Begin typing your search above and press return to search.

స్టార్‌డమ్ కంటే నటనకే పెద్దపీట..అందుకు మూల్యం చెల్లించా!

అయితే కెరీర్ ప్రారంభంలోనే శ్యామ్ బెనెగల్ వంటి దర్శకులతో సమాంతర సినిమాలు చేయడం వల్ల మెయిన్‌స్ట్రీమ్ కథానాయికగా అవకాశాలు రాకుండా పోయాయని గుర్తు చేసుకున్నారు.

By:  Srikanth Kontham   |   20 Sept 2026 8:15 AM IST
స్టార్‌డమ్ కంటే నటనకే పెద్దపీట..అందుకు మూల్యం చెల్లించా!
X

పరిశ్రమలో దాదాపు నాలుగు దశాబ్దాల అనుభవం ఉన్న సీనియర్ నటి సోనీ రజ్దాన్ తన సినీ ప్రయాణం ప్రారంభంలో ఎదుర్కొన్న అనుభవాలను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేసారు. స్టార్‌డమ్ కంటే నటిగా మంచి పేరు తెచ్చుకోవడానికే తాను ప్రాధాన్యత ఇచ్చానని.. ఆ నిర్ణయం వల్ల పరిశ్రమలో కొంత మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ప్రధాన కథానాయికగా లాంచ్ కాకపోవడానికి గల కారణాలను, తన కెరీర్ ఎదుర్కొన్న సవాళ్లను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

సోనీ రజ్దాన్ 25 ఏళ్ల వయసులో అపర్ణా సేన్ దర్శకత్వం వహించిన `36 చౌరింగీ లేన్` చిత్రంలో సహాయ పాత్ర ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు. అటుపై `ఇస్మాయీల్ ష్రాఫ్ ఆహిస్తా ఆహిస్తా`, శ్యామ్ బెనెగల్ `మండి` వంటి చిత్రాలలో నటించారు. నాణ్యమైన పాత్రలను ఎంచుకోవడం వెనుక తన ఆలోచన స్పష్టంగా ఉందన్న సోనీ స్టార్‌గా మారడం కంటే ముందుగా నికార్సైన నటిగా నిరూపించుకోవడమే తన ప్రాథమిక లక్ష్యమని.. దానివల్ల భవిష్యత్తులో మంచి అవకాశాలు వస్తాయని భావించినట్లు తెలిపారు.

అయితే కెరీర్ ప్రారంభంలోనే శ్యామ్ బెనెగల్ వంటి దర్శకులతో సమాంతర సినిమాలు చేయడం వల్ల మెయిన్‌స్ట్రీమ్ కథానాయికగా అవకాశాలు రాకుండా పోయాయని గుర్తు చేసుకున్నారు. ఇండస్ట్రీలోని కొందరు ఆమెతో మాట్లాడుతూ.. ఆల్రెడీ ఇలాంటి పాత్రలు చేసినందున నిన్ను ఓ హీరోయిన్‌లా రాకెట్‌లా లాంచ్ చేయడం సాధ్యపడదని వ్యాఖ్యానించారని తెలిపారు. నాటకరంగంలో ఉంటూ మంచి కథలు, ప్రాధాన్యత ఉన్న పాత్రల కోసం ఎక్కడికైనా వెళ్లడానికి సిద్ధపడిన సోనీ స్టార్‌డమ్ సాధించడానికి ఒకే ఒక నిర్దిష్ట మార్గం ఉందనే ఆలోచనను ఎప్పుడూ ఒప్పుకోలేదని చెప్పారు.

ఈ పరిమితుల నడుమ 1984లో మహేష్ భట్ దర్శకత్వంలో వచ్చిన `సారాంశ్‌` చిత్రం ఆమె కెరీర్‌లో ముఖ్యమైన మలుపుగా నిలిచింది. అనుపమ్ ఖేర్, రోహిణి హట్టంగడిలతో కలిసి నటించిన చిత్రం సోనీ రజ్దాన్‌కు ఫిల్మ్‌ఫేర్ అవార్డు నామినేషన్ తెచ్చిపెట్టడమే కాకుండా నటిగా గొప్ప గుర్తింపును అందించింది. అంతకుముందే కొన్ని సినిమాలు చేసినప్పటికీ `సారాంశ్‌` చిత్రం తనకు ఓ కొత్త లాంచ్‌లా ఉపయోగపడిందన్నారు. ప్రతి నటుడి సినీ ప్రయాణం భిన్నంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.

పరిశ్రమలో విజయవంతమైన నటిగా లేదా స్టార్‌గా మారడానికి ఒకే రకమైన మార్గం ఉండకూడదని సోనీ రజ్దాన్ నమ్ముతున్నారు. నటన పట్ల ఉన్న ఇష్టంతో తాను ఎంచుకున్న దారి వల్ల కొన్ని అవకాశాలు కోల్పోయి ఉండొచ్చ‌ని.. కానీ ఆ నిర్ణయాల పట్ల తనకు ఎలాంటి విచారం లేదని స్పష్టం చేశారు. ప్రతికూలతలు ఎదురైనా వ్యక్తిగత విశ్వాసాలకు, నటనకే ప్రాధాన్యత ఇవ్వడం తన ప్రయాణాన్ని ప్రత్యేకంగా నిలిపిందని పేర్కొన్నారు.

సోనీ రజ్దాన్ హరీష్ వ్యాస్ దర్శకత్వంలో తెరకెక్కిన `ఓమ్ కా హరి` చిత్రంలో ముఖ్య పాత్రలో నటించారు. అన్షుమన్ ఝా, రఘుబీర్ యాదవ్, ఆయేషా కపూర్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ఇటీవల థియేటర్లలో విడుదలైంది. ప్ర‌స్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో విడుద‌ల కానున్న `షక్` సిరీస్‌లో కూడా నటిస్తున్నారు. పరిణీతి చోప్రా డిజిటల్ అరంగేట్రంగా వస్తున్న ఈ సిరీస్ సెప్టెంబర్ 25న స్ట్రీమింగ్ కానుంది.