20 రూపాయల నుంచి 50 కోట్ల వరకూ!
అలాంటి వారిలో కోలీవుడ్ కి చెందిన నటుడు సూరి ఒకరు. ఒకప్పుడు రోజుకు 20 రూపాయల కూలీ కోసం కష్టపడిన సూరి ఎన్నో అవమానాలను దాటుకుని నేడు 50 కోట్ల వసూళ్లను సాధించే కథానాయకుడిగా ఎదిగారు.
By: Srikanth Kontham | 6 Sept 2026 12:00 PM ISTసినిమా రంగం అనేది ఎందరో కలలకు వేదిక. ప్రతి వారం వెండితెరపై అభిమాన నటులను చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు ఎలా వస్తారో? సినీ పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకోవాలనే ఆశతో వేలాది మంది పరిశ్రమలోకి అడుగు పెడుతుంటారు. అలాంటి వారిలో కోలీవుడ్ కి చెందిన నటుడు సూరి ఒకరు. ఒకప్పుడు రోజుకు 20 రూపాయల కూలీ కోసం కష్టపడిన సూరి ఎన్నో అవమానాలను దాటుకుని నేడు 50 కోట్ల వసూళ్లను సాధించే కథానాయకుడిగా ఎదిగారు.
సూరి అసలు పేరు రామ్‌లక్ష్మణన్ ముత్తుచామి తేవార్. సూపర్ స్టార్ రజనీకాంత్ కి ఆయన వీరాభిమాని. 1991లో రిలీజ్అ యిన `దళపతి` చిత్రంలో రజనీకాంత్ పోషించిన సూర్య పాత్ర ప్రభావంతో సూరి తన పేరును సూర్యగా మార్చుకున్నారు. 1993 కాలంలో తిరుప్పూర్‌లో స్నేహితులతో కలిసి చిన్న చిన్న పనులు చేసేవారు. ఆ సమయంలో సూరని రోజువారీ కూలీ 20 రూపాయలు మాత్రమే. వారం చివరలో వచ్చే 140 రూపాయలలో సగం డబ్బులు ఇంటికి పంపాల్సి వచ్చేది. రూపాయి పావలా ఉండే కోకోనట్ బన్ కొనడానికి కూడా డబ్బులు లేక టీతో సరిపెట్టుకునేవారు.
సినిమాల్లోకి రావడానికి ముందు సూరి అనేక పనులు చేశారు. భవనాలకు రంగులు వేసే పెయింటర్‌గా కూడా పని చేశారు. ఓ సినీ కార్యక్రమంలో గీత రచయిత పా. విజయ్ ఈ విషయాన్ని గుర్తుచేసుకున్నారు. `ఒకప్పుడు తాడుకు వేలాడుతూ గోడలకు రంగులు వేసిన నిన్ను ఈరోజు సినిమా తన భుజాలపై ఎత్తుకుని శిఖరానికి చేర్చింది` అని కొనియాడారు. 1998 నుంచే పరిశ్రమలో ఉన్నప్పటికీ పేరు లేని చిన్న పాత్రలు చేస్తూ ఎన్నో ఏళ్లు పోరాడారు. చివరికి 2009లో వచ్చిన `వెన్నిల కబడ్డీ కుజు` సినిమాలోని నటనతో సూరికి `పరోటా సూరి`గా గుర్తింపు లభించింది.
సినీ ప్రయాణంలో గుర్తింపు సాధించే క్రమంలో సూరి చాలా అవమానాలను కూడా ఎదుర్కొన్నారు. ఒక అగ్ర కమెడియన్ స్టార్ హీరో ఉన్న సినిమా షూటింగ్ సెట్‌లో జరిగిన సంఘటనను ఓ ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నారు. ఒక సన్నివేశంలో సూరి స్థానంలో వేరొకరిని హఠాత్తుగా తీసుకుని సూరి తొడుక్కున్న షర్టును ఊడదీసి ఆ నటుడికి ఇవ్వమని కోరారు. తన షర్టును కాస్ట్యూమ్ వ్యాన్‌లో పడేయడంతో మొలతాడు..టువాల్‌తో సెట్‌లో నిలబడి డ్రెస్ కోసం వెతుక్కోవాల్సి వచ్చిందని ఆ సన్నివేశం తనను తీవ్రంగా కలచివేసిందని సూరి తెలిపారు.
హాస్య నటుడిగా, సహాయ నటుడిగా విజయ్, రజనీకాంత్, శివకార్తికేయన్ వంటి అగ్ర కథానాయకుల సినిమాల్లో అలరించిన సూరి జీవితం 2023లో మలుపు తిరిగింది. దర్శకుడు వెట్రిమారన్ సూరిని `విడుదలై: పార్ట్ 1` చిత్రంలో కానిస్టేబుల్ కుమారేశన్ పాత్రకు కథానాయకుడిగా ఎంపిక చేశారు. ఈ చిత్రం 53 కోట్లు వసూలు చేయగా 2024లో రిలీజ్ అయిన `విడుదలై: పార్ట్ 2` 55 కోట్లు సాధించింది. ఆ తర్వాత సూరి కథానాయకుడిగా నటించిన `గరుడన్` 59 కోట్లు, `మామన్` మరో 52 కోట్లు వసూలు చేసి సూరిని 50 కోట్ల క్లబ్ హీరోగా నిలబెట్టాయి. కమెడియన్ స్థాయి నుంచి 50 కోట్ల హిట్లు సాధించే హీరోగా ఎదిగిన సూరి ప్రస్తుతం పరిశ్రమలో వేగంగా ఎదుగుతున్న నటులలో ఒకరు.
