ఒకటే జీవిత కథ.. ఒకరికి హిట్టు ఒకరికి ఫట్టు!
తమిళ స్టార్ హీరో సూర్య నటించిన `ఆకాశం నీ హద్దురా` (సురారై పొట్రు) ఓటీటీలో విడుదలై గొప్ప ఆదరణతో ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే.
By: Sivaji Kontham | 8 Nov 2025 3:00 AM ISTతమిళ స్టార్ హీరో సూర్య నటించిన `ఆకాశం నీ హద్దురా` (సురారై పొట్రు) ఓటీటీలో విడుదలై గొప్ప ఆదరణతో ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. సుధ కొంగర ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమాని హిందీలో అక్షయ్ కుమార్ కథానాయకుడిగా రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు కెప్టెన్ జిఆర్ గోపీనాథ్ జీవితం ఆధారంగా రూపొందించిన చిత్రమిది. బాలీవుడ్ లో అబుండంటియా ఎంటర్ టైన్ మెంట్ తో పాటు సూర్య ఈ ప్రాజెక్ట్ ను నిర్మించారు.
నిజానికి జిఆర్ గోపినాథ్ భారతదేశ సైనికుడిగా పని చేసి కెప్టెన్ గా ఎదిగి, చివరికి ఎంటర్ ప్రెన్యూర్‌గా మారారు. చౌక ధరలకే విమానయానాన్ని ప్రజలకు అందుబాటులోకి తేవాలనే తపనతో ప్రయత్నించిన వాడిగా చరిత్రకెక్కాడు. అతడి జీవిత కథ ఎందరికో స్ఫూర్తి. అందుకే ఆయన కథతో సినిమా తీసేందుకు మేకర్స్ ఉత్సాహం కనబరిచారు.
భారతదేశపు మొట్టమొదటి తక్కువ ధర విమానయాన సంస్థ ఎయిర్ డెక్కన్ స్థాపకుడు కెప్టెన్ గోపీనాథ్ జీవిత ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఉన్నాయి. ఏదీ నల్లేరుపై నడకలా సాగలేదు. అయినా అతడి ప్రయాణం భారతీయ విమానయానాన్ని మార్చడమే కాకుండా, అన్ని భాషలలో సినిమాలు తీసేందుకు ప్రేరణగా నిలిచింది.
తమిళంలో సూర్య నటించగా, ఆ తరువాత హిందీలో అక్షయ్ కుమార్ జిఆర్ గోపీనాథ్ పాత్రలో నటించారు.
గోరూర్ రామస్వామి అయ్యంగార్ కెప్టెన్ జిఆర్ గోపీనాథ్ కర్ణాటకలోని హసన్ జిల్లాలోని గోరూర్ అనే చిన్న గ్రామంలో జన్మించాడు. గోపీనాథ్ విద్యావేత్తగా ఎదిగాడు. బీజాపూర్‌లోని ప్రతిష్టాత్మక సైనిక్ స్కూల్‌లో స్థానం సంపాదించాడు. తరువాత భారత సైన్యంలో అధికారిగా నేషనల్ డిఫెన్స్ అకాడమీలో శిక్షణ పొందాడు. అతడి సైనిక జీవితం ఎనిమిది సంవత్సరాలు కొనసాగింది. 1971 ఇండో-పాక్ యుద్ధంలో సేవ చేయడం సహా అక్కడ అతడు కెప్టెన్ స్థాయికి ఎదిగాడు. వియత్నాం యుద్ధం తర్వాత తన దేశాన్ని పునర్నిర్మించడానికి హెలికాప్టర్లను నడిపిన వియత్నామీస్ అనాథ బాలిక కథ చదివిన తర్వాత ఎయిర్ డెక్కన్ ని ప్రారంభించాలని ప్రేరణ కలిగింది. విమానంలో ప్రయాణించేది ఖరీదైన వర్గాలే కాదు... ఆటో రిక్షా డ్రైవర్, ఆఫీస్ లో ఊడ్చే వాళ్లు కూడా అర్హత సాధించాలనే తపనతో ఈ ప్రయత్నం చేసారు. సామాన్యుల కోసం ఒక్క రూపాయికే విమాన టిక్కెట్లను అమ్మడం అది ఊహించలేనిది.. కానీ ఇక్కడి వరకు అంతా సజావుగానే ఉన్నా కానీ నిర్వహణ ఖర్చుల భారం, అధికారపరమైన అడ్డంకుల కారణంగా ఇది సాధ్యమేనా? అని చాలా మంది సందేహించారు.
ఒకటే జీవిత కథ.. రెండు సినిమాలు.. కానీ అందులో ఒకటి పెద్ద హిట్టయితే, మరొకటి ఫ్లాప్‌గా మారింది. సూర్యకు కలిసి వచ్చినట్టుగా అక్షయ్ కుమార్ కి ఇది కలిసి రాలేదు. హిందీలో ఈ బయోపిక్ చిత్రం ఫ్లాపవ్వడం నిరాశపరిచింది.
