Begin typing your search above and press return to search.

డ్యాన్స్ క్వాలిటీ తగ్గుతుందా? ఎంతవరకు నిజం?

తెలుగు సినిమాల్లో పాటలకు, ముఖ్యంగా డ్యాన్స్‌, కొరియోగ్రఫీకి ప్రత్యేకమైన స్థానం ఉందని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు. ఒక మంచి పాటలోని స్టెప్స్‌, విజువల్స్‌ ప్రేక్షకుల మనసుల్లో చాలా కాలం నిలిచిపోతాయి.

By:  M Prashanth   |   8 March 2026 4:00 AM IST
డ్యాన్స్ క్వాలిటీ తగ్గుతుందా? ఎంతవరకు నిజం?
X

తెలుగు సినిమాల్లో పాటలకు, ముఖ్యంగా డ్యాన్స్‌, కొరియోగ్రఫీకి ప్రత్యేకమైన స్థానం ఉందని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు. ఒక మంచి పాటలోని స్టెప్స్‌, విజువల్స్‌ ప్రేక్షకుల మనసుల్లో చాలా కాలం నిలిచిపోతాయి. పాత సినిమాల నుంచి ఇప్పటి వరకు అనేక పాటలు డ్యాన్స్ కారణంగానే క్లాసిక్‌ లుగా నిలిచాయి. అయితే ఇటీవల సోషల్ మీడియా ప్రభావం పెరిగిన తర్వాత సినిమా పాటల కొరియోగ్రఫీ శైలిలో మార్పులు కనిపిస్తున్నాయనే చర్చ మొదలైంది.

ప్రస్తుతం ఇన్ స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ ఫుల్ పాపులర్ అయ్యాయి. పాటల్లోని చిన్న చిన్న పార్ట్స్ ను ఉపయోగించి రీల్స్, షార్ట్స్ చేయడం ఇప్పుడు ట్రెండ్‌ గా మారింది. ముఖ్యంగా కొత్తగా విడుదలయ్యే సినిమా పాటలకు నెటిజన్లు హుక్ స్టెప్స్ తీసుకుని పెద్ద ఎత్తున రీల్స్ చేస్తున్నారు. ఇది ఇప్పుడు కంప్లీట్ కామన్ విషయంగా మారిపోయింది.

సోషల్ మీడియాలో ఒక పాట వైరల్ అయితే, అది సినిమాకు కూడా మంచి ప్రమోషన్ అవుతుంది. పాటకు కోట్లాది వ్యూస్ రావడం మాత్రమే కాదు, ఆ సినిమా పట్ల కూడా ఆసక్తి పెరుగుతుంది. అందుకే కొంతమంది దర్శకులు, కొరియోగ్రాఫర్లు ఆ ట్రెండ్‌ ను దృష్టిలో పెట్టుకుని పాటలను రూపొందిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొంతమంది నెటిజన్లు మాత్రం దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పుడు కొన్ని పాటల్లోని డ్యాన్స్ స్టెప్స్ ఎక్కువగా సోషల్ మీడియా కోసం రూపొందించినట్లుగా కనిపిస్తున్నాయని చెబుతున్నారు. రీల్స్, షార్ట్స్ కు సరిపడే విధంగా స్టెప్స్ డిజైన్ చేస్తున్నారని అంటున్నారు. అంటే హీరో లేదా హీరోయిన్ ఫ్రేమ్ మధ్యలోనే నిలబడి ఉండేలా, ఎక్కువ కదలికలు లేకుండా ఉండే స్టెప్స్ రూపొందిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

దీంతో డ్యాన్స్‌ లో ఉండే స్టెప్స్, గ్రూప్ ఫార్మేషన్లు, పెద్ద స్టేజ్ మువ్మెంట్స్ తగ్గిపోతున్నాయని కొందరు అభిప్రాయపడుతున్నారు. గతంలో పెద్ద సెట్స్‌ పై భారీ డ్యాన్సర్లు పాల్గొనే పాటలు, విభిన్నమైన స్టెప్స్ ఎక్కువగా ఉండేవి. కానీ ఇప్పుడు కొన్ని పాటల్లో మాత్రం ఒకే ఫ్రేమ్‌ లో జరిగే చిన్న స్టెప్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయని అంటున్నారు. అయితే మరికొందరు మాత్రం ఆ విమర్శలను పూర్తిగా సమర్థించడం లేదు.

సోషల్ మీడియా ట్రెండ్స్‌ ను ఉపయోగించుకోవడం తప్పు కాదని వారు అంటున్నారు. ఒక పాట రీల్స్ ద్వారా వైరల్ అయితే అది సినిమాకు ప్రమోషన్ అవుతుందని చెబుతున్నారు. ఇటీవల విడుదలైన కొన్ని పాటల నేపథ్యంలో ఆ చర్చ మరింత పెరిగింది. ముఖ్యంగా రామ్ చరణ్ పెద్దిలోని రయ్ రయ్ పాట వల్ల ఆ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. మొత్తానికి సోషల్ మీడియా ప్రభావం సినిమా పాటలపై పడుతోందన్న విషయం క్లిట్ గా కనిపిస్తోంది. అయితే అది డ్యాన్స్ క్వాలిటీ తగ్గిస్తుందా? లేక కొత్త ట్రెండ్‌ కు దారి తీస్తుందా? అన్నదానిపై భిన్నాభిప్రాయాలు ఇప్పటికీ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆ విషయం సినీ వర్గాల్లో, ప్రేక్షకుల్లో చర్చనీయాంశంగా మారింది.