షాట్ కు రెడీ అవడానికి మూడు గంటలు పట్టేది
సోనాక్షి సిన్హా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తూ చేసిన మొదటి సినిమా జటాధర. సుధీర్ బాబు హీరోగా నటించిన జటాధర నవంబర్ 7వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
By: Sravani Lakshmi Srungarapu | 1 Nov 2025 8:00 PM ISTఒక్కోసారి కొన్ని పాత్రలు ఎంత నచ్చినా అవి చేయడానికి మాత్రం ఎంతో కష్టపడాల్సి వస్తుంది. అయితే ఏ సినిమాలో అయినా హీరోల కష్టంతో పోలిస్తే హీరోయిన్లకు కష్టపడేది తక్కువే ఉంటుంది. చాలా తక్కువ సమయాల్లో మాత్రమే హీరోయిన్ కూడా కష్టపడాల్సి వస్తోంది. ఇప్పుడు బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హాకు కూడా అలాంటి కష్టమే ఎదురైనట్టు చెప్పుకొచ్చారు.
నవంబర్ 7న రిలీజ్ కానున్న జటాధర
సోనాక్షి సిన్హా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తూ చేసిన మొదటి సినిమా జటాధర. సుధీర్ బాబు హీరోగా నటించిన జటాధర నవంబర్ 7వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. జటాధరలో సోనాక్షి ఫీమేల్ లీడ్ గా నటిస్తుండగా, ఈ సినిమాలోని పాత్ర కోసం తానెంత కష్టపడాల్సి వచ్చిందోననే విషయాన్ని చిత్ర ప్రమోషన్స్ సందర్భంగా ఆమె వెల్లడించారు.
కెరీర్లోనే ఛాలెంజింగ్ రోల్
ఎన్నో సినిమాల్లో నటించిన సోనాక్షికి తన కెరీర్లోనే జటాధరలో చేసిన క్యారెక్టర్ ఫిజికల్ గా ఛాలెంజింగ్ గా అనిపించిందని పేర్కొన్నారు. ప్రతీ రోజూ షూటింగ్ కు వెళ్లడానికి రెడీ అవడం కోసం తనకు మూడు గంటలు పట్టేదని, షూటింగ్ కోసం 50 కిలోల నగల్ని ధరించాల్సి వచ్చేదని సోనాక్షి తెలిపారు. ఆ 50 కిలోల నగలు కదలకుండా ఉండేందుకు వాటిని తన శరీరానికి కుట్టించుకున్నట్టు ఆమె చెప్పారు.
ఏ రోజూ ఆ ఫీలింగ్ కలగలేదు
యాక్షన్ సీన్స్ లో కూడా తాను ఆ భారీ బరువున్న నగలతోనే ఉండాల్సి వచ్చేదని, అది తనకు మోస్ట్ ఛాలెంజింగ్ టాస్క్ అయినప్పటికీ సెట్స్ లో ఉన్న వాళ్లంతా తనను బాగా చూసుకోవడం వల్ల ఆ క్యారెక్టర్ ను ఈజీగా చేయగలిగానని సోనాక్షి చెప్పారు. ఏ రోజూ తెలుగులో తనకిదే మొదటి సినిమా అనే భావన తనకు కలగలేదని, యూనిట్ సభ్యులంతా తనను ఎంతో కంఫర్టబుల్ గా ఉండనిచ్చారని సోనాక్షి పేర్కొన్నారు.
