విమర్శలపై స్పందించి క్లారిటీ ఇచ్చిన సోనాలి
మెటాస్టాటిక్ క్యాన్సర్ బారిన పడిన సోనాలి ఎంతో ధైర్యంగా ఉండి ట్రీట్‌మెంట్ తీసుకుని దాన్నుంచి బయటపడ్డారు.
By: Sravani Lakshmi Srungarapu | 25 Nov 2025 11:46 AM ISTఒకప్పుడు హీరోయిన్ గా రాణించిన సోనాలి బింద్రే గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టాలీవుడ్ స్టార్ హీరోలు చిరంజీవి, నాగార్జున, మహేష్ బాబు లాంటి వారితో నటించి మెప్పించిన సోనాలి మధ్యలో ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఇండస్ట్రీకి దూరమయ్యారు. 2018లో సోనాలి క్యాన్సర్ బారిన పడటంతో ట్రీట్‌మెంట్ కోసమని సినిమాల నుంచి గ్యాప్ తీసుకున్నారు.
మెటాస్టాటిక్ క్యాన్సర్ బారిన పడిన సోనాలి ఎంతో ధైర్యంగా ఉండి ట్రీట్‌మెంట్ తీసుకుని దాన్నుంచి బయటపడ్డారు. క్యాన్సర్ తో పోరాడి గెలిచిన సోనాలి అప్పట్నుంచి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎంతో మందిలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతున్నారు. అందులో భాగంగానే సోనాలి రీసెంట్ గా చేసిన కామెంట్స్ ఇప్పుడు తనను విమర్శలకు గురయ్యేలా చేసింది.
వివాదానికి దారి తీసిన సోనాలి కామెంట్స్
తాను క్యాన్సర్ నుంచి బయటపడేందుకు ప్రకృతి వైద్యం ఎంతో ఉపయోగపడిందని చెప్పి ట్రోలింగ్ కు గురయ్యారు సోనాలి. ఈ కామెంట్స్ ను కొందరు డాక్టర్లు తప్పుబట్టడంతో అవి వివాదానికి దారితీశాయి. ఈ విమర్శలపై స్పందిస్తూ తాజాగా సోనాలి ఎక్స్ లో క్లారిటీ ఇచ్చారు. ఆ పోస్ట్ లో సోనాలి, తానెప్పుడూ డాక్టర్ని అని చెప్పలేదని, తానేమీ మోసగత్తెని కాదని, కానీ క్యాన్సర్ తో నరకం అనుభవించానని ఆమె చెప్పారు.
తప్పుగా అర్థం చేసుకోవద్దు
క్యాన్సర్ వల్ల వచ్చే భయం, నొప్పి, బాధ అన్నీ తెలుసు కాబట్టే అందరికీ చెప్పానని, క్యాన్సర్ లో ఎన్నో రకాలుంటాయని, అన్ని క్యాన్సర్లకు ఒకే లాంటి లక్షణాలుండవని, అలానే అన్ని క్యాన్సర్లకు ఒకే ట్రీట్‌మెంట్ ఉందని ఆమె పేర్కొన్నారు. తాను కేవలం తన ఎక్స్‌పీరియెన్స్ ను మాత్రమే షేర్ చేసుకున్నానని, తాను చెప్పినవి అందరూ పాటించమని ఎప్పుడూ చెప్పలేదని, ప్రతీ వ్యక్తి తమకు సురక్షితమైన విధానాలనే పంచుకోవాలని కోరుకుంటున్నానని, తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకోవద్దని, తాను కేవలం తన బాధను మాత్రమే చెప్పానని, అందరినీ ప్రకృతి వైద్యం తీసుకోమని తాను చెప్పలేదని క్లారిటీ ఇవ్వడంతో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడింది.
