పాప్ లెజెండ్ కి సోనాలిబింద్రే పెట్టిన వెల్కమ్ కండీషన్!
1996లో పాప్ లెజెండ్ మైఖేల్ జాక్సన్ భారతదేశ పర్యటనకు వచ్చినప్పుడు దేశమంతా ఒక్కసారిగా ఊగిపోయింది.
By: Srikanth Kontham | 8 May 2026 7:00 AM IST1996లో పాప్ లెజెండ్ మైఖేల్ జాక్సన్ భారతదేశ పర్యటనకు వచ్చినప్పుడు దేశమంతా ఒక్కసారిగా ఊగిపోయింది. ఆ సమయంలో ముంబై విమానాశ్రయంలో జాక్సన్ కు భారతీయ సంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికే అవకాశం అప్పటి స్టార్ హీరోయిన్ సోనాలి బింద్రేకు దక్కింది. అయితే ఆ చారిత్రాత్మక కార్యక్రమానికి హాజరయ్యేందుకు సోనాలి బింద్రే ఆసక్తికర షరత్తు పెట్టారన్న విషయం ఆలస్యంగా వెలుగులకి వచ్చింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సోనాలి బింద్రే ఆనాటి మధుర స్మృతులను గుర్తు చేసుకుని ఆ కండిషన్ వెనుక కారణాన్ని రివీల్ చేసారు.
సోనాలి బింద్రేను మైఖేల్ జాక్సన్‌కు స్వాగతం పలకాల్సిందిగా కోరినప్పుడు ఆమె తన అభిమానాన్ని చాటుకోవడానికే కాకుండా? భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేలా ఉండాలని భావించారు. అందుకే తాను ఖచ్చితంగా మహారాష్ట్ర సాంప్రదాయ నౌవారీ చీర (తొమ్మిది గజాల చీర) ధరిస్తేనే వస్తానని నిర్వాహకులకు చెప్పారుట. విదేశీ వ్యక్తికి మన దేశపు మూలాలను చూపాలనే ఉద్దేశంతో సోనాలి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ రోజు ఎయిర్‌పోర్ట్‌లో సోనాలి బింద్రే నిండుగా నౌవారీ చీర కట్టుకుని, నుదుటన తిలకం దిద్ది, చేతిలో హారతి పళ్ళెంతో మైఖేల్ జాక్సన్‌కు స్వాగతం పలికారు.
అంతర్జాతీయ ఖ్యాతి గడించిన ఓ కళాకారుడికి దేశపు సంస్కృతితో ఆహ్వానం పలకడం తనకు ఎంతో గర్వంగా అనిపించిందని సోనాలి బింద్రే తెలిపారు. ఆ సమయంలో జాక్సన్ కూడా సోనాలి ఆహ్వానానికి ముగ్ధుడై ఎంతో వినయంగా నమస్కరించడం అందరినీ ఆకట్టుకుంది. నిజానికి సోనాలి బింద్రేకు మైఖేల్ జాక్సన్ అంటే విపరీతమైన ఇష్టం. ఆయన మ్యూజిక్ వీడియోలు చూస్తూ పెరిగిన తాను నేరుగా ఆయన్ని కలిసే అవకాశం రావడం ఓ కలలా అనిపించిందని చెప్పారు. అందుకే ఆ క్షణాన్ని మరింత ప్రత్యేకం చేసుకోవాలని భారతీయ సంస్కృతిని గర్వంగా చాటాలని తాను పట్టుబట్టినట్లు వివరించారు.
నిర్వాహకులు కూడా ఆమె ఆలోచనను మెచ్చుకుని అందుకు అంగీకరించారు. సోనాలి తీసుకున్న ఆ నిర్ణయం ఆనాడు ప్రపంచవ్యాప్తంగా మీడియా దృష్టిని ఆకర్షించింది. గ్లామర్ ఫీల్డ్‌లో ఉన్నా? ఒక అంతర్జాతీయ వేదికపై మన కట్టుబొట్టుకు ప్రాధాన్యత ఇవ్వడం ఆమెలోని వ్యక్తిత్వాన్ని చాటి చెప్పింది. నేటికీ మైఖేల్ జాక్సన్ ఇండియా పర్యటన గురించి మాట్లాడితే? సోనాలి బింద్రే హారతి ఇస్తోన్న ఆ ఫోటోనే అందరికీ గుర్తొస్తుంది. అంతటి బలమైన ముద్రను తన కండిషన్ ద్వారా వేయగలిగారు. స్టార్‌డమ్ కంటే మూలాలు గొప్పవని సోనాలి బింద్రే ఆనాడే నిరూపించారు. ఒక విదేశీ దిగ్గజాన్ని ఆహ్వానించే క్రమంలో మన సంప్రదాయాన్ని గౌరవించడంతో అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఆనాటి ఉద్వేగం, ఆ ఉత్సాహం తన కెరీర్‌లో ఎప్పటికీ మర్చిపోలేని మధుర జ్ఞాపకమని సోనాలి చెప్పుకొచ్చారు. మన సంస్కృతిలోని గొప్పతనాన్ని చాటిన సోనాలీ బింద్రే ఆలోచన నిజంగా అభినందనీయం.
