Begin typing your search above and press return to search.

ఆప‌రేష‌న్ థియేట‌ర్‌లో బ్లేడుతో కోస్తుంటే గాయ‌కుడి గానాలాప‌న‌!

ప్రముఖ బాలీవుడ్ ప్లేబ్యాక్ సింగర్, సంగీత దిగ్గజం సోనూ నిగమ్ ఆపరేషన్ థియేటర్‌లో సర్జరీ జరుగుతుండగానే పాట పాడుతున్న ఒక ప్రత్యేకమైన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో విపరీతంగా వైరల్ అవుతోంది.

By:  Sivaji Kontham   |   10 Aug 2026 9:16 AM IST
ఆప‌రేష‌న్ థియేట‌ర్‌లో బ్లేడుతో కోస్తుంటే గాయ‌కుడి గానాలాప‌న‌!
X

ప్రముఖ బాలీవుడ్ ప్లేబ్యాక్ సింగర్, సంగీత దిగ్గజం సోనూ నిగమ్ ఆపరేషన్ థియేటర్‌లో సర్జరీ జరుగుతుండగానే పాట పాడుతున్న ఒక ప్రత్యేకమైన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో విపరీతంగా వైరల్ అవుతోంది. తన ఆరాధ్య దైవమైన దిగ్గజ గాయకుడు మహమ్మద్ రఫీ పాడిన `సుహానీ రాత్ ధల్ చుకీ` అనే పాత క్లాసిక్ పాటను బెడ్‌పై పడుకున్న స్థితిలోనే ఎంతో శృతిబద్ధంగా ఆయన పాడుతుండటం నెటిజన్లను, సంగీత ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంది. తీవ్ర నొప్పితో బాధపడుతున్నా స్వరం తప్పకుండా ఆయన పాడిన తీరుకు అందరూ జోహార్లు అర్పిస్తున్నారు.

ఈ వీడియో వెనుక ఉన్న నేపథ్యాన్ని పరిశీలిస్తే.. సర్జరీ చేస్తున్న డాక్టర్ నీలేష్ సత్భాయ్ ..ఆయన వైద్య బృందం కోసం సోనూ నిగమ్ ఈ ఆశువు గానాలాపన చేశారు. ``నొప్పిలో కూడా పాట పాడుతున్నా.. ఇదీ సంగీతం ఇచ్చే ఆనందం`` అని క్యాప్షన్ ఇస్తూ ఆయన ఈ వీడియోను షేర్ చేసారు. ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ, శ్రేయా ఘోషల్, విశాల్ మిశ్రా వంటి ప్రముఖ గాయకులు ఆయన సంగీత సాధనను .. అంకితభావాన్ని ప్రశంసిస్తూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. శస్త్రచికిత్స పూర్తయిన రెండు రోజులకే ఆయన లైవ్ కన్సర్ట్‌లో పాల్గొనడం సంగీతంపై ఆయనకున్న అపారమైన ప్రేమకు నిదర్శనమని ఫ్యాన్స్ గుర్తుచేసుకుంటున్నారు.

అయితే మెడికల్ కోణంలో పరిశీలిస్తే.. సర్జరీ సమయంలో రోగులు పాటలు పాడటం లేదా మాట్లాడటం అనే పద్ధతి వైద్యరంగంలో చాలా విరివిగా జరుగుతుంటుంది. లోకల్ లేదా రీజినల్ అనస్థీషియా ఇచ్చినప్పుడు పేషెంట్ స్పృహలోనే ఉంటారు. సర్జరీ సమయంలో భయం, భయాందోళనలు తగ్గించడానికి.. సర్జన్ల దృష్టి మరల్చకుండా మైండ్ యాక్టివ్‌గా ఉంచడానికి డాక్టర్లే తరచుగా రోగులను మాట్లాడమని లేదా పాటలు పాడమని ప్రోత్సహిస్తుంటారు. సోనూ నిగమ్ విషయంలో కూడా నరాల సమస్యతో బాధపడుతున్న సమయంలో నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి.. మనసును మళ్లించుకోవడానికే ఈ పాట పాడారని స్పష్టమవుతోంది.

గాయకులు లేదా సంగీత కళాకారులు ఆపరేషన్ థియేటర్‌లోనే గానాలాపన చేయడం భారత్‌లో ఇదే మొదటిసారి కాదు. గతంలో తీవ్రమైన మెదడు సంబంధిత వ్యాధులతో బాధపడే కళాకారులకు `అవేక్ క్రేనియోటమీ` అనే ప్రత్యేక శస్త్రచికిత్సలు నిర్వహించేటప్పుడు ఇలాంటి విచిత్ర సంఘటనలు చోటుచేసుకున్నాయి. మెదడులో మాట్లాడే - పాటలు పాడే నరాల వ్యవస్థకు ఎలాంటి హాని కలగకుండా సర్జరీ చేయడానికి వైద్యులు రోగిని మేల్కొలిపి ఉంచి.. శస్త్రచికిత్స జరుగుతుండగానే వారిచేత పాటలు పాడిస్తుంటారు.

ఉదాహరణకు గతంలో బెంగళూరుకు చెందిన 16 ఏళ్ల బాల సంగీత విద్వాంసుడు అరవింద్ మోహన్ కుమార్‌కు బ్రెయిన్ సర్జరీ జరుగుతున్న సమయంలో వైద్యులు 6 గంటల పాటు ఆయన చేత పాటలు పాడిస్తూ.. వయోలిన్ స్వరాలు పలికించి శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. అలాగే కోల్‌కతాకు చెందిన మరొక గాయని సర్జరీ టేబుల్‌పైనే సంగీతాన్ని ఆలపిస్తూ తన మెదడు భాగాలు దెబ్బతినకుండా కాపాడుకున్నారు. సోనూ నిగమ్ తాజాగా షేర్ చేసిన‌ వీడియో కూడా ఇటు మెడికల్ పరంగా.. అటు సంగీత పరంగా అంకితభావానికి... మానసిక ధైర్యానికి ప్రతీకగా నిలిచి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. సోను నిగ‌మ్ తెలుగు సినిమాల కోసం ప‌లు చార్ట్ బ‌స్ట‌ర్ సాంగ్స్ పాడిన సంగ‌తి తెలిసిందే. హిందీ, తెలుగు, త‌మిళం స‌హా బ‌హుభాషల్లో గాయ‌కుడిగా అల‌రించారు.