా రిజెక్ట్ చేసాడు. దీంతో సదరు డైరెక్టర్ పారితోషికంగా ఎరగా వేసే ప్రయత్నం చేసాడుట.
హీరోల ఇమేజ్ మధ్య పోలిక:
అయినా సరే ససేమేరా అన్నాడుట. తాను డబ్బు కోసం పనిచేసే నటుడిని కాదనని, డబ్బుతో తనని కొనా లనే ఆలోచన ఉంటే? మరోసారి తన ఇంటికి కూడా రావొద్దని కరాఖండీగా చెప్పేసాడుట. నటుడిగా తన కంటూ ఓ ఇమేజ్ ఉందని డైరెక్టర్ రాసిన పాత్ర కోసం తన ఇమేజ్ ను తాకట్టు పెట్టలేనని చెప్పాడుట. నటుడిగా మీ హీరో కు ఉన్న ఇమేజ్ ఎలాంటింది? తనకున్న ఇమేజ్ స్థాయి ఏంటి? అన్నది ఓ సారి దగ్గరగా పరిశీలించమని సూచించారుట.
వయసులోనూ వ్యత్యాసం లేదే:
సరైన కథలు..పాత్రలు పడక పోవడంతో రేసులో వెనుక బడ్డాను తప్ప! అవకాశాలు రాక కాదని కాస్త గట్టిగానే చెప్పాడుట. ఇద్దరి పాత్రల మధ్య వ్యత్యాసం పక్కన బెడితే? వయసులో కూడా పెద్దగా మార్పులేదని... డైరెక్టర్ ఆలోచన సవ్యంగా లేదని సదరు హీరో భావించినట్లు కనిపిస్తుంది. కారణా లేవైనా కొన్ని కాంబి నేషన్లు ఊహించని విధంగా కుదురుతుంటాయి. మరికొన్ని కుదరవు. ఇదీ అలాంటిందే.
