మమ్మీ అయ్యాక కూడా రాకుమారిలా మెరిసిపోతున్న నటి!
ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన తాజా ఫోటోషూట్ ఫోటోలను సోనమ్ సోషల్ మీడియాలో పంచుకోగా.. అవి కాస్తా వైరల్ అయ్యాయి.
By: Sivaji Kontham | 8 July 2026 10:25 AM ISTబాలీవుడ్‌లో కథానాయికగా అడుగుపెట్టిన రోజుల్లోనే తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు నటి సోనమ్ కపూర్. సినిమా రంగంలోనే కాకుండా, ఫ్యాషన్ ప్రపంచంలోనూ `కపూర్ ఫ్యాషనిస్టా`గా హృదయాలను గెలుచుకున్నారు. ఆ రోజుల్లో ర్యాంప్ పై విభిన్నమైన, యూనిక్ లుక్స్‌తో ప్రేక్షకులను, ఫ్యాషన్ ప్రియులను కట్టిపడేసేవారు. కేవలం వెండితెరకే పరిమితం కాకుండా తన అద్భుతమైన ఫ్యాషన్ సెన్స్‌తో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచారు.
వివాహం తర్వాత.. ఒక బిడ్డకు తల్లి అయినా సోనమ్ కపూర్ తన గ్లామర్, ఫ్యాషన్ సెన్స్ విషయంలో ఎక్కడా తగ్గడం లేదు. ఇప్పటికీ ఫ్యాషన్ అండ్ స్టైల్ పరంగా మెరుపులు మెరిపిస్తూనే ఉన్నారు. కేవలం నటిగానే కాకుండా, తన భర్తతో కలిసి ఎంటర్‌ప్రెన్యూర్‌గా కూడా ఎదుగుతున్నారు. లండన్ నుంచి ఇండియాకు తమ బిజినెస్‌ను విస్తరించిన సోనమ్, సొంత ఫ్యాషన్ బ్రాండ్‌ను కూడా ఎంతో యాక్టివ్‌గా ప్రమోట్ చేస్తున్నారు. మమ్మీగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే.. వ్యాపార రంగంలోనూ దూసుకుపోతున్నారు.
ఇటీవల సోనమ్ కపూర్ తన సోదరి, ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ కుమార్తె అయిన అన్షులా కపూర్ పెళ్లి వేడుకలో సందడి చేశారు. ఈ వివాహ వేడుకలో సోనమ్ ధరించిన ప్రత్యేకమైన దుస్తులు, లుక్ అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. డిజైనర్ అనామికా ఖన్నా ప్రత్యేకంగా రూపొందించిన పర్పుల్ కేప్ అవుట్‌ఫిట్‌లో సోనమ్ మెరిసిపోయారు. ఈ కేప్‌పై ఎంబ్రాయిడరీ వర్క్ చేయడానికి ఏకంగా 6 నెలల సమయం పట్టిందని సోనమ్ స్వయంగా వెల్లడించారు. ఈ వేడుక కోసం రియా కపూర్, అభిలాష స్టైలింగ్ చేయగా.. నమ్రతా సోని మేకప్ అందించారు.
ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన తాజా ఫోటోషూట్ ఫోటోలను సోనమ్ సోషల్ మీడియాలో పంచుకోగా.. అవి కాస్తా వైరల్ అయ్యాయి. వీటిలో ఆమె నిజమైన రాకుమారినే తలపిస్తోందంటూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. `బాలీవుడ్ రాయల్టీ`, `నిజమైన రాణి`, `అద్భుతమైన రాయల్ లుక్` అంటూ నెటిజన్లు రకరకాలుగా కాంప్లిమెంట్లు ఇస్తున్నారు. తల్లి అయిన తర్వాత కూడా అదే ఫ్యాషన్ సెన్స్‌తో అందరినీ మురిపిస్తూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలిచారు.
ఇక సోనమ్ కపూర్ సినిమా కెరీర్ విషయానికి వస్తే... 2026-2027 సీజన్‌లో సోనమ్ కపూర్ సినిమాల్లో కంబ్యాక్ అవుతారా? అనే విషయంపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ప్రస్తుతానికి ఈ ఎంటర్ ప్రెన్యూర్ తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించడం, ఫ్యాషన్ ప్రాజెక్టులు, కుటుంబ జీవితంతో బిజీగా గడుపుతున్నారు. మునముందు రోజుల్లో తనకు సరిపోయే బలమైన కథాంశాలు, విభిన్నమైన పాత్రలు లభిస్తే ఈ ఏడాది మళ్లీ వెండితెరపై మెరిసే అవకాశం ఉంది. సినిమా ప్రాజెక్టులకు సంబంధించిన అధికారిక ప్రకటనలు రావాల్సి ఉన్నా.. ప్రస్తుతం ఫ్యాషన్ రూపంలో కపూర్ క్వీన్ మాత్రం ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు.
