Begin typing your search above and press return to search.

పెద్ద తోపు ద‌ర్శ‌కులు.. పాత కాలం ఐడియాల‌జీల‌తో ఫెయిల్

‘యే ప్రేమ్ మోల్ లియా’ నవంబర్ 27న విడుదల కానుండగా, 90ల నాటి కథన శైలిపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. మారిన ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్టుగా స్క్రిప్టులు మార్చుకోలేక వీవీ వినాయక్, పూరి, లింగుస్వామి వంటి దర్శకులు ఇబ్బందులు ఎదుర్కొన్నట్లే సూరజ్ బర్జాత్యాకు కూడా సమస్యలు తప్పవా? అన్న చర్చ మొదలైంది. ‘ఊంచాయ్’ ఆశించిన ఫలితం ఇవ్వకపోవడం, కొత్త సినిమా బుకింగ్స్ నెమ్మదించడం ఈ చర్చకు కారణమవుతున్నాయి.

By:  Sivaji Kontham   |   26 Nov 2026 2:18 PM IST
పెద్ద తోపు ద‌ర్శ‌కులు.. పాత కాలం ఐడియాల‌జీల‌తో ఫెయిల్
X

టాలీవుడ్ లో వీవీ వినాయ‌క్, పూరి, బి.గోపాల్, కోలీవుడ్ లో లింగుస్వామి, కేఎస్ ర‌వికుమార్.. వీళ్ల బాట‌లోనే సూర‌జ్ బ‌ర్జాత్యా కూడా పాత పంథాలో రొటీన్ క‌థ‌ల్ని ఎంచుకుంటున్నారా? నేటిత‌రానికి ఆయ‌న స్క్రిప్టులు సూట్ కావా? పూర్తి విశ్లేష‌ణ‌లోకి వెళితే...

బాలీవుడ్‌లో కుటుంబ కథా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన దర్శకుడు సూరజ్ బర్జాత్యా రూపొందించిన తాజా చిత్రం `యే ప్రేమ్ మోల్ లియా` నవంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. గతంలో రాజశ్రీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వచ్చిన మైనే ప్యార్ కియా, వివాహ్ వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద అనూహ్య రికార్డులు సృష్టించడంతో ఈ సినిమాపై స‌హ‌జంగా అంచ‌నాలుండాలి. కానీ అందుకు భిన్నంగా ఇది ఔట్ డేటెడ్ అనే డిబేట్ సోష‌ల్ మీడియాలో వేడెక్కిస్తోంది. కేవలం కుటుంబ ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకుని తెరకెక్కించిన ఈ చిత్రానికి బుకింగ్స్ నెమ్మదిగా సాగడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ సంద‌ర్భంగా పాత‌త‌రం ద‌ర్శ‌కుల గురించి రివైండ్ చేసుకుంటే..!

భారతీయ సినీ పరిశ్రమలో ఒకప్పుడు బాక్సాఫీస్‌ను శాసించిన దిగ్గజ దర్శకులు నేడు మారిన ప్రేక్షకుల అభిరుచులను అందుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనే విశ్లేష‌ణ‌లు ఇటీవ‌ల జోరందుకున్నాయి. ఒక దశలో వరుస ఇండస్ట్రీ హిట్లతో తిరుగులేని ముద్ర వేసిన స‌ద‌రు ద‌ర్శ‌కులు కాలక్రమేణా తమ పాత కథన శైలిని- రొటీన్ ఫార్ములాలను మార్చుకోకపోవడంతో వరుస పరాజయాలను చవిచూసారు. ఇదే బాట‌లో బాలీవుడ్ సీనియర్ దర్శకుడు సూరజ్ బర్జాత్యా కూడా చేర‌బోతున్నారా? అన్న చ‌ర్చ వేడెక్కిస్తోంది.

టాలీవుడ్‌లో మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన వీవీ వినాయక్, పూరి జగన్నాథ్, బి. గోపాల్ వంటి ప్ర‌ముఖుల‌కు బ‌ర్జాత్యా శైలి భిన్న‌మైన‌ది. అయితే ఒకప్పుడు ఇండస్ట్రీ హిట్లు ఇచ్చిన వీవీ వినాయక్ మారిన టేకింగ్ శైలిని అందుకోలేక రొటీన్ చిత్రాల‌తో భారీ పరాజయాలను ఎదుర్కొని దర్శకత్వానికి దూరమయ్యారు. హీరోయిజం ఎలివేషన్లతో ట్రెండ్ సెట్ చేసిన పూరి జగన్నాథ్ సైతం పాత తరహా మాస్ డైలాగులతో లైగర్, డబుల్ ఇస్మార్ట్ వంటి వరుస డిజాస్టర్లను చవిచూసి మార్కెట్ పరంగా వెనుకబడ్డారు. ఇక బి. గోపాల్ కూడా 2000వ దశకం తర్వాత మారిన కమర్షియల్ సినిమా తీరుతెన్నుల‌ను పట్టుకోలేక చివ‌రి ద‌శ‌లో రొటీన్ సినిమాలు తీసి తెరమరుగయ్యారు.

కోలీవుడ్‌లోనూ ఇదే తరహా పరిస్థితి కనిపిస్తోంది. రన్, పందెంకోడి వంటి చిత్రాలతో యువతను ఆకట్టుకున్న లింగుస్వామి ఆ తర్వాత మారిన ట్రెండ్ కి త‌గ్గ‌ట్టు అప్‌డేట్ కాలేకపోవడంతో వరుస ఫ్లాపులతో తన క్రేజ్‌ను కోల్పోయారు. మరో దిగ్గజ దర్శకుడు కేఎస్ రవికుమార్ సైతం రొటీన్ ఫ్యామిలీ-యాక్షన్ ఫార్ములాను వీడలేక రెగ్యుల‌ర్ కాన్సెప్టుల‌తో అవుట్‌డేటెడ్ డైరెక్టర్ అనే విమర్శలు ఎదుర్కొని.. ప్రస్తుతం పూర్తిగా నటనకే పరిమితమయ్యారు.

ఇప్పుడు వీళ్ల బాటలోనే బాలీవుడ్ దర్శకుడు సూరజ్ బర్జాత్యా పయనిస్తున్నారా అన్న చర్చ మొదలైంది. 90వ దశకంలో ఉమ్మడి కుటుంబ విలువలు, పెళ్లి వేడుకల నేపథ్యంతో సినిమాలు తీసి సంచలనాలు సృష్టించిన ఆయనజ‌.. నేటి జెన్ జీ- ఓటీటీ ప్రేక్షకులకు తగ్గట్లుగా తన నేరేష‌న్ శైలిని మార్చుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆయన గత చిత్రం `ఊంచాయ్` మంచి ఎమోషనల్ కంటెంట్ ఉన్నా కానీ.. మల్టీప్లెక్స్ ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించలేక కమర్షియల్‌గా విఫలమైంది.

ప్రస్తుతం ఆయుష్మాన్ ఖురానా, శార్వరి జంటగా తెరకెక్కిన `యే ప్రేమ్ మోల్ లియా` ప్రచార చిత్రాల్లోనూ అదే 90ల నాటి నెమ్మదైన కథనం, పాతకాలం ఐడియాలజీ కనిపిస్తోందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. సింగిల్ స్క్రీన్ థియేటర్లు తగ్గిపోయిన ప్రస్తుత తరుణంలో పైన పేర్కొన్న టాలీవుడ్, కోలీవుడ్ దిగ్గజ దర్శకుల తరహాలోనే సూరజ్ బర్జాత్యా కూడా తన మేకింగ్ శైలిని మార్చుకోక‌పోతే బాక్సాఫీస్ వద్ద మరో చేదు అనుభవాన్ని ఎదుర్కోక తప్పదని సినీ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఆయుష్మాన్ క్రేజ్ కూడా క‌లిసి రావ‌డం క‌ష్ట‌మేన‌ని కూడా విశ్లేషిస్తున్నారు.