Begin typing your search above and press return to search.

క్యాన్స‌ర్ ని పోరాటం కాదు..ప్రేమ‌తో గెలిచిన సోనాలి బింద్రే!

క్యాన్సర్ అనే మాట‌తోనే? మానసికంగా కుంగిపోతారు. జీవితం అక్కడితో ముగిసిపోయిందనే నైరాశ్యంలోకి జారిపోతారు.

By:  Srikanth Kontham   |   14 Oct 2026 1:00 AM IST
క్యాన్స‌ర్ ని పోరాటం కాదు..ప్రేమ‌తో గెలిచిన సోనాలి బింద్రే!
X

క్యాన్సర్ అనే మాట‌తోనే? మానసికంగా కుంగిపోతారు. జీవితం అక్కడితో ముగిసిపోయిందనే నైరాశ్యంలోకి జారిపోతారు. సాధారణంగా ఈ మహమ్మారితో జరిపే పోరాటాన్ని ఒక యుద్ధంగా భావిస్తారు. అయితే సినీ నటి సోనాలి బింద్రే మాత్రం క్యాన్సర్‌ను చూసే కోణాన్నే పూర్తిగా మార్చివేశారు. శత్రువుపై దాడి చేసినట్లు కాకుండా.. తన శరీరాన్ని ఆప్యాయంగా ఆలింగనం చేసుకుంటూ ప్రేమ్‌తోనే ఈ వ్యాధిని జయించవచ్చని నిరూపించారు. సోనాలి వ్య‌క్తం చేసిన సరికొత్త దృక్పథం ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది క్యాన్సర్ బాధితుల్లో నూతన ఉత్సాహాన్ని, జీవించే ఆశలను నింపుతోంది.

2018లో సోనాలి బింద్రే నాలుగో స్టేజ్ స్టేజ్ ఫోర్ క్యాన్సర్ బారిన పడ్డారు. అత్యంత క్లిష్టమైన ఆ పరిస్థితిలోనూ ఆమె ధైర్యాన్ని వీడలేదు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన క్యాన్సర్ ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ సోనాలి ఒక గొప్ప అంతరంగాన్ని ఆవిష్కరించారు. `మనం ఏదైనా సాధించామనో లేక అధిగమించామనో అన్నప్పుడు అందులో తెలియకుండానే యుద్ధ వాతావరణం, ప్రతికూలత కనిపిస్తాయి. కానీ ఆలోచిస్తే ఆ క్యాన్సర్ కణాలు కూడా మన శరీరంలో భాగమే కదా! మన శరీరంతో మనమే ఎలా పోరాడగలం?` అని ప్రశ్నించారు.

సమాజం నేర్పిన యుద్ధం అనే పదాన్ని పక్కన పెట్టి శరీరాన్ని ప్రేమించడం ప్రారంభించడమే తనను గెలిపించిందని సోనాలి స్పష్టం చేశారు. తీవ్రమైన నొప్పినీ, శారీరక క్షీణతను కలిగిస్తున్న శరీరాన్ని ఆ క్షణంలో ప్రేమించడం ఎంతో కష్టతరమైన విషయమే. అయినా? దేహాన్ని అసహ్యించుకోకుండా.. దానికి తగిన విశ్రాంతిని, ప్రేమను అందిస్తూ చికిత్సను స్వీకరించారు. శత్రువుగా భావించి పోరాడటం కంటే.. సొంత శరీర అవయవాలను ఆర్ద్రతతో అర్థం చేసుకోవడమే అసలైన నయం చేసే మార్గమని విశ్వసించారు.

ఈ భావజాలం కేవలం ఆలోచనలకే పరిమితం కాలేదు. సోనాలి బింద్రే కోలుకునే విధానంలోనూ కీలక పాత్ర పోషించింది. న్యూయార్క్‌లో సుదీర్ఘ కాలం పాటు కీమోథెరపీ, శస్త్రచికిత్సలు జరుగుతున్న సమయంలోనూ సోనాలి సోషల్ మీడియా వేదికగా జుట్టు లేని రూపాన్ని, శస్త్రచికిత్స మచ్చలను గర్వంగా పంచుకున్నారు. `నేను నా మచ్చలను దాచుకోను. అవి నేను గెలిచిన విజయానికి గుర్తులు` అంటూ ప్రకటించిన తీరు ఎంతో మందికి కొండంత అండగా నిలిచింది. భయంతో కృంగిపోకుండా.. పరిస్థితిని సహజంగా స్వీకరించి స్వీయ ప్రేమను చాటుకోవడం సోనాలి సాధించిన గొప్ప విజయం.

క్యాన్సర్‌తో పోరాడుతున్న ప్రతీ ఒక్కరికీ సోనాలి సందేశం ఓ వెలుగు దివ్వెలాంటిది. వ్యాధి సోకినప్పుడు `నాకే ఎందుకు ఇలా జరిగింది?` అని ప్రశ్నించుకునే బదులు.. దాన్ని ఒక జీవిత పాఠంగా భావించి స్వీకరించాలని సూచించారు. శరీరానికి ప్రతికూల ఆలోచనల కంటే ప్రేమ, సానుకూల దృక్పథం అందించినప్పుడే రోగనిరోధక శక్తి కూడా రెట్టింపు అవుతుందని నిరూపించారు. మానసిక దృఢత్వానికి తోడుగా దేహం పట్ల చూపే ఆప్యాయత వ్యాధిని నయం చేయడంలో ఎంతగానో తోడ్పడుతుందని సోనాలి బింద్రే మాటలు స్పష్టం చేస్తున్నాయి.

నేడు క్యాన్సర్ ముప్పుతో మానసిక నైరాశ్యంలో ఉన్న వేలాది మంది రోగులకు సోనాలి బింద్రే జీవితం ఒక సజీవ సాక్ష్యం. క్యాన్సర్ అంటే మరణ శాసనం కాదని.. సరైన వైద్యంతో పాటు ప్రేమాభిమానాలను తోడుగా చేసుకుంటే ఎలాంటి మహమ్మారినైనా జయించవచ్చని నిరూపించారు. `పోరాటంతో కాదు.. ప్రేమతోనే గెలుపు సాధ్యం` అని ఆమె చాటిన తీరు వినోద రంగానికే కాకుండా.. ఆరోగ్య రంగంలోనూ నూతన ఆలోచనా ధోరణికి పునాది వేస్తుంది. బాధితుల్లో ఆత్మవిశ్వాసపు కాంతులను నింపుతూ జీవన ఉత్సాహాన్ని రగల్చడంలో ఈ ప్రేమ మంత్రం ఎప్పటికీ మార్గదర్శకంగా నిలుస్తుంది.