సోషల్ మీడియాపై స్టార్ హీరోయిన్ తీవ్ర వ్యాఖ్యలు
బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు 'జటాధర' సినిమాతో రాబోతుంది.
By: Ramesh Palla | 12 Aug 2025 12:10 PM ISTబాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు 'జటాధర' సినిమాతో రాబోతుంది. కెరీర్ ఆరంభం నుంచి ఈమె తెలుగులో నటించాలని అనుకుంటున్నప్పటికీ కుదరలేదు, ఎట్టకేలకు ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఇదే ఏడాది చివరి వరకు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు గాను ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇటీవల విడుదలైన టీజర్‌కి మంచి స్పందన వచ్చింది. సుధీర్ బాబు ఈ సినిమాతో కమర్షియల్‌గా బిగ్ హిట్‌ను కొట్టే అవకాశాలు ఉన్నాయి అనేది యూనిట్ సభ్యుల నమ్మకం. అంతే కాకుండా ఈ సినిమాకు సోనాక్షి సిన్హా అదనపు ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు.
నికితా రాయ్ తో సోనాక్షి సిన్హా
ఈ ఏడాదిలో ఇప్పటికే సోనాక్షి నటించిన 'నికితా రాయ్' విడుదలైంది. ఆ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ దక్కింది. సోనాక్షి సిన్హా కెరీర్ ఆరంభం నుంచి కూడా ట్రోల్స్ ఎదుర్కొంటూ ఉంది. కొన్ని సార్లు ఆమెను ఫిజికల్‌గా కొందరు విమర్శించిన సందర్భాలు ఉన్నాయి. కొన్ని సార్లు ఆమె నటన గురించి విమర్శలు చేసిన వారు ఉన్నారు. ఇన్ని రకాలుగా విమర్శలు చేసినా కూడా ఆమె మాత్రం పెద్దగా పట్టించుకోదు. సోషల్ మీడియాను ఆమె తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంటుంది. తన వ్యక్తిగత విషయాలను, తన భర్తతో ఉన్న ఫోటోలను షేర్ చేయడం కోసం ఇన్‌స్టాగ్రామ్‌ను వినియోగించే సోనాక్షి సిన్హా అంతకు మించి ఎక్కువగా ఇన్‌స్టాను వినియోగించను అని చెప్పుకొచ్చింది. తాజాగా సోషల్ మీడియా గురించి ఆమె షాకింగ్ వ్యాఖ్యలు చేసింది.
సుధీర్ బాబు జటాధర సినిమాతో సోనాక్షి
సోషల్ మీడియాలో కొందరు చేసే కామెంట్స్ అత్యంత జుగుప్సాకరంగా ఉంటాయని అంది. అందులో కొందరు చేసే విషపూరిత ప్రచారం పట్ల ఎన్నో సార్లు ఆవేదన వ్యక్తం చేసినట్లు చెప్పుకొచ్చింది. ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ వంటి సోషల్ మీడియాతో పోల్చితే తాను యూట్యూబ్ కి ఎక్కువగా పరిమితం అవుతాను అంది. ఇతర సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్‌తో పోల్చితే యూట్యూబ్ లో నెగిటివిటీ అంతగా ఉండదని, అక్కడ సమయాన్ని వ్యచ్చించడం ద్వారా తెలియని విషయాలు తెలుస్తాయని కూడా చెప్పుకొచ్చింది. అంతే కాకుండా యూట్యూబ్ లో విషపూరిత కామెంట్స్ తక్కువగా ఉంటాయని, నెగిటివిటీ నుంచి దూరంగా ఉండాలి అంటే ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ కి దూరంగా ఉండాలి అంటూ సోనాక్షి సిన్హా సూచించింది.
సల్మాన్ మూవీ దబాంగ్‌తో ఎంట్రీ
సోనాక్షి సిన్హా ఇండస్ట్రీలో 2010లో దబాంగ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. కన్నడ స్టార్ శత్రఘ్న సిన్హా కూతురు అయిన కారణంగా సోనాక్షికి బాలీవుడ్‌లో ఎంట్రీ ఈజీగా దక్కింది. తక్కువ సమయంలోనే ఈ అమ్మడు ఎక్కువ సినిమాలు చేసింది. మొదటి సినిమానే బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తో చేయడం వల్ల ఈ అమ్మడికి వరుసగా ఆఫర్లు వచ్చాయి. పైగా దబాంగ్ సినిమా సూపర్ హిట్ గా నిలవడం ద్వారా టాప్ హీరోయిన్స్ జాబితాలో చేరింది. ఆ తర్వాత బాలీవుడ్‌లో దాదాపు అందరు స్టార్ హీరోలకు జోడీగా నటించే అవకాశాలు దక్కించుకుంది. యంగ్ హీరోలతో ఈమె చేసిన చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి. దాదాపు దశాబ్ద కాలం పాటు స్టార్ హీరోయిన్‌గా వరుస సినిమాలు చేసింది. ఈమధ్య పెళ్లి కావడంతో కాస్త స్లో అయినట్లు అనిపిస్తుంది. రాబోయే రోజుల్లో సోనాక్షి మరింత బిజీ కావాలని ప్రయత్నాలు చేస్తుంది.
