సోషల్ మీడియాలో పెరుగుతున్న ట్రోలింగ్.. ఆగేదెప్పటికి?
సోషల్ మీడియా ప్రాముఖ్యత ఈ రోజుల్లో చాలా పెరిగింది. ఏదైనా ఒక విషయం బయటకు రావడం ఆలస్యం, సోషల్ మీడియా పుణ్యమా అని క్షణాల్లో అది నెట్టింట వైరల్ అవుతుంది.
By: Sravani Lakshmi Srungarapu | 13 Dec 2025 11:00 PM ISTసోషల్ మీడియా ప్రాముఖ్యత ఈ రోజుల్లో చాలా పెరిగింది. ఏదైనా ఒక విషయం బయటకు రావడం ఆలస్యం, సోషల్ మీడియా పుణ్యమా అని క్షణాల్లో అది నెట్టింట వైరల్ అవుతుంది. అయితే సోషల్ మీడియాను మంచికీ, చెడుకీ రెండింటికీ ఉపయోగించవచ్చు. కాకపోతే ఉపయోగించే విధానాన్ని బట్టి దాని ఫలితం ఉంటుంది. అందుకే సోషల్ మీడియా రెండు వైపులా పదునున్న కత్తి లాంటిదని అంటుంటారు.
మితిమీరి ప్రవర్తిస్తున్న నెటిజన్లు
సోషల్ మీడియా సాయంతో ఎంతో మంది సమాజంలో పలు మార్పులు తీసుకొస్తే, ఇంకొందరు మాత్రం అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ, రెచ్చగొట్టే పోస్టులతో ఇతరులపై బురద చల్లే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే పొలిటీషియన్లు, సినీ సెలబ్రిటీలపై ట్రోలింగ్ ఎక్కువగా జరుగుతుంది. దేనికైనా హద్దు అనేది ఉంటుంది కానీ ఆ హద్దుల్ని దాటి మితి మీరుతున్నారు కొందరు నెటిజన్లు.
సెలబ్రిటీలే టార్గెట్
సెలబ్రిటీలను టార్గెట్ గా చేసకున్నిసోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయడం, అసభ్యకర పోస్టులు వేయడాలు, డీప్ ఫేక్ వీడియోలు తయారు చేయడం ఈ మధ్య మరీ ఎక్కువైపోతున్నాయి. టెక్నాలజీని విపరీతంగా డెవలప్ అయిన నేపథ్యంలో ఏఐని వాడి దాన్ని దుర్వినియోగం చేస్తూ సెలబ్రిటీల ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తున్నారు. దీంతో సైబర్ క్రైమ్ లో కేసులు కూడా ఎక్కువగా నమోదవుతున్నాయి.
కోర్టును ఆశ్రయించిన పలువురు సెలబ్రిటీలు
తమ అనుమతి లేకుండా వారి ఫోటోలు, వీడియోలను వాడటమే కాకుండా ఫేక్ ఫోటోలు, వీడియోలను క్రియేట్ చేసి వాటిని నెట్టింట వైరల్ చేస్తుండటంతో ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు కోర్టును కూడా ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ అలా చేసే వారిలో ఎలాంటి మార్పూ రాలేదు. నెటిజన్లు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరుతో అసభ్యకర పదాలు వాడి, చాలా తప్పులు చేస్తున్నారు. వీటన్నింటినీ అదుపు చేయడానికి కఠిన చట్టాలు తీసుకొచ్చి వాటిపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ ట్రోలింగ్ వల్ల సదరు సెలబ్రిటీలు మాత్రమే కాకుండా వారి కుటుంబ సభ్యులపై కూడా ఆ ప్రభావం చాలా తీవ్రంగా పడుతుంది.
