అనకాపల్లి.. ఆడియన్స్ కు సోనూ సూద్ స్పెషల్ రిక్వెస్ట్!
అనకాపల్లి సినిమా విజువల్స్ చూస్తుంటే బొమ్మాలీ నిన్ను వదలా అన్న రేంజ్ లో అనిపిస్తోందని చెప్పగానే ఆడియన్స్ నుంచి గట్టి అరుపులు వినిపించాయి.
By: M Prashanth | 6 Aug 2026 9:46 AM ISTరా అండ్ రస్టిక్ కాన్సెప్ట్ తో వస్తున్న అనకాపల్లి సినిమా త్వరలో థియేటర్లలోకి రాబోతోంది. పక్కా లోకల్ నేటివిటీతో యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను చాలా గ్రాండ్ గా నిర్వహించారు. ఈ వేడుకకు స్పెషల్ గెస్ట్ గా వచ్చిన సోనూ సూద్ తన స్పీచ్ తో ఈవెంట్ లో భలే జోష్ నింపారు. విక్రమ్ సహిదేవ్, సంధ్యా వశిష్ట, తారక్ పొన్నప్ప లీడ్ రోల్స్ లో నటించిన ఈ సినిమాకు ఆయన ఫుల్ సపోర్ట్ ఇచ్చారు.
అందరికీ నమస్కారం అంటూ తన స్పీచ్ మొదలుపెట్టిన సోనూ సూద్ టీమ్ అందరికీ కంగ్రాట్స్ చెప్పారు. హీరోలు విక్రమ్, తారక్ లకు ఆల్ ద బెస్ట్ చెప్పిన ఆయన హీరోయిన్ సంధ్యా వశిష్ట చాలా అందంగా ఉందని మెచ్చుకున్నారు. సినిమా విజువల్స్ అద్భుతంగా ఉన్నాయని డైరెక్టర్ ఖగేష్ తమ్మినేని వర్క్ ను అభినందించారు. నిర్మాత త్రినాథరావు నక్కిన, కాండ్రేగుల నాయుడుతో పాటు తనను ఇక్కడికి తీసుకొచ్చిన శ్రీకాంత్ కు ఆయన ప్రత్యేకంగా థాంక్స్ చెప్పారు.
అనకాపల్లి సినిమా కంటెంట్ గురించి మాట్లాడుతూ సోనూ సూద్ ఒక ఫేమస్ డైలాగ్ వాడారు. అనకాపల్లి సినిమా విజువల్స్ చూస్తుంటే బొమ్మాలీ నిన్ను వదలా అన్న రేంజ్ లో అనిపిస్తోందని చెప్పగానే ఆడియన్స్ నుంచి గట్టి అరుపులు వినిపించాయి. ట్రైలర్ లో చూసిన ఆ రా రియలిస్టిక్ టచ్ ఆడియన్స్ కు పక్కాగా కనెక్ట్ అవుతుందని ఆయన గట్టి నమ్మకం వ్యక్తం చేశారు. కంటెంట్ లో దమ్ముంటే జనాలు ఎప్పుడూ ఆదరిస్తారని సోనూ చెప్పారు.
మంచి మనుషులు అంతా కలిసి ఒక మంచి సినిమా తీసినప్పుడు దాన్ని సపోర్ట్ చేయాల్సిన బాధ్యత మన అందరి పైనా ఉంటుందని ఆయన కోరారు. ఇలాంటి నిజాయితీ ఉన్న కథలను కచ్చితంగా థియేటర్లకు వెళ్లి చూడాలని పిలుపునిచ్చారు. సినిమాను పెద్ద హిట్ చేయాల్సిన బాధ్యత ప్రేక్షకుల చేతుల్లోనే ఉందని ఆయన చెప్పారు. చిన్న సినిమాలను ఎంకరేజ్ చేస్తేనే ఇండస్ట్రీకి కొత్త టాలెంట్స్ వస్తాయనే ఉద్దేశాన్ని ఆయన తన మాటల్లో పరోక్షంగా అందరికీ తెలియజేశారు.
అక్కడున్న అనకాపల్లి జనాలకు ఆయన ఒక టార్గెట్ కూడా ఇచ్చారు. అనకాపల్లి సినిమాను ఏకంగా వంద కోట్ల సినిమాగా మార్చాల్సిన బాధ్యత మీ అందరి మీదే ఉందని ఆయన కాన్ఫిడెంట్ గా చెప్పారు. ఆయన చెప్పిన ఈ వంద కోట్ల టార్గెట్ మాటకు ఈవెంట్ లో ఉన్న ఫ్యాన్స్ అంతా గట్టిగా అరుస్తూ పాజిటివ్ గా రియాక్ట్ అయ్యారు. ఆ తర్వాత సినిమా కోసం కష్టపడిన టెక్నికల్ టీమ్ కు బెస్ట్ విషెస్ అందించారు. డీవోపీ, ఎడిటర్, మ్యూజిక్ డైరెక్టర్ తో పాటు పనిచేసిన అందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. తర్వాత హీరోయిన్ సంధ్యకు మైక్ ఇచ్చి మాట్లాడాల్సిందిగా కోరారు. సోనూ లాంటి యాక్టర్ వచ్చి సపోర్ట్ చేయడంతో అనకాపల్లి టీమ్ కు మంచి బూస్ట్ దక్కింది.
