35 వయసులో అండం ఫ్రీజింగ్.. నటికి షాకిచ్చిన వైద్యుడు!
మునుపటితో పోలిస్తే సంతానోత్పత్తి శాతం ప్రజల్లో అంతకంతకు తగ్గిపోతోంది. ఆలస్యంగా పెళ్లి కూడా తీవ్ర పరిణామాలకు దారి తీస్తోంది.
By: Sivaji Kontham | 30 Aug 2025 10:29 AM ISTఈరోజుల్లో రకరకాల కాలుష్యాల కారణంగా మనిషి జీవితం తీవ్రంగా ప్రభావితం అవుతోంది. తినే ఆహారం, పీల్చే గాలి, మొబైల్ టవర్లు, నిత్యావసరాల కల్తీలు, తినే పండ్ల కాలుష్యం... ఇవన్నీ గర్భిణి కాబోవు మహిళను, పుట్టబోయే బిడ్డను కూడా అసాధారణంగా ప్రభావితం చేస్తున్నాయి. చాలా మంది సరోగసీలోనో లేదా ఐవిఎఫ్ లోనో బిడ్డల్ని కనాల్సిన దుస్థితి ఉంది. మునుపటితో పోలిస్తే సంతానోత్పత్తి శాతం ప్రజల్లో అంతకంతకు తగ్గిపోతోంది. ఆలస్యంగా పెళ్లి కూడా తీవ్ర పరిణామాలకు దారి తీస్తోంది.
ఈ పరిణామంలో అధునాతన సాంకేతిక విధానంలో ఒక మహిళ తన అండాన్ని(గుడ్డును) ఫ్రీజ్ చేసి ఉంచడానికి అవకాశం లభించడం భవిష్యత్ పై ఆశావహ ధృక్పథాన్ని బలపరుస్తోంది. కానీ ఇక్కడ కూడా ఒక సమస్య ఉంది. లేట్ ఏజ్ లో యువతి తన అండాన్ని ఫ్రీజ్ చేయాలనుకుంటే బిడ్డ పుట్టే శాతం తగ్గిపోయినట్టేనని వైద్యులు ధృవీకరిస్తున్నారు. ఈ విషయాన్ని బహిరంగంగా వెల్లడించి అందరికీ షాకిచ్చార ప్రముఖ కథానాయిక, రచయిత్రి సోహా అలీఖాన్. సైఫ్ అలీఖాన్ సోదరి.. ప్రముఖ హీరోకు భార్య అయిన సోహాను తెలుగు వారికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
తాజాగా ఓ పాడ్ కాస్ట్ లో సంతానోత్పత్తి నిపుణుడు డాక్టర్ కిరణ్ కోయెహ్లోతో మాటా మంతిలో పాల్గొన్న సోహా అలీఖాన్ తన జీవితంలో ఎదురైన ఒకానొక దుస్థితి గురించి బహిర్గతం చేయడం ఆశ్చర్యపరిచింది. తాను వైద్యుడిని కలిసినప్పుడు తనకు ఎదురైన అనుభవాన్ని సోహా అలీఖాన్ ఇలా వివరించారు.. ``నేను గైనకాలజిస్ట్ వద్దకు వెళ్లి నా అండాలను ఫ్రీజ్ చేయాలనుకుంటున్నానని చెప్పినప్పుడు.. 35 వయసు అంటే నువ్వు చాలా పెద్దదానివి.. ఇది సరైన వయసు కాదు! అని చెప్పారట. చాలామంది నేను చాలా చిన్నవయసులో ఉన్నానని అన్నారు. కానీ మీ అండం బిడ్డగా రూపాంతరం చెందడం ఈ వయసులో కష్టమని వైద్యుడు అన్నారు! ఆ విషయం చాలా కాలం నన్ను వెంటాడింది! అని సోహా అలీఖాన్ చెప్పారు.
ఈరోజుల్లో 30 బార్డర్ క్రాస్ చేస్తున్నా పెళ్లాడని యువతులకు కొదవేమీ లేదు. యువతీ యువకులు 35 ప్లస్ లో పెళ్లాడాలనే సంక్లిష్ఠ సమాజంలో జీవిస్తున్నారు. కెరీర్, ఉద్యోగ ఉపాధి లేదా సంపాదన పేరుతో సకాలంలో పెళ్లికి దూరమైపోవడం సమస్యగా మారింది. సోహా అలీఖాన్ కి 35 వయసులో ఎదురైన ఈ అనుభవం చాలా మందికి కనువిప్పు కావాలి. సోహా నిజాయితీగా చెప్పిన ఈ విషయం ఇతరులకు ఏమేరకు అర్థమైందో కానీ, చాలా మంది దంపతులకు పిల్లలు ఎందుకు పుట్టలేదో తెలుసుకునేందుకు మారిన జీవనశైలి, ఇతర పరిస్థితుల్ని అర్థం చేసుకోవడం ముఖ్యం.
