Begin typing your search above and press return to search.

స్టార్ కుమార్తెను అయినా నాకేమీ రెడ్ కార్పెట్ వేయ‌లేదు!

ఇండస్ట్రీలో సాధారణంగా కనిపించే నెపోటిజానికి భిన్నంగా త‌మ‌ ఇంట్లో రివర్స్ నెపోటిజం వాతావరణం ఉండేదన్నారు.

By:  Srikanth Kontham   |   19 May 2026 4:00 AM IST
స్టార్ కుమార్తెను అయినా నాకేమీ రెడ్ కార్పెట్ వేయ‌లేదు!
X

చిత్ర పరిశ్రమలో వారసత్వం అంశంపై కొన్ని సంవత్సరాలుగా పెద్ద ఎత్తున చర్చలు నడుస్తూనే ఉన్నాయి. స్టార్ కిడ్స్ కి ఇండస్ట్రీలోకి రావడం చాలా సులువని, వారికి ఎలాంటి కష్టం లేకుండానే అవకాశాలు దక్కుతాయనే విమర్శలు తరచూ వినిపిస్తునే ఉన్నాయి. అయితే ఈ భావన అందరి విషయంలోనూ నిజం కాదని బాలీవుడ్ స్టార్ నటి సోనాక్షి సిన్హా అంటున్నారు. తన కెరీర్ ఆరంభంలో తండ్రి, లెజెండరీ నటుడు శత్రుఘ్న సిన్హా పట్ల వ్యవహరించిన తీరును గుర్తుచేసుకుంటూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఇండస్ట్రీలో సాధారణంగా కనిపించే నెపోటిజానికి భిన్నంగా త‌మ‌ ఇంట్లో రివర్స్ నెపోటిజం వాతావరణం ఉండేదన్నారు.

శత్రుఘ్న సిన్హా కుమార్తె అయినంత మాత్రాన తనకు ఇండస్ట్రీలో ఎవరూ రెడ్ కార్పెట్ పరచలేదని, పైగా తండ్రి ఇమేజ్ వల్ల తనపై బాధ్యత మరింత పెరిగిందన్నారు.`నా కెరీర్‌ను ప్రారంభించినప్పుడు నా తండ్రి నాకు ఎటువంటి సిఫార్సులు చేయలేదు. చిత్ర పరిశ్రమలో నీకంటూ ఒక గుర్తింపు రావాలంటే నీ నైపుణ్యాన్ని నువ్వే స్వయంగా నిరూపించుకోవాలని స్పష్టంగా చెప్పారని సోనాక్షి గుర్తు చేసుకున్నారు. స్టార్ కిడ్స్ కి మొదటి సినిమా అవకాశం సులభంగానే దక్కినా? ఆ తర్వాత పరిశ్రమలో నిలదొక్కుకోవడానికి సాధారణ నటీనటుల కంటే ఎక్కువే కష్టపడాల్సి ఉంటుందని సోనాక్షి అభిప్రాయపడ్డారు.

ఎందుకంటే ప్రేక్షకులు , విమర్శకులు నిరంతరం వారిని వారి తల్లిదండ్రుల ప్రతిభతో పోల్చి చూస్తుంటారు. ఆ భారీ అంచనాల ఒత్తిడిని తట్టుకుని, సొంత శైలిని అలవర్చుకోవడం పెద్ద సవాల్ అని పేర్కొన్నారు. తండ్రి చూపించిన కఠినమైన క్రమశిక్షణే తనను ఇండస్ట్రీలో స్వతంత్ర నటిగా ఎదగడానికి దోహదపడిందని సోనాక్షి కృతజ్ఞత భావాన్ని చాటుకున్నారు. సల్మాన్ ఖాన్ సరసన బ్లాక్‌బస్టర్ చిత్రం `దబాంగ్` తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన సోనాక్షి సిన్హా? అటుపై కమర్షియల్ చిత్రాలతో పాటు `లూటేరా` వంటి పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు.

ఇటీవల కాలంలో ఓటీటీ ప్లాట్‌ఫారమ్స్ లో సైతం విలక్షణమైన పాత్రలు చేస్తూ నటిగా తన పరిణతిని చాటుకుంటున్నారు. తండ్రి పేరును వాడుకుని అవకాశాలు తెచ్చుకోవడం కంటే తన టాలెంట్‌ను నమ్ముకుని ఈ స్థాయికి రావడం ఎంతో గర్వంగా ఉందని ఈ సందర్భంగా వెల్లడించారు. స్టార్ వారసులపై సామాజిక మాధ్యమాలలో వచ్చే విమర్శల గురించి కూడా సోనాక్షి ఎంతో పరిణతితో మాట్లాడారు. బ్యాక్‌గ్రౌండ్ ఉందనే కారణంతో ఎవరినీ తక్కువ చేసి చూడకూడదని, అంతిమంగా వెండితెరపై ప్రతిభ ఉన్నవారే ప్రేక్షకుల మనసులు గెలుచుకుంటారని స్పష్టం చేశారు.

శత్రుఘ్న సిన్హా కుమార్తెగా కాకుండా సోనాక్షి సిన్హాగా ప్రేక్షకులు తనను ఆదరించడం వెనుక దశాబ్ద కాలానికి పైగా తానూ పడిన కష్టం, చూపిన నిబద్ధత ఉన్నాయన్నారు. నెపోటిజంపై భిన్నమైన వాదనలు వినిపిస్తున్న తరుణంలో సోనాక్షి సిన్హా పంచుకున్న రివర్స్ నెపోటిజం అనుభవాలు సినీ పరిశ్రమలోని మరో కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. తండ్రి అగ్ర నటుడైనప్పటికీ, కుమార్తెను తన స్వశక్తితో పైకి రావాలని ప్రోత్సహించడం శత్రుఘ్న సిన్హాలోని గొప్ప వ్యక్తిత్వాన్ని సూచిస్తోంది. మరి ఈ సరికొత్త ఆత్మవిశ్వాసంతో సోనాక్షి భవిష్యత్తులో ఎలాంటి వైవిధ్యమైన ప్రాజెక్టులతో , పవర్‌ఫుల్ పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తారో చూడాలి.