SM టాక్: డిఫరెన్స్ గుర్తించడం కష్టం.. కానీ అదే ముఖ్యం!
ఓ సినిమా విడుదలకు ముందు ట్రైలర్ వస్తుంది. పాటలు వస్తాయి. పోస్టర్లు వస్తాయి. వీటిపై వచ్చే రెస్పాన్స్ తో సినిమాపై బజ్ పెరుగుతుంది.
By: M Prashanth | 2 Oct 2026 3:06 PM ISTసినిమా బాగుందా.. బాగోలేదా.. అనే విషయం ఒకప్పుడు థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తెలిసేది. ఇప్పుడు మాత్రం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సినిమా ఎలా ఉందో తెలుసుకోవడానికి చాలామంది థియేటర్ కు వెళ్లకముందే సోషల్ మీడియా వైపు చూస్తున్నారు. ఒక్క పోస్ట్.. కొన్ని కామెంట్లు.. ఓ మీమ్.. అంతే. సినిమా గురించి ఓ అభిప్రాయం ముందే ఏర్పడిపోతుంది. ఇదే ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో సోషల్ మీడియా ఎఫెక్ట్ ఎంత పెరిగిందో చెప్పే విషయం.
ఓ సినిమా విడుదలకు ముందు ట్రైలర్ వస్తుంది. పాటలు వస్తాయి. పోస్టర్లు వస్తాయి. వీటిపై వచ్చే రెస్పాన్స్ తో సినిమాపై బజ్ పెరుగుతుంది. అదే సమయంలో ఏదైనా నెగిటివ్ కామెంట్స్ వైరల్ అయితే.. దానిపైనా చర్చ మొదలవుతుంది. ఆ కామెంట్ నిజమా కాదా అనేది పక్కన పెడితే.. అది ఎంతమందికి చేరిందన్నది ముఖ్యంగా మారుతోంది. ఒక ప్రేక్షకుడికి సినిమా నచ్చకపోతే తన అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో చెప్పడం కామన్. మరొకరు ఫ్యాన్ గా తన హీరో సినిమాను సమర్థించొచ్చు.
ఇంకొకరు సరదాగా ట్రోల్ చేయవచ్చు. ఇవన్నీ సోషల్ మీడియాలో ఎప్పటి నుంచో ఉన్నాయి. కానీ ఇప్పుడు వీటన్నింటి మధ్య తేడా గుర్తించడం కష్టంగా మారుతోంది. ఒకే రకమైన నెగిటివ్ కామెంట్ పదే పదే కనిపిస్తే.. అసలు సినిమా చూడని వ్యక్తికి కూడా అది నిజమైన టాక్ లా అనిపించొచ్చు. అదే విధంగా ఒక పాజిటివ్ పోస్ట్ వైరల్ అయితే.. సినిమా చూడకముందే మంచి అభిప్రాయం ఏర్పడొచ్చు. అంటే ఇప్పుడు సినిమా టాక్ కేవలం థియేటర్ లో సినిమా చూసిన వాళ్ల నుంచి మాత్రమే రావడం లేదు.
సినిమా చూడని వాళ్లు కూడా టాక్‌లో భాగమవుతున్నారు. ఇక్కడే పెయిడ్ నెగిటివిటీ అనే అంశం కూడా చర్చలోకి వస్తుంది. ఒక సినిమాపై కావాలని నెగిటివ్ ప్రచారం చేయించేందుకు డబ్బులు ఖర్చు చేస్తున్నారనే ఆరోపణలు అప్పుడప్పుడు వినిపిస్తున్నాయి. అయితే సోషల్ మీడియాలో కనిపించే ప్రతి నెగిటివ్ పోస్ట్ పెయిడ్ ప్రమోషన్ గా చెప్పలేం. దానికి సరైన ఆధారాలు ఉండాలి. అదే సమయంలో ప్రతి నెగిటివ్ టాక్‌ను సాధారణ ట్రోలింగ్ గా కూడా తీసేయలేం.
ఎందుకంటే ఒక సినిమా చుట్టూ సోషల్ మీడియాలో ఏర్పడే ఎన్విరాన్మెంట్.. ఆ సినిమాపై ప్రేక్షకుల మొదటి అభిప్రాయాన్ని ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంది. ఇది మేకర్స్ కు కొత్త సవాలుగా మారుతోంది. సినిమా తీయడం, ప్రమోట్ చేయడం మాత్రమే కాకుండా.. విడుదలకు ముందు సోషల్ మీడియాలో ఏం జరుగుతుందో కూడా గమనించాల్సి వస్తుంది.
ఏ పోస్ట్ వైరల్ అవుతోంది... ఏ టాక్ ప్రేక్షకుల్లోకి వెళ్తోంది.. అన్నీ లెక్కలోకి వస్తున్నాయి. అలా ఫ్యాన్ వార్ అయినా.. ట్రోలింగ్ అయినా.. నార్మల్ ఆడియన్స్ రెస్పాన్స్ అయినా.. పెయిడ్ నెగిటివిటీపై వచ్చే ఆరోపణలు అయినా.. బయటికి కనిపించేది మాత్రం సోషల్ మీడియా టాక్ గానే ఉంటుంది. ఆ టాక్ వెనుక అసలు కారణం, వాటి మధ్య డిఫరెన్స్ ఏంటో గుర్తించడం మాత్రం మేకర్స్ కు ఇప్పుడు చాలా ముఖ్యమని చెప్పాలి.
