Begin typing your search above and press return to search.

గ‌ల్ఫ్ దేశాల నియ‌మంతో ఇర‌కాటంలో బ‌డా హీరో

ఇప్పుడు ఇదంతా చెప్ప‌డానికి ప్ర‌ధాన కార‌ణం.. అజ‌య్ దేవ‌గ‌న్ న‌టించిన `స‌న్ ఆఫ్ స‌ర్ధార్ 2` గ‌ల్ఫ్ దేశాల‌లో రిలీజ్ స‌మ‌స్య‌ను ఎదుర్కొంది.

By:  Sivaji Kontham   |   3 Aug 2025 5:53 PM IST
గ‌ల్ఫ్ దేశాల నియ‌మంతో ఇర‌కాటంలో బ‌డా హీరో
X

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో స్వలింగ సంపర్కం చట్టవిరుద్ధం. అక్క‌డి చ‌ట్టాల ప్ర‌కారం.. స్వ‌లింగ‌సంప‌ర్కులు లేదా హిజ్రాలు ఎలాంటి లైంగిక చ‌ర్య‌ల‌కు పాల్ప‌డినా చ‌ట్ట‌బ‌ద్ధంగా శిక్షార్హులు. జైలుకు వెళ్లాల్సిందే. క‌ఠిన‌మైన శిక్ష‌లు అమ‌ల్లో ఉంటాయి. ఇక్క‌డ వివాహేతర లైంగిక కార్యకలాపాలు కూడా చట్టవిరుద్ధం. భ‌ర్త లేదా భార్య ఇలాంటి కార్య‌క‌లాపాల‌కు పాల్పడితే క్రిమిన‌ల్ చ‌ర్య‌లు తీసుకుంటారు. కనీసం ఆరు నెలల జైలు శిక్ష విధిస్తారు. ఆ దేశ రాజ్యాంగం ప్రకారం ఏదైనా శిక్ష విధించడానికి కోర్టుకు పూర్తి విచక్షణ ఉంది. అయితే UAEలోని స్వలింగ సంపర్క చట్టాలు అస్పష్టంగా ఉన్నాయని చాలా కాలంగా వాద‌న‌లు ఉన్నాయి. గ‌ల్ఫ్ చ‌ట్టాల‌కు భిన్నంగా ఇటీవ‌ల హిజ్రాల‌కు మాన‌వ‌త్వం కోణంలో భార‌త‌ప్ర‌భుత్వం హ‌క్కుల్ని ద‌ఖ‌లుప‌రిచిన సంగ‌తి తెలిసిందే. ఇప్పటికీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో లెస్బియన్, గే, బైసె*క్సువల్, ట్రాన్స్‌జెండర్ .. క్వీర్ (LGBTQ) వ్యక్తులపై వివక్ష - చట్టపరమైన సవాళ్ల గురించి అంత‌ర్జాతీయ మీడియాలు క‌థ‌నాలు రాస్తూనే ఉన్నాయి.

ఆ పాత్ర‌తోనే స‌మ‌స్య‌..

ఇప్పుడు ఇదంతా చెప్ప‌డానికి ప్ర‌ధాన కార‌ణం.. అజ‌య్ దేవ‌గ‌న్ న‌టించిన `స‌న్ ఆఫ్ స‌ర్ధార్ 2` గ‌ల్ఫ్ దేశాల‌లో రిలీజ్ స‌మ‌స్య‌ను ఎదుర్కొంది. ఈ సినిమాలో దీప‌క్ డోబ్రియ‌ల్ పోషించిన హిజ్రా పాత్ర‌తో అభ్యంత‌రాలు వ్య‌క్త‌మ‌య్యాయి. దీంతో గ‌ల్ఫ్‌లోని సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్, ఒమన్, బహ్రెయిన్, కువైట్ వంటి దేశాలలో ఈ సినిమా రిలీజ్‌కి అభ్యంత‌రం వ్య‌క్త‌మైంది. ఈ సినిమాలో హిజ్రా పాత్ర‌ అక్క‌డ చ‌ట్టాల‌కు, సాంస్కృతిక ప్రమాణాలకు విరుద్ధంగా ఉంద‌నే వాద‌న వినిపిస్తోంది.

వెకిలి కామెడీలు, ఎగ‌తాళి చేయ‌లేదు

అయితే స‌న్ ఆఫ్ స‌ర్ధార్ 2లో హిజ్రా లేదా స్వ‌లింగ సంప‌ర్కుని పాత్ర‌ను ఎంతో హైలైట్ చేస్తూ పోస్ట‌ర్ లో వేయ‌డం కూడా గ‌ల్ప్ దేశాల్లో ఇబ్బందిక‌ర ప‌రిణామాల‌కు దారి తీసిందని భావిస్తున్నారు. స‌ర్ధార్ 2లోని ఆ పాత్ర‌ హుందాగా చూపించార‌ని, వెకిలి కామెడీలు, ఎగ‌తాళి చేయ‌డం లేదా సెటైర్ల‌తో బూతు ప‌ద‌జాలంతో నింప‌లేద‌ని ప్ర‌శంస‌లు అందుకుంది. అయినా ఇదేమీ ప‌ట్ట‌ని గ‌ల్ఫ్ దేశాల్లో `స‌న్ ఆఫ్ స‌ర్ధార్ 2` సెన్సార్ ప‌ర‌మైన చిక్కులను ఎదుర్కొంది.

బూజు ప‌ట్టిన చ‌ట్టాలు:

అయితే గ‌ల్ఫ్ లో బూజు ప‌ట్టిన‌ చ‌ట్టాలు మారాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ఒక సెక్ష‌న్ క్రిటిక్స్ నుంచి సూచ‌న‌లు అందుతున్నాయి. మ‌నుషుల్లో ర‌క‌ర‌కాల వ్య‌క్తిత్వాలు ఉంటాయి. స్వ‌లింగ సంప‌ర్కుల క‌థ‌ల‌ను కూడా దుబాయ్, అర‌బ్ ఎమిరేట్స్ లో వీక్షిస్తే తప్పేమీ కాదని కొంద‌రు సూచిస్తున్నారు. ముస్లిమ్ దేశాలు ఇంకా ఇప్ప‌టికీ పాత చింత‌కాయ చ‌ట్టాల‌ను కొన‌సాగిస్తున్నాయ‌ని ఒక సెక్ష‌న్ విమ‌ర్శ‌కులు క్రిటిసైజ్ చేస్తున్నారు. అయితే ఇప్ప‌టికీ గ‌ల్ఫ్ లో ఆయా దేశాలు త‌మ సంస్కృతి సాంప్ర‌దాయాల‌ను కాపాడుకునేందుకు చ‌ట్టాల్ని అతిక్ర‌మించ‌క‌పోవ‌డంపై ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి. ఇండియా త‌ర‌హాలో స్వేచ్ఛ దుర్వినియోగంతో విశృంఖ‌ల‌త‌ను పెచ్చు మీర‌నీయ‌కుండా ఈ చ‌ట్టాలు ఉప‌క‌రిస్తాయ‌ని కూడా స‌మ‌ర్థిస్తున్నారు. స‌ర్ధార్ 2 తాజా ప‌రిణామాన్ని నిశితంగా ప‌రిశీలిస్తే, ఇక‌పై పాన్ వ‌ర‌ల్డ్ లో సినిమాలు రిలీజ్ చేయాలంటే కొంత ఆలోచించుకోవాలి. గ‌ల్ప్ లో చ‌ట్టాల ప్ర‌కారం హిజ్రా పాత్ర‌ల‌ను క‌థ నుంచి తొల‌గించ‌డానికి ద‌ర్శ‌క‌ర‌చ‌యిత‌లు ప్రాధాన్య‌త‌నివ్వాల్సి ఉంటుంది.