సృజనాత్మక వ్యక్తులకు ఇది క్లిష్ట సమయం!
బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా ఇటీవలే తన కెరీర్ - పరిశ్రమలోని ప్రస్తుత పరిస్థితులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
By: Srikanth Kontham | 15 May 2026 7:00 AM ISTబాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా ఇటీవలే తన కెరీర్ - పరిశ్రమలోని ప్రస్తుత పరిస్థితులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కళాకారులు , క్రియేటివ్ గా ఉండే వాళ్లు ఇప్పుడు క్లిష్టమైన కాలంలో జీవిస్తున్నామని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం సినిమాల ఎంపికలో గానీ, కథల విశ్లేషణలో గానీ గతంలో లేని విధంగా ఎన్నో పరిమితులు ,ఒత్తిళ్లు ఎదురవు తున్నాయని ఇది కళాకారుల స్వేచ్ఛపై ప్రభావం చూపుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియా ప్రభావం పెరిగిన తర్వాత ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూసే ధోరణి పెరిగిందన్నారు.
ఒకప్పుడు వినోదం కోసం సినిమాలు చూసేవారని కానీ ఇప్పుడు ప్రతి సన్నివేశాన్ని విశ్లేషిస్తూ విమర్శలు చేయడం వల్ల దర్శకులు, రచయితలు తమ ఆలోచనలను స్వేచ్ఛగా ఆవిష్కరించలేకపోతున్నారని పేర్కొన్నారు. ఈ రకమైన సెన్సార్‌షిప్ మనస్తత్వం సృజనాత్మకతకు అడ్డంకిగా మారుతోందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం పరిశ్రమలో నెలకొన్న అనిశ్చితి వల్ల నటీనటులు కొత్త ప్రయోగాలు చేయడానికి వెనుకాడాల్సి వస్తోందన్నారు. బాక్సాఫీస్ లెక్కలు , సోషల్ మీడియా ట్రోలింగ్ భయంతో మేకర్స్ కూడా సురక్షితమైన మార్గాలనే ఎంచుకుంటున్నారన్నారు.
ఒకటి సృష్టించినప్పుడు అందులో స్వేచ్ఛ ఉండాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాల్సి వస్తోందన్నారు. అలాగే ఓటిటి ప్లాట్‌ఫారమ్‌ల రాకతో నటీనటులకు కొత్త అవకాశాలు దక్కుతున్నాయన్నారు. కానీ అక్కడా పోటీ విపరీతంగా ఉందని గుర్తుచేశారు. సోనాక్షి సిన్హా వ్యాఖ్యలు నేటి గ్లామర్ ప్రపంచంలోని మరో కోణాన్ని ప్రతిబింబిస్తున్నాయి. సృజనాత్మకతకు స్వేచ్ఛ లేని చోట గొప్ప కళాఖండాలు పుట్టడం కష్టమని ఆమె మాటల సారాంశంగా కనిపిస్తుంది. ఏదేమైనా? మారుతోన్న కాలానికి అనుగుణంగా తమను తాము మలచుకుంటూ క్లిష్ట పరిస్థితులను అధిగమించి మరిన్ని మంచి పాత్రలతో ప్రేక్షకుల ముందుకు రావాలని ఆకాంక్షిస్తున్నారు.
సోనాక్షి సిన్హా `దబాంగ్` వంటి మాస్ సినిమాల నుంచి `లూటెరా`, `దహాద్` వంటి కంటెంట్ ఆధారిత ప్రాజెక్టుల వరకు ఎంతో వైవిధ్యాన్ని ప్రదర్శించిన మాట వాస్తవం. బాలీవుడ్ లో గొప్ప బ్యాక్ గ్రౌండ్ ఉన్నా? అమ్మడు మాత్రం తన ట్యాలెంట్ ను నమ్ముకునే పైకి వచ్చింది. మధ్యలో వివాహం చేసుకుని కొన్ని విమర్శలు కూడా ఎదుర్కుంది.కుటుంబానికి దూరమైనంత పని అవుతుందా? అన్నంత సన్నివేశం కనిపించింది. కానీ ఈ విషయంలో అమ్మడిని తల్లిదండ్రులు అర్దంచేసుకోవడంతో ఆ పరిస్థితులకు దారితీయలేదు. ప్రస్తుతం భర్త, పిల్లలతో సంతోషంగా వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాదిస్తోంది. నటిగా కొన్ని సినిమాలతో బిజీగా ఉంది. `లింగ` తర్వాత సౌత్ లో మళ్లీ సినిమాలు చేయాలని ఆశపడుతోంది. కానీ అమ్మడికి సరైన అవకాశాలు రావడం లేదు.
