బాలీవుడ్ కంటే టాలీవుడ్‌కే సోనాలి బింద్రే ఫుల్ మార్క్స్
బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగినప్పటికీ, టాలీవుడ్ గురించి మాట్లాడాల్సి వస్తే తన అభిప్రాయం ఏమాత్రం దాచుకోనని నటి సోనాలి బింద్రే స్పష్టం చేశారు.
By: Sravani Lakshmi Srungarapu | 8 July 2026 11:15 PM ISTబాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగినప్పటికీ, టాలీవుడ్ గురించి మాట్లాడాల్సి వస్తే తన అభిప్రాయం ఏమాత్రం దాచుకోనని నటి సోనాలి బింద్రే స్పష్టం చేశారు. రెండు పరిశ్రమల్లో పనిచేసిన అనుభవంతో ఆమె చేసిన తాజా కామెంట్స్ ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా టాలీవుడ్ పనితీరు, ప్లానింగ్, ప్రొడక్షన్ వాల్యూస్ పై ఆమె వ్యక్తం చేసిన అభిప్రాయాలు టాలీవుడ్ కు మరోసారి ప్రశంసలు తీసుకొచ్చాయి.
టాలీవుడ్ లో పని చేసే విధానం చాలా క్రమబద్ధంగా ఉంటుందని, సినిమా ప్రారంభానికి ముందే కథ, స్క్రీన్‌ప్లే, షూటింగ్ ప్లాన్ వంటి అంశాలు క్లియర్ గా రెడీగా ఉండటం వల్ల షూటింగ్‌లు అనుకున్న టైమ్‌కే పూర్తవుతాయని ఆమె పేర్కొన్నారు. ప్రతి విభాగం సమన్వయంతో పనిచేయడం వల్ల సెట్స్‌పై గందరగోళం తక్కువగా ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. అదే సమయంలో బాలీవుడ్ లో కొన్ని సందర్భాల్లో కథ లేదా సన్నివేశాల్లో చివరి నిమిషంలో మార్పులు చోటుచేసుకోవడం సాధారణమని, దీంతో షూటింగ్ షెడ్యూల్స్‌పై ప్రభావం పడుతుందని ఆమె వివరించారు. టాలీవుడ్‌లో మాత్రం ముందస్తు ప్రణాళికకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం నిర్మాతలు, డైరెక్టర్లు, నటీనటులందరికీ సౌకర్యంగా ఉంటుందని చెప్పారు.
ప్రొడక్షన్ వాల్యూస్ విషయంలో కూడా తెలుగు సినిమాలు గత కొన్నేళ్లుగా భారీ స్థాయిలో అభివృద్ధి సాధించాయని సోనాలి అభిప్రాయపడ్డారు. కథకు తగ్గట్టుగా ఖర్చు పెట్టడంలో నిర్మాతలు వెనుకాడరని, టెక్నికల్ వాల్యూస్ కూడా అంతర్జాతీయ స్థాయికి చేరుకున్నాయని ఆమె పేర్కొన్నారు. సెట్స్‌లో కళాకారులు, టెక్నీషియన్ల పట్ల చూపించే గౌరవం, ఆతిథ్యం కూడా టాలీవుడ్ ప్రత్యేకతల్లో ఒకటిగా ఆమె చెప్పారు.
తెలుగు ప్రేక్షకులతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న సోనాలి, తాను నటించిన సినిమాలే ఇప్పటికీ తనను తెలుగు అభిమానులకు దగ్గరగా ఉంచాయని అన్నారు. కెరీర్‌లో చేసిన క్యారెక్టర్ల ద్వారా లభించిన ఆదరణను ఎప్పటికీ మర్చిపోలేనని ఆమె పేర్కొన్నారు. గ్లామర్‌కే పరిమితం కాకుండా యాక్టింగ్ కు అవకాశం ఉన్న క్యారెక్టర్లు కూడా తెలుగు సినిమాల్లో దక్కడం తనకు ప్రత్యేక అనుభూతినిచ్చిందని తెలిపారు.
పర్సనల్ లైఫ్ లో క్యాన్సర్‌తో పోరాడి సక్సెస్‌ఫుల్‌గా కోలుకున్న తర్వాత, ఇప్పుడు ఎంపిక చేసిన పాత్రలతోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్న సోనాలి బింద్రే, మంచి కథ, బలమైన పాత్ర దొరికితే మరోసారి తెలుగు సినిమాలో నటించేందుకు సిద్ధమేనని సంకేతాలిచ్చారు. ఆమె కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, టాలీవుడ్ అభిమానులు ఆమె రీఎంట్రీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
