స్టార్ కపుల్స్ కలల ఇల్లు !
బాలీవుడ్ జంట సోనాక్షి సిన్హా- జహీర్ ఇక్బాల్‌ల వివాహం తర్వాత వారి నివసిస్తున్న కొత్త ఇల్లు నిరంతరం అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
By: Srikanth Kontham | 29 May 2026 9:00 PM ISTబాలీవుడ్ జంట సోనాక్షి సిన్హా- జహీర్ ఇక్బాల్‌ల వివాహం తర్వాత వారి నివసిస్తున్న కొత్త ఇల్లు నిరంతరం అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ముంబైలోనే అత్యంత ఖరీదైన సెలబ్రిటీలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన బాంద్రా ప్రాంతంలో ఏర్పాటు చేసుకున్న సరికొత్త పెంట్‌హౌస్ విశేషాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఆధునిక శైలి .. ఆహ్లాదకరమైన వాతావరణం కలబోసిన ఇల్లు వారి విలక్షణమైన అభిరుచులకు అద్దం పడుతోంది. ఈ అద్భుతమైన పెంట్‌హౌస్ రూపకల్పన వెనుక వినూత్నమైన ఆలోచన దాగి ఉంది.
దీనిని `న్యూయార్క్ మీట్స్ మాల్దీవ్స్` అనే ప్రత్యేకమైన థీమ్‌తో డిజైన్ చేశారు. అంటే ఒకవైపు అమెరికాలోని న్యూయార్క్ నగరానికి చెందిన ఆధునిక, పారిశ్రామిక , కాస్మోపాలిటన్ వైబ్‌ను అందిస్తూనే.. మరోవైపు మాల్దీవుల వంటి ఉష్ణమండల ద్వీపాల్లో కనిపించే ప్రశాంతత, ప్రకృతి సౌందర్యాన్ని ఈ ఇల్లు ఒకేచోట ప్రతిబింబిస్తోంది.
ఈ పెంట్‌హౌస్ ఇంటీరియర్స్ ఎంతో కళాత్మకంగా, లగ్జరీ లుక్‌తో తీర్చిదిద్దారు. విశాలమైన కిటికీలు, సహజసిద్ధమైన సూర్యకాంతి ఇంట్లోకి ధారాళంగా వచ్చేలా చేసిన ఏర్పాట్లు మాల్దీవుల రిసార్ట్ అనుభూతిని కలిగిస్తాయి.
అదే సమయంలో ఉపయోగించిన అత్యాధునిక ఫర్నిచర్.. ఇటుకల శైలి గోడలు .. రంగుల ఎంపిక న్యూయార్క్ నగరంలోని క్లాసిక్ అపార్ట్‌మెంట్‌లను తలపిస్తాయి. ఈ రెండు విభిన్న సంస్కృతుల సమ్మేళనం ఇంటికి ఓ విలక్షణమైన రూపాన్ని ఇచ్చింది. భౌగోళికంగా చూస్తే.. బాంద్రాలోని ఈ పెంట్‌హౌస్ నుండి కనిపించే ముంబై నగర స్కైలైన్ ..సముద్రపు వీక్షణలు వీక్షకులను మంత్రముగ్ధులను చేస్తాయి. ఎప్పుడూ బిజీగా సందడిగా ఉండే ముంబై నగర జీవనంలో ఉంటూనే.. షూటింగ్‌లు ముగించుకుని ఇంటికి రాగానే ప్రశాంతమైన హాలిడే స్పాట్‌లో అడుగుపెట్టినట్లు ఉండేలా ఇంటి వాతావరణాన్ని మలచుకోవడం విశేషం.
ఈ హౌస్ డిజైన్ వారి వ్యక్తిగత స్పేస్‌కు ఎంతో ప్రాధాన్యతనిచ్చింది. నటి సోనాక్షి సిన్హాకు స్వతహాగా పెయింటింగ్స్.. ఆర్ట్ .. హోమ్ డెకర్ పట్ల అమితమైన ఆసక్తి ఉంది. అందుకే ఈ పెంట్‌హౌస్ లోని ప్రతి మూలలోనూ ఆమె వ్యక్తిగత పర్యవేక్షణ, సృజనాత్మకత స్పష్టంగా కనిపిస్తాయి. ఇండోర్ ప్లాంట్లు .. వినూత్నమైన లైటింగ్ .. గోడలపై అమర్చిన కళాఖండాలు జంట యొక్క ఆధునిక .. ప్రకృతి ప్రేమికుల స్వభావాన్ని చాటిచెబుతున్నాయి. సెలబ్రిటీల ఇళ్లు అనగానే ఆడంబరం, ఖరీదైన వస్తువుల ప్రదర్శన మాత్రమే అనుకుంటారు. కానీ సోనాక్షి-జహీర్‌ల ఇల్లు లగ్జరీకి మాత్రమే పరిమితం కాకుండా.. ఒక ఇల్లు మానసిక ప్రశాంతతను ఇచ్చేలా ఎలా ఉండాలో? నిరూపిస్తోంది. రెండు భిన్నమైన ప్రపంచాల కలయికగా నిలిచిన పెంట్‌హౌస్ నేటి తరం ఆధునిక ఇళ్ల రూపకల్పనకు అద్భుతమైన స్ఫూర్తిగా నిలుస్తుందనడంలో సందేహం లేదు.
