Begin typing your search above and press return to search.

ఈ క‌మెడియ‌న్ వ‌ల్ల 16 ఆఫ‌ర్లు కోల్పోయాను.. న‌టి ఆవేద‌న‌

త‌మిళ న‌టి సోనా హైడెన్ ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. తెలుగులో ఆంధ్రావాలా (ఎన్టీఆర్) చిత్రంలో న‌టించిన సోనా, త‌మిళంలో త‌ళా అజిత్ సినిమాతో తెరంగేట్రం చేసారు.

By:  Sivaji Kontham   |   11 March 2026 9:48 AM IST
ఈ క‌మెడియ‌న్ వ‌ల్ల 16 ఆఫ‌ర్లు కోల్పోయాను.. న‌టి ఆవేద‌న‌
X

త‌మిళ న‌టి సోనా హైడెన్ ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. తెలుగులో ఆంధ్రావాలా (ఎన్టీఆర్) చిత్రంలో న‌టించిన సోనా, త‌మిళంలో త‌ళా అజిత్ సినిమాతో తెరంగేట్రం చేసారు. ఈ భామ ఇప్పుడు అనూహ్య కార‌ణాల‌తో మీడియా హెడ్ లైన్స్ లో కొచ్చారు. వివ‌రాల్లోకి వెళితే..

నటి సోనా హైడెన్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చిత్ర పరిశ్రమలో పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. ముఖ్యంగా తమిళ స్టార్ కమెడియన్ వడివేలు ప్రవర్తన కారణంగా తాను కెరీర్‌లో భారీగా నష్టపోయానని సోనా ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో రజనీకాంత్ హీరోగా వచ్చిన `కుసేలన్` (తెలుగులో -కథానాయకుడు) చిత్రంలో వడివేలుతో కలిసి నటించిన సోనా.. ఆ తర్వాత మళ్ళీ ఆయనతో కలిసి పని చేసేందుకు ససేమిరా అనడం గమనార్హం.

ఈ నేపథ్యంలో సోనా మాట్లాడుతూ వడివేలుతో తన కాంబినేషన్ బాగుందని భావించిన మేకర్స్..తామిద్దరినీ జంటగా పెట్టి సినిమాలు చేసేందుకు ఏకంగా 16 ఆఫర్లు ఇచ్చారని వెల్లడించారు. అయితే వడివేలు వ్యక్తిత్వం.. సెట్స్‌లో ఆయన ప్రవర్తన తనకు ఎంతమాత్రం నచ్చలేదని ఆమె స్పష్టం చేశారు. ఎన్ని కోట్లు ఇస్తామన్నా.. చివరకు అడుక్కుతినే పరిస్థితి వచ్చినా సరే.. ఆత్మగౌరవాన్ని పణంగా పెట్టి ఆయనతో కలిసి నటించేది లేదని సోనా తెగేసి చెప్పారు.

చిత్ర పరిశ్రమలో ఎదురైన ఇలాంటి చేదు అనుభవాల వల్లే తాను సినిమాలకు సుదీర్ఘ కాలం దూరంగా ఉండాల్సి వచ్చిందని ఈ సీనియ‌ర్ న‌టి పేర్కొన్నారు. వడివేలు వల్ల తాను పడ్డ ఇబ్బందులన్నీ బయటకు చెప్పలేనని.. కానీ ఆ పరిణామాలు తనను తీవ్రంగా కలిచివేశాయని ఆమె వాపోయారు. తోటి కళాకారుల పట్ల కనీస గౌరవం లేని వ్యక్తులతో కలిసి పని చేయడం కంటే ఇంట్లో ఖాళీగా కూర్చోవడమే మేలని న‌టి సోనా అభిప్రాయపడ్డారు.

సినిమా రంగంలో తనకు ఎవరూ అండగా నిలవలేదని.. అవసరం ఉన్నప్పుడు వాడుకుని ఆ తర్వాత అందరూ వదిలేశారని సోనా ఆవేదన చెందారు. కేవలం గ్లామర్ పాత్రలకే తనను పరిమితం చేశారని నటిగా తనలోని ప్రతిభను గుర్తించలేదని అన్నారు. ఈ క్రమంలోనే తన జీవితంలో జరిగిన వాస్తవ సంఘటనలను ప్రపంచానికి తెలియజేయాలని నిర్ణయించుకున్న‌ట్టు తెలిపారు.

ప్రస్తుతం సోనా తన బయోపిక్‌ను `స్మోక్` అనే వెబ్ సిరీస్ రూపంలో తెరకెక్కిస్తున్నారు. 2010 నుంచి 2015 మధ్య తన జీవితంలో జరిగిన సంచలన విషయాలను తాను ఎదుర్కొన్న మోసాలను ఈ సిరీస్‌లో చూపించబోతున్నారు. దీనికి సోనా స్వయంగా దర్శకత్వం వహిస్తూ.. తానే స్వయంగా నిర్మిస్తుండటం విశేషం. సిల్క్ స్మిత జీవితాన్ని ఇతరులు సినిమాగా తీసినట్లు రేపు తన కథను కూడా ఎవరో ఒకరు వక్రీకరిస్తారన్న భయంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సోనా తెలిపారు.

స్టార్ కమెడియన్‌గా వెలుగుతున్న వడివేలుపై గతంలోనూ కొందరు ఇలాంటి ఆరోపణలు చేసినా కానీ.. సోనా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరింత చర్చనీయాంశమయ్యాయి. ఆత్మగౌరవం కోసం 16 సినిమా ఆఫర్లను వదులుకున్న సోనా ధైర్యాన్ని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. ఒక నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం పోరాడుతున్న ఈ న‌టీమ‌ణి త్వరలో విడుద‌ల కానున్న `స్మోక్` సిరీస్‌తోనైనా తన గొంతును బలంగా వినిపిస్తారని భావిద్దాం.